
సినీ ప్రేక్షకుల వినోదం అంతా ఈ ఏడాదికి ఎలక్షన్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఫస్టాఫ్ అంతా చాలా చప్పగా సాగగా, సెకాండఫ్ లో “కల్కి”తో మొదలై పెద్ద సినిమాలన్నీ ఒక్కొక్కటిగా ‘క్యూ’ కడతాయని ఆశించారు.
కానీ సెకండాఫ్ కూడా తెలుగు సినీ ప్రేక్షకులకు చేదు వార్తలే మిగల్చనున్నాయి. ప్రేక్షకుల ఆదరణ చూరగొన్న “కల్కి”ని పక్కన పెడితే, రాబోయే అయిదు నెలల్లో ఖచ్చితంగా విడుదలయ్యే పెద్ద సినిమా ఏదైనా ఉంది అంటే, అది కొరటాల – జూనియర్ ఎన్టీఆర్ “దేవర” ఒక్కటే కనపడుతోంది.
ఆగష్టు 15వ తేదీన దేశమంతా ఊర్రూతలూగిస్తుందనుకున్న “పుష్ప 2” రిలీజ్ పై ఇటీవల చెలరేగిన ఊహాగానాలతో, డిసెంబర్ కు కూడా కష్టమేనన్న సంకేతాలు కనపడుతున్నాయి. దీంతో 2024లో బన్నీ ఎంట్రీ ప్రశ్నార్ధకమే! వీటన్నింటికి తోడు 2024 ఎన్నికల సమయంలో బన్నీ వ్యవహారతీరుపై పవన్ కళ్యాణ్ అభిమానులు ఇప్పటికీ గుర్రుగా ఉన్నారు.
టాలీవుడ్ కు ఒకప్పటి నాలుగు పిల్లర్లుగా నిలిచిన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ల చిత్రాలు కూడా వచ్చే ఏడాది సంక్రాంతి మరియు సమ్మర్లకే ముహుర్తాలు ఫిక్స్ చేసుకున్నాయి. ఈ ఏడాదిలో వెంకీ, నాగ్ లు ఎంట్రీ ఇచ్చారు గానీ, ప్రేక్షకుల ఆదరణ “అంతంత మాత్రమే!”
ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు నిర్వహిస్తోన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల రిలీజ్ డేట్స్ గురించి ఇప్పట్లో మాట్లాడుకోకపోవడమే ఉత్తమం అనే స్థాయిలో రాజకీయ రణరంగంలో మునిగి తేలుతున్నారు.
ఇక మహేష్ బాబు గురించి మరో అయిదేళ్ల పాటు మరిచిపోవడమే! ఈ ఏడాది ‘ఉగాది’ నాడు రాజమౌళి సినిమా ప్రెస్ మీట్ ఉండబోతోంది అన్న వార్త నుండి మహేష్ బాబు పుట్టినరోజు అయిన ఆగష్టు 9 నాడు కూడా ఎలాంటి ‘స్పెషల్’ న్యూస్ ఉండబోదన్న సమాచారం అయితే పక్కాగా ఉంది. దీంతో “మురారి”ని రీ రిలీజ్ చేసుకుని సంతృప్తి చెందే పనిలో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఉన్నారు.
‘రెబల్ స్టార్’ ప్రభాస్ ఇప్పటికే “కల్కి” ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయగా, పెద్ద హీరోలలో అత్యధిక సినిమాలు చేతిలో పెట్టుకుని నిరంతరం షూటింగ్ చేస్తోన్న ఏకైక అగ్ర హీరోగా నిలిచారు. ప్రభాస్ పైప్ లైన్ లో “రాజాసాబ్, సలార్ 2, స్పిరిట్, కల్కి 2” ఉన్న చిత్రాలు ఫ్యాన్స్ కు పిచ్చెక్కించే విధంగా ఉన్నాయి.
ఈ ఏడాది దసరాకు “దేవర” రిలీజ్ అంటూ ఇచ్చిన ప్రకటనను నిలబెట్టుకునే పనిలో కొరటాల – జూనియర్ ఎన్టీఆర్ లు ఉన్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ‘దేవర ముందు నువ్వెంత’ అనే సాంగ్ సెన్సేషన్ గా నిలువగా, ఈ సినిమా షూటింగ్ కూడా తుది దశకు చేరుకుంది. దీంతో “దేవర” దర్శనం పైనే తెలుగు సినీ అభిమానులు చాలా గట్టి నమ్మకం పెట్టుకున్నారు.
“ఆర్ఆర్ఆర్”లో ఎన్టీఆర్ సహచర హీరో రామ్ చరణ్ కూడా “గేమ్ చేంజర్” రిలీజ్ ను సిద్ధం చేస్తున్నారు గానీ, ఈ సినిమా విడుదల పూర్తిగా దర్శకుడు శంకర్ చేతిలో ఉండడంతో, మెగా అభిమానులంతా ‘మాకు నమ్మకం లేదు దొర’ అనే పరిస్థితి నెలకొంది. దీనికి తోడు ఇటీవల రిలీజ్ అయిన శంకర్ “భారతీయుడు 2” పూర్తిగా నిరాశపరచడంతో, దర్శకుడు శంకర్ “గేమ్ చేంజర్”పై ఇంకాస్త జాగ్రత్తలు వహించాల్సిన పరిస్థితి నెలకొంది.
ఏతావాతా చెప్పొచ్చేది ఏమిటంటే… టాలీవుడ్ కు కొత్త ఊపు రావాలంటే బాక్సాఫీస్ ముంగిట “దేవర” డ్యాన్స్ వేయాల్సిందే. ‘దేవర కలెక్షన్ల రికార్డుల ముందు నువ్వెంత’ అనే స్థాయికి ఈ సినిమాను ‘జనతా గ్యారేజ్’ కాంబో తీసుకువెళ్లాలని ఆశిద్దాం.
India's team management has come under backlash for constantly changing its opening combination in T20Is.…
Rajinikanth is going to return to the big screen tomorrow with his new film Jailer…