
గన్నవరంలో టీడీపి కార్యాలయంపై దాడి కేసు నుంచి తప్పించుకోవడానికి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, అనుచరులు కలిసి సత్యవర్ధన్‌ని కిడ్నాప్ చేసి హైదరాబాద్ తీసుకుపోయి బెదిరించి భయపెట్టి అతని చేత ఆ కేసు వాపసు తీసుకునేలా చేశారు.
కానీ కొండ నాలుకకి మందు వేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందన్నట్లు వారిపై కొత్తగా కిడ్నాప్ కేసు నమోదైంది. గన్నవరంలో టీడీపి కార్యాలయంపై దాడి కేసుకి ఆ కిడ్నాప్ కేసు బలమైన సాక్ష్యంగా మారింది.
పరకామణి కేసులో కూడా వైసీపీ నేతలు ఇలాంటి ప్రయత్నమే చేసి అడ్డంగా బుక్ అయిపోయారా?అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
పరకామణిలో దొంగతనాలను బయటపెట్టిన మాజీ విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్, ఈ కేసులో విచారణకు హాజరయ్యేందుకు ఇటీవల రైల్లో తిరుపతి వస్తుంటే దారిలో హత్య చేయబడిన సంగతి తెలిసిందే.
ఈ వార్త తెలిసిన వెంటనే పోలీసుల కంటే ముందుగా వైసీపీ ‘అది ఆత్మహత్య’ అని నిర్దారించేసింది. దానికి పోలీసుల వేధింపులే కారణమని తేల్చి చెప్పేసింది.
కేసుల విచారణ, దోషుల నిర్ధారణ ఇంత సులభమని తెలియక అక్రమాస్తులు, వివేక హత్య కేసులను న్యాయస్థానాలు ఏళ్ళ తరబడి విచారణ జరుపుతూనే ఉన్నాయి. అది వేరే విషయం.
పరకామణి కేసులో భూమన కరుణాకర్ రెడ్డి, టిటిడీ కల్తీ నెయ్యి వ్యవహారంలో వైవీ సుబ్బారెడ్డి మెడలకి ఉచ్చు బిగుసుకుంటోంది.
వివేక హత్య కేసులో ముఖ్య సాక్షులను ఇలాగే ఒకరొకరిని లేపేస్తూ అడ్డు తొలగించుకుంటున్నారని, అలాగే ఈ కేసులు మెడకు చుట్టుకునే ప్రమాదం కనిపిస్తున్నందున సతీష్ కుమార్‌ని కూడా హత్య చేయించేసి కీలకమైన సాక్షి లేకుండా అడ్డుతొలగించుకున్నారని టీడీపి నేతలు వాదిస్తున్నారు.
ఈ కేసు విచారణ జరుగుతున్నప్పుడు ముఖ్య సాక్షి సతీష్ కుమార్ అనుమానాస్పదంగా మృతి చెందడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసు విచారణ ముగిసేవరకు సాక్షులకు పూర్తి భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశించింది.
వివేకా హత్య కేసులో కీలక సాక్షులు వాచ్ మ్యాన్ రంగన్న, కేఎస్ రెడ్డి, కేజీ రెడ్డి, డ్రైవర్ నారాయణ తదితరులు అనుమానస్పద స్థితిలో చనిపోయారు. ఇప్పుడు ఈ పరకామణి కేసులో సతీష్ కుమార్ చనిపోవడంతో ఈ కేసులో కూడా అలాగే జరుగబోతోందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అయినా వివేకా వంటి రాజకీయ ప్రముఖుడిని ఎవరు హత్య చేశారో కనిపెట్టలేకపోతున్నప్పుడు, సతీష్ కుమార్‌ని ఎవరు హత్య చేశారో కనిపెట్టడం సాధ్యమేనా?
సాధ్యమేనని పోలీసులే నిరూపించాలి. సతీష్ కుమార్‌ని ఎవరు హత్య చేశారో పోలీసులు కనిపెట్టగలిగితే, ఆ ఆధారాలతో పరకామణి దొంగలని పట్టుకోగలుగుతారు. లేకుంటే ఇలాంటి డజన్ల కేసుల గురించి రోజూ మీడియా వచ్చే వార్తలలో ఇది కూడా చేరిపోతుంది. కాలగర్భంలో మాయమైపోతుంది.
For the first time in Bigg Boss history, there is a double eviction in the…
Toxic has emerged as an epic disaster at the box office. While the movie bombed…