
ఇంతకాలం సినీ ఇండస్ట్రీలో ‘వర్మ’ అంటే ‘రాంగోపాల్ వర్మ’ అన్నట్లే ఉండేది. కానీ హనుమాన్ సినిమా తర్వాత వర్మ అంటే యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ అనే అందరూ భావిస్తున్నారంటే అతిశయోక్తి కాదు.
కల్కి, జాంబిరెడ్డి వంటి సినిమాలతో మంచి ప్రతిభ కలిగిన దర్శకుడుగా ప్రశాంత్ వర్మ పేరు సంపాదించుకున్నాడు. కానీ హనుమాన్ సినిమాతో కలెక్షన్స్ కనకవర్షం కురిపించేలా చేసి ప్రశాంత్ వర్మ టాలీవుడ్ అగ్ర దర్శకులలో ఒకరిగా మారిపోయాడు. ఇది చాలా అభినందనీయమే.
అయోధ్య రామ మందిరంలో ‘బాలక్ రామ్’ ప్రాణప్రతిష్ట జరుగుతున్నప్పుడే తన తదుపరి సినిమా ‘జై హనుమాన్’ ప్రారంభిస్తున్నట్లు ప్రశాంత్ వర్మ ప్రకటించాడు. ఈ సినిమాతో మన భారతీయ సినిమా గొప్పదనాన్ని యావత్ ప్రపంచం గుర్తించేలా చేస్తానని చెపుతున్నాడు. మున్ముందు హాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్లు సినిమాల కోసం మన చుట్టూ తిరిగే రోజు వస్తుందని, అందుకు తన వంతు కృషి చేస్తానని ప్రశాంత్ వర్మ చెప్పాడు.
హనుమాన్ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆ సినిమా రిలీజ్ ముందు ప్రశాంత్ వర్మ చాలా నమ్మకంగా మాట్లాడిన తీరుని గుర్తు చేసుకుంటే అతని మాటలలో ఆత్మవిశ్వాసం ఉందని అర్దమవుతుంది. హనుమాన్ చూసిన పెద్ద హీరోలు బహుశః ఇక నుంచి అతని కోసం క్యూకట్టడం ఖాయమే. ప్రశాంత్ వర్మ చేయబోయే జై హనుమాన్ సినిమాలో ఓ పెద్ద హీరో చేయబోతున్నట్లు సమాచారం.
అయితే ప్రశాంత్ వర్మ పెద్ద హీరోలతో సినిమాలు మొదలుపెట్టి వారి ఇమేజ్ చట్రంలో తానే చిక్కుకుపోకుండా జాగ్రత్త పడటం కూడా చాలా అవసరం. పెద్ద హీరోకి ఒక్క ఫ్లాప్ ఇస్తే, తన కధ మళ్ళీ మొదటికొస్తుందని ప్రశాంత్ ప్రశాంత్ వర్మ మరిచిపోకూడదు.
అయినా ఎవరినో మెప్పించాలని సినిమాలు తీస్తే అదే అతని ప్రతిభకి ప్రతిబంధకంగా మారుతుంది. కనుక అప్పుడే హాలీవుడ్ ప్రేక్షకులను, డిస్ట్రిబ్యూటర్లను మెప్పించాలనే ఆలోచన, ఆతృత కూడా మంచిది కాదు. హనుమాన్ రిలీజ్ ముందు ప్రెస్‌మీట్‌లో కొందరు సీనియర్ జర్నలిస్టులు తమతో ఏవిదంగా ఆడుకున్నారో మరిచిపోకుండా, తాను ఇంకా చిన్న దర్శకుడినే అనే భావనతో సినిమాలు తీస్తే ఇలాంటి మరిన్ని అద్భుతమైన సినిమాలు ఇవ్వగలుగుతాడు.
ముందుగా మరికొన్ని అచ్చమైన మన తెలుగు సినిమాలు, వీలైతే యావత్ భారతీయులను మెప్పించగల సినిమాలు తీయడంపైనే ప్రశాంత్ వర్మ దృష్టి పెట్టి పనిచేసుకుపోతే, ఏదో రోజు అతను కోరుకున్నట్లుగానే హాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్లే అతని దగ్గరకు తప్పక వస్తారు.
ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాతో ఇంతగా ఎదిగి, అందరి అభిమానం, గుర్తింపు సంపాదించుకోవడం చాలా సంతోషమే. అయితే ఈ విజయం ఇచ్చే మత్తుతో ‘నా అంత గొప్ప మేధావి, గొప్ప దర్శకుడు లేడనే’ ఆలోచన కలిగిన మరుక్షణమే పతనం మొదలవుతుందని మరిచిపోకూడదు. అప్పుడు ఇండస్ట్రీలో మరో వర్మగా ప్రశాంత్ వర్మ మిగిలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది.
Thalapathy Vijay is one of the biggest names associated with Tamil cinema, and he has…
Vaibhav Sooryavanshi was once again left out of India's playing XI for the fourth T20I…