
ఇప్పుడు ఆంధ్రాలో ఏ నోట విన్నా ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’ అనే మాట వినిపిస్తోంది. దీని వలన భూములపై యజమానులకు తిరుగులేని శాస్విత హక్కులు లభిస్తాయని వైసీపి వాదిస్తుండగా, యజమాన్యపు హక్కులు ప్రభుత్వం చేతిలోకి వెళ్లిపోతాయని టిడిపి, జనసేనలు వాదిస్తున్నాయి.
పరిశ్రమలు, అభివృద్ధి పనుల కోసం భూసేకరణ చేయాల్సి వచ్చినప్పుడు ప్రైవేట్ భూములపై వివాదాలు ఉంటే న్యాయవివాదాలు ఎదుర్కోవలసి వస్తుంది కనుక ప్రభుత్వం ఈ చట్టం తీసుకువచ్చిందని న్యాయనిపుణులు చెపుతున్నారు.
దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్: 512 జారీ చేసింది. ఏపీ భూహక్కుల చట్టం గత ఏడాది అక్టోబర్ 31 నుంచే రాష్ట్ర వ్యాప్తంగా అమలులోకి వస్తుందని దానిలో పేర్కొంది.
దీనిపై ఇంత వివాదం చెలరేగడానికి 2 ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి.
1. ఎప్పుడైనా భూయాజమాన్యపు హక్కుల వివాదం ఏర్పడితే కోర్టులకు వెళ్ళే అవకాశం లేకుండా చేయడం. దాని కోసం అప్పీలేట్ ట్రైబ్యూనల్‌కు వెళ్ళాల్సి ఉంటుంది. కోర్టులు దీనిలో జోక్యం చేసుకోలేవు.
2. భూయజమాన్య హక్కులను నమోదు చేసేందుకు ప్రభుత్వం టైటిలింగ్ అధికారులను నియమించింది. కనుక వారి దయాదాక్షిణ్యాలతోనే యాజమాన్య హక్కులు నమోదు చేయబడతాయి. వారు అధికార పార్టీకో, లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారులకో లేదా రాజకీయ నాయకుల ఒత్తిడితో భూయాజమాన్యపు హక్కులను మార్చేయగలరనే అనుమానాలున్నాయి.
ఈ వివాదాస్పద చట్టంపై ఇప్పటికే హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. రాష్ట్ర రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాద రావు స్పందిస్తూ, “రైతులకు మేలు చేయాలనే ఉద్దేశ్యంతోనే మా ప్రభుత్వం ఈ చట్టం తీసుకువచ్చింది తప్ప ఎవరి భూములు లాక్కొనేందుకు కాదు. అయినా దీనిపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి కనుక తప్పకుండా పునరాలోచన చేస్తాము. దీనిపై టిడిపి, జనసేనలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.
భూముల కొనుగోలు, అమ్మకాలు కొనుగోలుదారు, అమ్మకందారు మద్య జరిగే ఓ ప్రైవేట్ వ్యవహారం. దశాబ్ధాలుగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో ఈ ప్రక్రియ సాగుతోంది. ఈ ప్రక్రియ ద్వారా ప్రభుత్వానికి స్టాంప్ డ్యూటీ రూపంలో భారీగా ఆదాయం కూడా లభిస్తోంది. కనుక ఈ ప్రక్రియలో మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరమే లేదు.
కానీ ఉందని చెపుతూ జగన్ ప్రభుత్వం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకువచ్చి, రాష్ట్రంలో భూములపై గుత్తాధిపత్యం తన చేతిలోకి తీసుకుంటోందని టిడిపి, జనసేనలు, న్యాయనిపుణులు వాదిస్తున్నారు.
దీనికి బలమైన కారణం కూడా కనిపిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. కొత్తగా అప్పులు పుట్టే పరిస్థితి లేదు. ఉన్నా ఏదో ఒకటి తనకా పెట్టాల్సిందే. ఇప్పటికే పలు ప్రభుత్వాస్తులను జగన్ ప్రభుత్వం తాకట్టు పెట్టి అప్పులు తెచ్చిందని టిడిపి, జనసేనలు వాదిస్తున్నాయి.
కానీ అదీ ఏ మూలకు సరిపోవడం లేదు. కనుక ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా రాష్ట్రంలో ప్రజలందరి భూములను తన అధీనంలో తెచ్చుకోగలిగితే వాటిని కూడా తాకట్టు పెట్టేసి అప్పు తెచ్చుకోవచ్చని జగన్ ప్రభుత్వం దురాలోచన చేస్తోందని టిడిపి, జనసేనలు వాదిస్తున్నాయి. కనుక మళ్ళీ వైసీపి అధికారంలోకి వస్తే ఈ చట్టాన్ని ప్రయోగించి ప్రజల భూములను తన అధీనంలో తీసుకుంటుందని పవన్ కళ్యాణ్ హెచ్చరిస్తున్నారు.
టిడిపి హయాంలో అమరావతి కోసం తీసుకున్న భూముల విషయంలో కూడా జగన్ ప్రభుత్వం రైతులను మోసగిస్తున్నందున, ఈ ‘ల్యాండ్ టైటిల్ యాక్ట్’ వెనుక కూడా అటువంటి దురుదేశ్యం ఉండవచ్చని టిడిపి, జనసేనలు వాదిస్తున్నాయి.
రైతులకు భూమే జీవనాధారం. దానితో వారికున్న అనుబందం ఇతరులకు అర్దం కాదు. కనుక జగన్ ప్రభుత్వం ఏ ఉద్దేశ్యంతో దీనిని ప్రవేశపెట్టినప్పటికీ వారిలో అనుమానాలు, ఆందోళన మొదలయ్యాయి. కనుక ఈ ఎన్నికలలో ఇదే వైసీపి కొంప ముంచే అవకాశం కనిపిస్తోంది.
Vijay Deverakonda’s Ranabaali is heading towards release with a big overseas target, but the early…
After missing its October 9 release, Venkatesh and Trivikram’s Aadarsha Kutumbam AK47 was reportedly heading…