
నిజమే… కేంద్రం చెప్పిన మాటలు ఆచరణలో ఉంటే ఖచ్చితంగా ఏపీకి లభించిన ప్రత్యేక ప్యాకేజ్ లాభించినట్లే. కానీ చెప్పేదొకటి… చేసేదొకటి… అన్న తీరుగా వ్యవహరిస్తున్న కేంద్రంపై ఆంధ్రప్రదేశ్ మరోసారి దండెత్తాల్సిన సమయం ఆసన్నమైనట్లుగా కనపడుతోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పటికే ప్యాకేజ్ కు రాజముద్ర వేయడంతో, ‘స్పెషల్ స్టేటస్’ గురించి పోరాడే అవకాశం లేదు. అలాగే ‘ప్రత్యేక హోదా’ రాదని తెలిసిన తర్వాత రాజకీయ ప్రయోజనం కోసం ప్రాకులాడిన వైసీపీ అధినేత జగన్ కు కూడా ఈ అవకాశం లేదన్నది స్పష్టం.
ఇటీవల జగన్ చేస్తున్న ప్రసంగాలలో ‘స్పెషల్ స్టేటస్’ అన్న అంశం అసలు పలుకనే లేదు. అలాగే ప్రతిష్టాత్మక పార్టీ ప్లీనరీలో కూడా ‘స్పెషల్ స్టేటస్’ అన్న పదం ఎత్తలేదు. దీంతో తనపై ఉన్న కేసుల రీత్యా… త్వరలో బిజెపితో కలవడానికి జగన్ సన్నద్ధమైనట్లు వార్తలు ఖరారు కావడంతో, కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపికి ఎదురు నిలిచి, ఏపీకి దక్కాల్సిన ‘స్పెషల్ స్టేటస్’ గురించి జగన్ పోరాడే అవకాశాలు ఏ మాత్రం లేవన్నది స్పష్టం. బరిలో ఉన్న మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ ఉన్నా లేనట్టే!
ఇక ఆంధ్రప్రదేశ్ తరపున నిలిచింది ఒకే ఒక్కడు… అతనే ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్. అయితే ఉన్నట్లుండి ‘స్పెషల్ స్టేటస్’ గురించి పవన్ ఏ విధంగా పోరాడగలరు? అంటే… ఆ అవకాశాన్ని కేంద్రమే కల్పించనుంది. అవును… స్వార్ధ రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా బిజెపి అడుగులు వేస్తుందన్న విషయం దాదాపుగా ఖరారైంది. ఇప్పటివరకు ఏ కల్లబొల్లి కబుర్లైతే చెప్పి ఏపీ జనాలను శాంతిపరిచారో, అవన్నీ ఒట్టి బూటకపు మాటలుగా తేలే రోజు దగ్గరలోనే ఉండడంతో మరోసారి ‘స్పెషల్ స్టేటస్’ అంశం హైలైట్ కానుంది.
ప్రస్తుతం దేశంలో స్పెషల్ స్టేటస్ అనుభవిస్తున్న హిమాచల్ ప్రదేశ్ వంటి ఈశాన్య రాష్ట్రాలతో పాటు ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలకు కూడా ‘స్పెషల్ స్టేటస్’ దూరం కానుంది అని బిజెపి వర్గాలు చెప్పిన మాటల్లో నిజం లేదని తేలనుంది. ఎందుకంటే మరో పదేళ్ళ పాటు ఆయా రాష్ట్రాలకు ‘ప్రత్యేక హోదా’ను పొడిగించే ఉద్దేశాన్ని స్వయంగా కేంద్రమే తీసుకుంది. 2027 వరకు పన్ను రాయితీలను వర్తింపచేస్తూ 27,413 కోట్ల భారాన్ని ‘స్పెషల్ స్టేటస్’ రూపంలో అనుభవించేందుకు కేంద్రం సిద్ధమైంది.
దీంతో వెంకయ్య నాయుడు చెప్పినట్లుగా ‘ప్రత్యేక హోదా’ అనేది ముగిసిపోయిన అధ్యాయం కాదు. నాడు పవన్ ఇవే వ్యాఖ్యలను పదే పదే వ్యాఖ్యానించిన వైనం తెలిసిందే. దీంతో కేంద్రంపై పోరాడడానికి, ప్రజల్లో గుర్తింపు తెచ్చుకోవడానికి ఇంతకుమించిన అవకాశం పవన్ కళ్యాణ్ కు మరొకటి రాదనే చెప్పాలి. టిడిపి, వైసీపీలకు ఈ అవకాశం లేకపోవడంతో… పవన్ గనుక ‘స్పెషల్ స్టేటస్’ నినాదాన్ని బలంగా పట్టుకుని నిలబడితే, అది పవన్ ను ఎక్కడికి తీసుకువెళ్తుందో కూడా అంచనా వేయడం అసాధ్యం. మరి ‘జనసేన’ అధినేత ఆ దిశగా అడుగులు వేస్తారా? అన్నది మాత్రం మిలియన్ డాలర్స్ ప్రశ్న!
Telugu cinema has always been heavily dependent on star power. Big heroes bring big openings,…
Pawan Kalyan was one of the individuals to firmly stand by the Chandrababu Naidu family…