Telugu

“కర” సినిమా రివ్యూ: క్లోజింగ్లో మిస్ అయ్యింది!

చిత్రం: కర

M9 రేటింగ్: 2.25/5

ADVERTISEMENT

విడుదల తేదీ: ఏప్రిల్ 30, 2026

తారాగణం: ధనుష్, మమిత బైజు, కె.ఎస్.రవికుమార్, కరుణాస్, జయరాం, సురాజ్ తదితరులు

నిర్మాణ సంస్థ: వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ – థింక్ స్టూడియోస్ – విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్

దర్శకత్వం: విఘ్నేష్ రాజా

సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్

నిర్మాత: డా.ఇషారి కె.గణేష్

ఛాయాగ్రహణం: తేని ఈశ్వర్

కూర్పు: శ్రీజిత్ సారంగ్

సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా హీరోగా మాత్రమే కాక దర్శకుడిగానూ వరుసబెట్టి సినిమాలు చేస్తున్న ధనుష్ హీరోగా నటించగా విడుదలైన తాజా చిత్రం “కర”. “పోర్ తొలిల్” అనే సినిమాతో విశేషమైన స్పందన అందుకున్న దర్శకుడు విఘ్నేష్ రాజా సెకండ్ సినిమా ఇది. 1990 నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎందుకో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నమోదు చేయలేకపోయింది. మరి సినిమా ఏమేరకు ఆకట్టుకుంది అనేది చూద్దాం..!!

కథ:

కోదండరాం అలియాస్ కర (ధనుష్) చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ జీవితాన్ని గడిపేస్తూ ఉంటాడు. ఒకానొక సందర్భంలో ఓ పెద్ద దొంగతనంతో ఆపేద్దాం అనుకునే ప్రయత్నంలో పోలీసులకి దొరికిపోతాడు.

ఆ తర్వాత తనను ప్రేమించిన అమ్మాయి (మమిత)తో ఆంధ్రాలోని ఓ హోటల్ లో పని చేస్తూ సాధారణ జీవితం గడుపుతున్న తరుణంలో.. బ్యాంక్ లోన్ కోసం తన తండ్రి వద్ద ఉన్న 8 ఎకరాల పొలం తాకట్టు పెడదాం అనే ఆలోచనతో ఊరు తిరిగొస్తాడు.

ఊరు తిరిగొచ్చిన కరకి అనుకోని సంఘటనలు ఎదురవుతాయి, ఊహించని పరిణామాలు జరుగుతాయి. వాటిని తట్టుకొని ఎలా నిలబడ్డాడు అనేది “కర” కథాంశం.

నటీనటుల పనితీరు:

అది ఎలాంటి సినిమా అయినా మనకి చూస్తున్నంతసేపు సదరు పాత్ర కనిపిస్తుందే తప్ప ధనుష్ కనిపించడు. “కర”లోను అంతే. ఓ స్వార్థపరుడైన కొడుకు, ఓ రాటుతేలిన దొంగ కనిపిస్తారు. ఎమోషనల్ సీన్స్ లో ధనుష్ కళ్లల్లో కనిపించే నిజాయితీ మనల్ని కట్టిపడేస్తుంది. ముఖ్యంగా తండ్రి భౌతిక కాయాన్ని హాస్పిటల్ సిబ్బంది ట్రీట్ చేసే విధానాన్ని సహించలేకపోయే సందర్భాల్లో ధనుష్ నటన కన్నీరు పెట్టిస్తుంది.

మమిత బైజు సినిమాలో ఎందుకుందో అర్థం కాలేదు. తిప్పి కొడితే 10 నిమిషాలు కూడా లేదు ఆ అమ్మాయి సినిమాలో. ఆమె పాత్రకి కూడా పెద్దగా ప్రాముఖ్యత లేదు.

సురాజ్ క్యారెక్టరైజేషన్ కి మంచి ఇంట్రడక్షన్ ఉన్నా.. దాన్ని సరిగా సస్టైన్ చేయలేదు. జయరాం పాత్ర కూడా అంతే, అతడి పాత్రతో సినిమాని ఇంకాస్త కన్ఫ్యూజ్ చేసారు తప్పితే, సినిమాకి ఉపయోగపడలేదు.

కే.ఎస్.రవికుమార్ మాత్రం తండ్రి పాత్రలో తనదైన నటన & లుక్స్ తో కట్టిపడేసాడు. ముఖ్యంగా రోడ్డు మీద కొడుకు వెంబడి నడవలేక వయసుడికిన కళ్లల్లో ఆయన పలికించిన భావాలు ఆడియన్స్ కు కనెక్ట్ అవుతాయి.
కరుణాస్ స్క్రీన్ ప్రెజన్స్ తో పర్వాలేదనిపించుకున్నాడు.

