
అయితే ప్రభుత్వం, అధికారం తమ చేతిలోనే ఉండగా ఆ రెండూ టిడిపి, జనసేన అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చేతుల్లో ఉన్నట్లు, అందుకే తాము మూడు రాజధానులు ఏర్పాటుచేయలేకపోతున్నామన్నట్లు వారు ఆయనపై విరుచుకుపడుతుండటం చాలా విడ్డూరంగా ఉంది. ఈరోజు ర్యాలీలో అందరూ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లే మూడు రాజధానులకు అడ్డుపడుతున్నారంటూ వారిపై నిప్పులు చెరిగారు. ఇదెలా ఉందంటే రాజుగారు ఏడు చేపల కధలా ఉందని చెప్పవచ్చు.
మంత్రులందరూ గిరిగీసికొన్నట్లు వారివురినే విమర్శిస్తుంటే, కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం మాత్రం కాస్త వెరైటీగా సినీ పరిశ్రమపై తన బాణం ఎక్కుపెట్టారు.
“అయ్యా! తెలుగు సినీ పరిశ్రమలో పెద్దల్లారా! రాయలసీమ బిడ్డగా మీ అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. మీరందరూ మా రాయలసీమ పేరు చెప్పుకొని సినిమాలు తీస్తుంటారు. కర్నూలులో అనేక సినిమా షూటింగ్లు చేసుకొంటారు. వేల కోట్లు సంపాదించుకొంటున్నారు. ఇప్పుడు మా కర్నూలులో న్యాయరాజధానికి మద్దతుగా మీరందరూ నోరు విప్పి మాట్లాడాలని హెచ్చరిస్తున్నాను,” అని అన్నారు.
మొదట విజ్ఞప్తి చేస్తున్నానంటూ మొదలు పెట్టి వేలకోట్లు సంపాదించుకొంటున్నారుగా… మాట్లాడాల్సిందే అంటూ హెచ్చరిస్తున్నానని ముగించడం గమనిస్తే వైసీపీ నేతలు ఏ స్థాయిలో ప్రతీ పరిశ్రమని ఒత్తిడికి గురిచేస్తున్నారో గ్రహించవచ్చు.
కర్నూలులో న్యాయరాజధాని ఏర్పాటు చేయాలనేది వైసీపీ ప్రభుత్వ ప్రతిపాదన. దానిని అమలుచేయాల్సింది కూడా అదే. కానీ ఆ పనిచేయకుండా ఇలా అందరినీ ఆడిపోసుకొంటూ, బెదిరిస్తుండటం చాలా దారుణం.
సినీ పరిశ్రమ ఒక్క ఏపీ, తెలంగాణలతో సహా అనేక రాష్ట్రాలలో, విదేశాలలో కూడా సినిమాలు తీస్తుంటుంది. కనుక అన్ని రాష్ట్రాల, దేశాల సమస్యల గురించి వారు మాట్లాడాలంటే కుదురుతుందా?అయినా మంత్రి పదవులో ఉన్న గుమ్మనూరు జయరాం ఈవిదంగా సినీ పరిశ్రమని బహిరంగంగా బెదిరించడం చాలా తప్పు.
సినీ పరిశ్రమ ‘సాఫ్ట్ టార్గెట్’ కనుకనే అందరికీ అలుసుగా కనిపిస్తోందని చెప్పవచ్చు. సినీ పరిశ్రమలో ఉన్నవారు వైసీపీ ప్రతిపాదనలను వ్యతిరేకించకూడదు… వ్యతిరేకిస్తే మీ పిలక మాచేతుల్లోనే ఉంది మీ భరతం పడతాం’ అని మెడ మీద కత్తి పెట్టి మద్దతు కోరుతున్నట్లుంది. ఈ విదంగా బెదిరిస్తుంటే అందరికీ తమ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరుగుతుందని, చేజేతులా శత్రువులను పెంచుకొంటున్నామని దేశముదురు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రహించకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.
The fifth T20I between India and West Indies was washed out due to rain at…
Vijay Deverakonda’s Ranabaali is trying to maintain momentum at the box office after receiving mixed…