క్రియేటివ్ జీనియస్ గా తెలుగు సినీ దర్శకులలో సుకుమార్ శైలి మరొకరికి సాధ్యం కాదు. కొత్త కొత్త కధలనే కాదు, హీరోల రూపురేఖలు పూర్తిగా మార్చివేయడంలో సుకుమార్ దిట్ట. ‘గంగోత్రి’ సినిమాతో ‘ఇలాంటి వాళ్ళు కూడా హీరోలైపోతారా’ అన్న టాక్ అందుకున్న అల్లు అర్జున్ ను ‘ఆర్య’తో ఒక హీరో రూపాన్ని తీసుకువచ్చాడు. అలాగే ఆ తర్వాత బన్నీలో ఉన్న మరో యాంగిల్ ను ‘ఆర్య 2’లో చూపించి తన విలక్షణతను చాటుకున్నాడు సుక్కూ.
‘జగడం’ సినిమాతో రామ్ కు మాస్ లుక్ ను, ‘100% లవ్’తో నాగచైతన్యకు రొమాంటిక్ లుక్ ను, ‘1 నేనొక్కడినే’ పిక్చర్ తో మహేష్ కు రాక్ స్టార్ లుక్ ను, ‘నాన్నకు ప్రేమతో’ మూవీతో జూనియర్ ఎన్టీఆర్ కు క్లాస్ లుక్ లను తెచ్చిన ఘనత సుకుమార్ ది. ఇలా ఆయా హీరోలకు గత సినిమాలతో సంబంధం లేకుండా ఫ్రెష్ లుక్స్ ను అందించిన ఈ ‘లెక్కల మాస్టార్,’ తాజాగా మెగా వారసుడు రామ్ చరణ్ ను తీర్చిదిద్దే పనిలో నిమగ్నమైనట్లుగా టాలీవుడ్ వర్గాల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి.
ఇప్పటివరకు నటించిన సినిమాలలో ఒక్క ‘మగధీర’ మినహాయిస్తే… కొత్తదనం అన్న పదానికి దూరంగా ప్రయాణించిన రామ్ చరణ్ లుక్స్ అన్ని సినిమాలలో ఒకే విధంగా ఉంటాయన్న విమర్శ తెలిసిన విషయమే. అయితే తన తాజా చిత్రం ‘ధృవ’ కోసం అల్లు అర్జున్ మాదిరి మీసకట్టుతో ట్రై చేస్తున్న చెర్రీ, సెప్టెంబర్ లో ప్రారంభం కాబోయే సుకుమార్ సినిమా కోసం పూర్తిగా మేకోవర్ అవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఎలాంటి గెటప్ లో రామ్ చరణ్ ను సుకుమార్ చూపిస్తాడో అన్న ఉత్సుకత మెగా అభిమానులతో సినీ జనాలలో నెలకొంది.



