
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయులందరినీ 2024 సార్వత్రిక ఎన్నికల విధులకి ఉపయోగించుకోకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ ఉచిత, నిర్బంద విద్యాహక్కు చట్టం-2010లో నియమనిబందనలకి సవరణ చేస్తూ జీవో నంబర్: 185, గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. దీనికి సంబందించిన ఫైలుని ఆన్లైన్లో సోమవారం సాయంత్రం సంబంధిత శాఖల మంత్రులకి పంపించి వారి ఆమోదం తీసుకొంది.
తాజా ఉత్తర్వుల ప్రకారం ఇకపై ఉపాధ్యాయులను భోధనేతర పనులకు ఉపయోగించరాదు. విద్యకి సంబందించిన పనులకు మాత్రమే వినియోగించుకోవలసి ఉంటుంది. ఒకవేళ ఇతర పనులకు ప్రభుత్వోద్యోగులు సరిపోనప్పుడు మాత్రమే ఉపాధ్యాయుల సేవలను ఉపయోగించుకోవాలని పేర్కొంది.
కేంద్ర ప్రభుత్వం విద్యాహక్కు చట్టం 2009లో సెక్షన్ 27 ప్రకారం జనాభా లెక్కలు, ప్రకృతి విపత్తుల సహాయం, స్థానిక సంస్థలు, శాసనసభ, లోక్సభ ఎన్నికల విధులకి మినహా ఇతర పనులకు ఉపాధ్యాయులను ఉపయోగించకూడదు. కనుక ఆ సెక్షన్ ప్రకారం “ఉపాధ్యాయులను భోధనేతర పనులకు వినియోగించకూడదనే అంశాన్ని బలోపేతం చేసేందుకే” ఈ సవరణలు చేసినట్లు తాజా ఉత్తర్వులలో ప్రభుత్వం పేర్కొంది.
కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో జారీ చేసిన ఉత్తర్వులను ఇప్పుడు ప్రస్తావిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి ఉపాధ్యాయులకి మద్యం షాపుల వద్ద డ్యూటీలు వేసినప్పుడు ఆ చట్టం, సెక్షన్ గుర్తుకు రాలేదా?అయినా ఉపాధ్యాయులపై ప్రభుత్వానికి హటాత్తుగా ఇంత ప్రేమ, గౌరవం ఎందుకు పుట్టుకొచ్ఛిన్నట్లు?అంటే సమాధానం అందరికీ తెలుసు.
రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉపాధ్యాయులను ఏదో విదంగా ఇబ్బంది పెడుతూనే ఉంది. ముఖ్యంగా నెలనెలా సకాలంలో జీతాలు చెల్లించకపోవడంతో వారు తీవ్ర అసహనంతో ఉన్నారు. ఇక పీఆర్సీ అమలు విషయంలో ప్రభుత్వోద్యోగ సంఘాలు ‘ఛలో విజయవాడ’కి పిలుపునిచ్చినప్పుడు ఉపాధ్యాయులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఆ తర్వాత కూడా వారు డీయే బకాయిలు, ఇతర డిమాండ్ల కోసం తరచూ నిరసనలు చేస్తూనే ఉన్నారు. అందుకే వైసీపీ ప్రభుత్వం తమపై కక్ష కట్టినట్లు వ్యవహరిస్తోందని ఉపాధ్యాయులు భావిస్తున్నారు. తమ ప్రభుత్వం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న ఉపాధ్యాయులను ఎన్నికల విధులు అప్పగించినట్లయితే వారు వైసీపీని ఓడించేందుకు చేయగలిగినంతా చేస్తారనే భయం ప్రభుత్వానికి ఉండి ఉండవచ్చు.
రాబోయే ఎన్నికల కోసమే ప్రత్యేకంగా సృష్టించుకొన్న సచివాలయ, వాలంటీర్ వ్యవస్థలను వినియోగించుకోవాలనే ఆలోచన కూడా ఉండి ఉండవచ్చు. ఒకవేళ వాలంటీర్లను ఎన్నికల విదులకి దూరంగా ఉంచాలని ఎన్నికల సంఘం, న్యాయస్థానం ఆదేశించినా ఓటర్లను ప్రభావితం చేసేందుకు తప్పకుండా వినియోగించుకొంటుందని వేరే చెప్పక్కరలేదు.
ఎన్నికల విధులకి ఉపాధ్యాయులని పక్కన పెట్టినా ప్రభుత్వోద్యోగులను వినియోగించుకోక తప్పదు. కానీ వారు కూడా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం, అసహనంతో ఉన్నారు. కనుక ఎన్నికలకు ముందు వారికి కొన్ని వరాలు ప్రకటించి ప్రసన్నం చేసుకొనే ప్రయత్నం చేయవచ్చు.
గత మూడున్నరేళ్ళుగా ప్రభుత్వోద్యోగులను, ఉపాధ్యాయులను చులకనగా చూస్తున్న వైసీపీ ప్రభుత్వానికి ఎన్నికల దగ్గర పడుతున్నప్పుడు వారు తలుచుకొంటే తమ పార్టీని దెబ్బతీయగలరని గ్రహించినట్లుంది. కానీ చేతులు కాలాక ఆకులు పట్టుకొని ఏం ప్రయోజనం?
The fifth T20I between India and West Indies was washed out due to rain at…
Vijay Deverakonda’s Ranabaali is trying to maintain momentum at the box office after receiving mixed…