మన గాన కోకిల జానకమ్మ ఇక లేరు

ప్రముఖ నేపధ్య గాయని ఎస్.జానకి (88) శనివారం సాయంత్రం మైసూరులో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో తుది శ్వాస విడిచారు. గత కొంత కాలంగా ఆమె వృద్ధాప్య సంబందిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.

ఎస్.జానకి గురించి తెలియనివారు ఉండరు. ఆమె కట్టుబొట్టు చూసి ఆమె తమిళియన్ లేదా మలయాళీ అనుకునేవారు చాలా మందే ఉన్నారు. కానీ ఆమె మన ఆంధ్రాలో జన్మించినవారే. ఆమె 1938, ఏప్రిల్‌ 23న గుంటూరు జిల్లా రేపల్లె మండలం పల్లపట్ల గ్రామంలో జన్మించారు. తల్లి తండ్రులు మరణించిన తర్వాత ఆమె చాలా కాలం రాజమహేంద్రవరంలోని ఇన్నీసుపేటలో తన సోదరి రాధాదేవి వద్ద 11 ఏళ్ళపాటు ఉన్నారు.

ADVERTISEMENT

ఎస్.జానకి మూడేళ్ళ వయసు నుంచే పాటలు, సంగీతం పట్ల ఆసక్తి చూపడం చూసి తల్లితండ్రులు ఆమెను సంగీతం విద్వాంసుల వద్ద చేర్పించారు. అలా మొదలైన ఆమె పాటల ప్రయాణం ఆమెను చెన్నై ఏవీఎం స్టూడియోకి చేర్చింది. అక్కడ నెల జీతానికి అక్కడ చేరిన మరుసటి రోజే ఘంటసాలతో కలిసి ‘ఎమ్మెల్యే’ సినిమా కోసం ‘నీ ఆశ అడియాస చేజారే మణిపూస,’ విషాద గీతం పాడారు. నేటికీ ఆ పాట వినిపిస్తూనే ఉంటుంది.

మరో విచిత్రం ఏమిటంటే, తమిళ, కన్నడ, మళయాళ భాషల్లో ఆమె పాడిన మొట్ట మొదటి పాటలు కూడా విషాద గీతాలే. ఆమె సినీ పరిశ్రమలో ప్రవేశించిన మొదటి సంవత్సరంలోనే ఏకంగా 600 పాటలు పాడారు.

తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీతో సహాయ మొత్తం 17 భాషల్లో 50 వేలకు పైగా పాటలు పాడారు. వాటిలో సింహళం (శ్రీలంక), జర్మన్, జపనీస్ పాటలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలలో ఆమె పాడిన పాటలతో అందరూ ఆమెని తమ గాయని అనుకునేలా చేశారు.

తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ గాయకులు ఘంటసాల, పీబీ శ్రీనివాస్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కేజే ఏసుదాసు, ఇళయరాజా, ఫై.జయచంద్రన్, ఎంఎస్ విశ్వనాథన్, ఎఆర్ రెహమాన్ వంటి పలువురితో కలిసి ఆమె పని చేశారు.

తెలుగులో ఆమె పాడిన పాటల్లో ఎన్నటికీ మారువలేని మధుర గీతాలు లెక్కించడం కష్టం. అన్ని ఉన్నాయి. నీలి మేఘాలలో (బావా మరదళ్ళు) తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు (శ్రీవారికి ప్రేమలేఖ), మంచుకురిసే వేళలో (అభినందన), అరే ఏమైందీ (ఆరాధన), బంటి చామంతీ (అభిలాష), సిరిమల్లె పువ్వా (పదహారేళ్ళ వయసు), మౌనమేలనోయి (సాగర సంగమం), గోవులు తెల్లన (సప్తపది), మాటే మంత్రమూ (సీతాకోకచిలుక) గున్నమామిడీ కొమ్మమీద (బాల్యమిత్రులు) వంటివి లెక్కలేనన్ని ఉన్నాయి.

కార్తీకదీపం సినిమా కోసం ‘నీ చేతులలో తలవాల్చి’ అనే విషాదగీతాన్ని స్టూడియోలో రికార్డింగ్ చేస్తున్నప్పుడు ఆమె భర్త రాంప్రసాద్ గుండెపోటుతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సినిమాలో ఆ పాటని విని చూసినప్పుడు చాలా మంది మహిళలు కన్నీళ్ళు పెట్టుకున్నారు. కానీ ఆమె భర్త పరిస్థితికి తల్లడిల్లుతూ పాడారనే విషయం చాలా మందికి తెలియదు.

సినీ సంగీత రంగంలో ఆమె సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం 2013లో పద్మభూషణ్ అవార్డుతో సహా నాలుగు జాతీయ అవార్డులు, 32 రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు, అనేక సినీ అవార్డులు ఆమె అందుకున్నారు.

ఆమె మొదటిసారిగా 1957లో విడుదలైన విధియన్ విలైయాట్టు’ సినిమాకి పాడగా, 2018లో ‘పన్నాడి’ అనే తమిళ సినిమా కోసం పాడారు. ఆ తర్వాత ఆమె వేదికలపై, సినిమాల కోసం పాటలు పాడటం మానేశారు.

ఇప్పుడు ఆమె మన మద్య భౌతికంగా లేకపోయినా ఆమె పాడిన మధురాతి మధురమైన పాటలతో ఎప్పటికీ మన మధ్యే ఉంటారు. ఆమె పాట వినపడిన ప్రతీసారి జానకమ్మ పాట అనుకోకుండా ఉండలేము.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

MS Subbulakshmi Amma Chose This Team

The grand launch of the M.S. A Legacy On Screen Launch event was held at…

4 hours ago

“Feel So Bad for London:” Hindu Ritual in London Sparks Debate.

An Instagram reel showing a chariot procession in Lewisham, London, has gone viral. The footage…

4 hours ago