
గులాబీ బాస్ తన వాక్చాతుర్యంతో తిమ్మిని బమ్మిని చేసి ప్రజలను నమ్మించగలరని అందరికీ తెలుసు. అలాగే తన వ్యూహాలతో బిజెపిని సైతం మట్టిగరిపించగలరని ‘ఫామ్‌హౌస్ ఫైల్స్,’ మునుగోడు విజయంతో మరోసారి నిరూపించుకొన్నారు. అయితే ఆయన మాటలకి, వ్యూహాలకి కమ్యూనిస్టులు కూడా బుట్టలో పడిపోతారని బహుశః ఎవరూ భావించి ఉండరు. కానీ పడ్డారు. ఎందుకో ఊహించుకోవచ్చు.
తమ భుజాలపై తుపాకీ పెట్టి మోడీకి గురిపెట్టేందుకు వారు కేసీఆర్‌ని అనుమతించారు కనుక మోడీ-కేసీఆర్ పోరాటంలో వారు కూడా అప్రయత్నంగానే భాగస్వాములు అయిపోయారు. ఈనెల 12వ తేదీన ప్రధాని నరేంద్రమోడీ విశాఖలో కార్యక్రమాలు ముగించుకొన్న తర్వాత నేరుగా హైదరాబాద్ చేరుకొని అక్కడి నుంచి రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీని ప్రారంభించడానికి వెళ్ళబోతున్నారు.
ఆయన తెలంగాణ రాష్ట్రానికి ఏమీ చేయలేదు కనుక అడ్డుకొంటామని టిఆర్ఎస్ ప్రకటించేసింది. టిఆర్ఎస్తోనే మేము కూడా… అని కమ్యూనిస్టులు కూడా ప్రకటించేశారు. టిఆర్ఎస్ శ్రేణులతో కలిసి వామపక్షాలు కూడా ప్రధాని పర్యటనని అడ్డుకొంటాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, మాజీ కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి ఈరోజు ప్రకటించారు.
కేసీఆర్‌కి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో పడటం లేదు కనుక కమ్యూనిస్టులకు కూడా ఆమెపై హటాత్తుగా కోపం పుట్టుకొచ్చేసింది. అందుకు వారు ఓ కారణం కూడా వెతికి పట్టుకొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో యూనివర్సిటీలలో ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో బిల్లు ఆమోదించి గవర్నర్‌కి పంపిస్తే దానికి ఆమె ఆమోదముద్ర వేయకుండా కుట్రలు చేస్తున్నారనేది వారి ఆరోపణ. కనుక త్వరలో రాజ్‌భవన్‌ని ముట్టడిస్తామని కూనంనేని సాంబశివరావు ప్రకటించారు.
తెలంగాణలో వామపక్షాలు ఒకపుడు నిజాం దొరలకి వ్యతిరేకంగా పోరాటాలు చేశాయి. అందుకే నేటికీ వాటికి ప్రజలలో అంత గుర్తింపు, గౌరవం ఉన్నాయి. కానీ ఇప్పుడు కేసీఆర్ దొరకి సలాం, గులాం అంటున్నాయి. కేసీఆర్‌తో దోస్తీ అంటే పులిమీద సవారీ అని వామపక్ష నేతలకు తెలుసో తెలీదో కానీ ఇప్పటికే సవారీ మొదలుపెట్టారు కనుక మద్యలో దిగడం సాధ్యం కాదు. కనుక పులి మీద సవారీ చేస్తూ మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు ఎదురెళ్లి పోరాడక తప్పదు. పాపం కమ్యూనిస్టులు!
Nani and Vijay Deverakonda are moving away from the romantic entertainers and emotional dramas that…
Dharshna Sripal turns up the charm in this glossy, mood fresh gallery that blends soft…