సాంకేతికవర్గం పనితీరు:

జి.వి.ప్రకాష్ కుమార్ ఈ సినిమాకి సెకండ్ హీరో అని చెప్పొచ్చు. చాలా జాగ్రత్తగా ఎలివేట్ చేశాడు. నేపథ్య సంగీతం ఎక్కడా లౌడ్ గా లేకుండా ఉండడం మరో ప్లస్ పాయింట్. అలాగే.. చాలారోజుల తర్వాత ఒక డబ్బింగ్ సినిమాలో తెలుగు సాహిత్యం బాగా కుదిరింది. పదాలు ఇరికించబడకుండా, అర్థవంతంగా వినిపించాయి. తెలుగు వెర్షన్ డైలాగ్స్ & జియోగ్రాఫికల్ గా టైటిల్స్ విషయంలో తీసుకున్న కేర్ కూడా బాగుంది.

సినిమాటోగ్రఫీ వర్క్ డీసెంట్ గా ఉన్నా.. సీజీ వర్క్ సరిగా సహకరించలేదు. కలరింగ్ 90ల కాలం నాటి టైంలైన్ ను రీక్రియేట్ చేసినప్పటికీ.. ఎక్కడో సహజత్వం లోపించిన భావన.

దర్శకుడు విఘ్నేష్ రాజా “కర” కథను మొదలుపెట్టిన విధానం బాగుంది. మొదటి 10 నిమిషాలు భలే ఆసక్తికరంగా ఉందే అనిపిస్తుంది. తండ్రీకొడుకుల మధ్య బంధాన్ని కూడా చక్కగా రాసుకున్నాడు. అయితే.. ఓ స్వార్థపరుడైన కొడుకు.. ఒక్కసారిగా ఎలా రాబిన్ హుడ్ లాంటి హీరో అయిపోయాడు అనేది సరిగా ఎస్టాబ్లిష్ అవ్వలేదు. అందువల్ల ఆ ముగింపు చాలా అసహజంగా ఉంటుంది. ముగింపు సరైన జస్టిఫికేషన్ ఇవ్వకపోవడంతో ప్రేక్షకుడికి కూడా సంతృప్తి ఉండదు. ఆ కారణంగా దర్శకుడు విఘ్నేష్ రాజా రెండో సినిమాతో ప్రేక్షకుల్ని మొదటి సినిమా స్థాయిలో అలరించలేకపోయాడనే చెప్పాలి.

విశ్లేషణ:

ఒక ఊరి సమస్యను హీరో తీర్చడం అనేది ఎన్టీఆర్ కాలం నుండి చూస్తూనే ఉన్నాం. అయితే.. ఆ సమస్యను హీరో ఎందుకు మోశాడు? అందుకు ప్రేరేపించిన ఘటన ఏమిటి? అనేది గుండెల్లో పాతుకుపోయేలా ఉండాలి. అలాగే.. హీరోకి వచ్చే ఇబ్బందులు కూడా ప్రేక్షకుల్ని కట్టిపడేయాలి. హీరో మీద జాలి కలిగేలా ఉండాలి. “కర”లో ఇవన్నీ మిస్ అయ్యాయి. మొదటిసారీ పోలీసులకి దొరికిపోవడం, లాడ్జ్ లో బ్యాగ్ మిస్ అవ్వడం తప్ప హీరోకి పెద్దగా ఇబ్బందులేమీ ఉండవు. ప్రతిసారి ఆ దేవుడు కాపాడినట్లే, ఆఖరి నిమిషంలో తప్పించుకుంటూ ఉంటాడు. అది కూడా తన తెలివి వల్ల కాదు. అందువల్ల.. హీరోయిజం అనేది సరిగా ఎలివేట్ అవ్వక, ఊరి సమస్య తాలూకు తీవ్రతను ఓ బ్యాంక్ మేనేజర్ అత్యాశకు లింక్ చేయడం కారణంగా అందులో క్రూరత్వం ఎస్టాబ్లిష్ అవ్వక.. “కర” కథనం సెకండాఫ్ నుండి నత్త నడకలా సాగింది. హీరో మంచోడు అవ్వడంలో ఎలాంటి ఇబ్బంది లేదు కానీ.. ఆ మంచితనం ఒక్కసారిగా పెల్లుబికడం అనేది ఎంగేజింగ్ గా లేదు. ఆ కారణంగా “కర” ఓ సగటు థ్రిల్లర్ గా మిగిలిపోయింది.

ఓవరాల్ గా.. ఎస్టాబ్లిష్మెంట్ లో ఉన్న మజా.. క్లోజింగ్లో మిస్ అయ్యింది!

M9 రేటింగ్: 2.25/5

Share
Published by

Recent Posts

Yash’s Ravana Twist: Will Ramayana Delay the Big Clash?

Ramayana has received a fresh update, with reports confirming that Yash has begun shooting key…

11 minutes ago

STEM OPT a Red Flag for Employers? F1 Student Stuck

An F-1 student recently raised concerns about employability while on STEM OPT. The question has…

32 minutes ago