
అమెరికా, యూరోప్ దేశాలలో పిల్లలను చిన్నప్పటి నుంచే వేరే గదిలో పడుకోబెడుతుంటారు తల్లి తండ్రులు. అది వారి సంస్కృతి.
కానీ భారత్‌లో ఆర్ధిక, సామాజిక, సంప్రదాయ తదితర అనేక కారణాలన వలన పిల్లలు కాస్త పెద్దయ్యే వరకు తల్లి తండ్రుల వద్దనే పడుకోబెట్టుకుంటారు.
పూర్తి భిన్నమైన ఈ రెండు పద్దతులలో మంచే ఉంది. విదేశాలలో తల్లి తండ్రులు పిల్లలకు ప్రైవసీని గౌరవిస్తుంటే, భారత్‌లో తల్లితండ్రులు పిల్లలకు రక్షణ, ప్రేమానురాగాలు పంచాలనుకుంటారు.
కానీ ఇప్పుడు భారత్‌లో కూడా ‘ప్రైవసీ’ చాలా అవసరంగా మారింది. తల్లితండ్రుల నుంచి పిల్లలు, భార్య నుంచి భర్త, భర్త నుంచి భార్య ప్రైవసీ కోరుకుంటున్నారు.
మారిన సమాజ పరిస్థితులు, ఉద్యోగాలు, ఆర్ధిక సమస్యలు, చదువులు, ఒత్తిళ్ళ కారణంగా ఇప్పుడు ప్రైవసీ చాలా అవసరంగా మారింది. కనుక ఎవరైనా ప్రైవసీ కోరుకుంటే తప్పు పట్టడం సబబు కాదు.
కానీ ప్రైవసీ కోరుకున్నప్పుడు ఒంటరితనం బాధించకూడదు. కానీ అలా బాధపడటానికి కూడా ప్రైవేసీ అవసరమే. కనుక ఏకాంతంగా బాధపడేవారు… అలా బాధ పడాలనుకునేవారు చాలా మందే ఉన్నారు. కానీ అలా బాధ పడటానికి కూడా ప్రైవసీ దొరకడం లేదంటూ బాధపడేవారూ ఉన్నారు.
ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. అప్పుడు కుటుంబంలో ఒకరి కష్టం, బాధ, అనారోగ్యం, ఆర్ధిక సమస్యలు మిగిలిన అందరూ పంచుకునేవారు. ఒకరికొకరు తోడుగా నిలిచి ఆ సమస్యల నుంచి బయటపడుతుండేవారు. అలాగని ఉమ్మడి కుటుంబాలలో అంతా బాగుంటుందని కాదు. దానిలో సమస్యలు దానికీ ఉన్నాయి.
కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కనుక భార్య, భర్త, పిల్లలనే మినియేచర్ జీవులతో కూడిన న్యూక్లియర్ ఫ్యామిలీలు ఏర్పడ్డాయి.
వాటిలోకి తల్లి తండ్రులకు కూడా ప్రవేశం కష్టమే. ఒకవేళ లభించిన లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ ప్రకటించినప్పుడే వారు ఆ అవకాశం వినియోగించుకోవాలి. అప్పుడు ఎంట్రీ పాస్, వీసాలు, ప్లేన్ టికెట్స్ కూడా లభిస్తాయి. సాధారణంగా పిల్లలు పుట్టినప్పుడు, ఉద్యోగాలు చేస్తున్న భార్యాభర్తలలో ఒకరు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు తల్లితండ్రులకు ఇలాంటి బంపర్ ఆఫర్లు లభిస్తుంటాయి.
ఈ ప్రైవసీ సరిహద్దులు పెరుగుతున్న కొద్దీ, ఇప్పుడు ఏదైనా శుభాశుభ కార్యక్రమాలలో పాల్గొన్నప్పుడు కూడా ఎవరి కుటుంబాలు వారు గిరి గీసుకొని కూర్చొని మొక్కుబడి పలకరింపులతో కానిచ్చేస్తున్నారు. అంటే నలుగురిలో కలవలేకపోతున్నారన్న మాట!
నలుగురిలో ఉన్నప్పుడు కూడా ఒంటరితనం, ఆత్మన్యూనత అనిపిస్తే అది తప్పకుండా ప్రైవసీ పుణ్యమే. ఎందుకంటే ప్రైవసీ పేరుతో ఒంటరితనానికి బాగా అలవాటు పడిన తర్వాత నలుగురిలో కలవడం చాలా కష్టమే కదా? కనుక ప్రైవసీ సరిహద్దులు కాస్త తగ్గించుకొని మొదట కుటుంబ సభ్యులతో హాయిగా మాట్లాడుకోగలిగితే ఆ తర్వాత ధైర్యంగా, సంతోషంగా సమాజంతోనూ కలవవచ్చు.
Tollywood box office had a golden opportunity this weekend. Saturday, Sunday and Monday holidays gave…
There have been recent claims that Netflix is trying to divert attention from its latest…