
ఏదైనా శాస్త్రం, వేదం మాత్రమే ప్రమాణమని గోవిందానంద వ్యాఖ్యానించగా… వేదాలు, శాస్త్రాలూ లేనే లేవని, వాటిని తాము నమ్మబోమని రమణానంద చెప్పడంతో పక్కదారి పట్టిన చర్చ చివరి వరకు అలాగే కొనసాగింది. అసలు సాయిబాబా హిందువా, ముస్లిమా, తల్లిదండ్రులు ఎవరు? హిందూ దేవుడిగా ఎందుకు చూపిస్తున్నారు? ఆయన ఏ శాస్త్ర పరంపరకు చెందిన వాడని గోవిందానంద ప్రశ్నలను కురిపించారు.
క్రిస్టియన్ మతస్తులు కొలిచే ఏసుక్రీస్తు శివ స్వరూపమని… ముస్లింలు కొలిచే అల్లా కూడా శివుడేనని… మరే ఇతర దేవుడైనా శివుడేనని… అయితే సాయి మతాతీతుడని… తల్లిదండ్రులు లేని శివ స్వరూపమని… మరే మతమూ తమకు సమ్మతం కాదని… రమణానంద మహర్షి సంచలన వ్యాఖ్యలు చేసారు. ‘అల్లా అంటే అల్… అహ్…’ అంటూ రమణానంద ఏదో చెప్పబోగా, గోవిందానంద అడ్డుకుని ఆ పదాలు ఏ భాష నుంచి వచ్చాయి? పర్షియనా? గల్ఫా? ఉర్దూనా? అంటూ ప్రశ్నలు సంధించారు.
సనాతన ధర్మాలకు, శంకరాచార్యుల సంప్రదాయాలకు విరుద్ధంగా, మతమే లేని సాయిబాబా దేవాలయాల్లో హిందువుల దేవుళ్ల విగ్రహాలు పెట్టడం సరికాదని… సాయి దేవాలయాల్లో హిందూ దేవుళ్ల విగ్రహాలు పెట్టకుండా పూజలు చేసుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని… ఎవరు పడితే వారు పీఠాలు పెడుతూ ప్రజలను మభ్య పెడుతున్నారని… దేనికైనా శాస్త్రమే ప్రమాణమని… సాయికి చేస్తున్న పూజలు ఏ శాస్త్రంలో ఉన్నాయని… పూజలు ఇలా చేయాలని ఎక్కడ రాసుందని… హిందూమత శాస్త్రాల్లోని అంశాలనే తీసుకుని వాటిని కలుషితం చేస్తున్నారని… శ్రీగోవిందానంద తీవ్ర వ్యాఖ్యలు చేయగా, దేవుళ్లకు మతాలను ఎందుకు ఆపాదిస్తున్నారని రమణానంద మండిపడ్డారు.
ఇక్కడితో ఆగని ఈ చర్చలో పురాణాల ప్రస్తావన కూడా వచ్చింది. హిందువులు పరమ పవిత్ర పురాణాలుగా భావించే రామాయణం, భారతం తదితరాలపై రమణానంద అభ్యంతరకర వ్యాఖ్యలు చేయగా, దానికి ప్రతీగా గోవిందానంద కూడా అదే స్థాయిలో స్పందించారు. ‘పురాణాల్లో పరమ తప్పులున్నాయని, బూతుతో నిండి ఉందని, ఏ పురాణానికీ ప్రమాణాలు లేవని, అన్నీ పుక్కిటి పురాణాలని, సాయి సచ్చరిత్రను తప్ప దేనికీ విలువ ఇచ్చేది లేదని…’ రమణానంద చేసిన వ్యాఖ్యలకు ‘రామాయణం రంకు, భారతం బొంకు అని వాదించేవారు ఈ దేశంలో ఉండాల్సిన పని లేదని, సాయి దేశం పేరిట ఓ దేశం పెట్టుకుని తక్షణం ఈ హిందూ దేశాన్ని వీడాలని…’ గోవిందానంద ఆగ్రహాపూరితంగా స్పందించారు.
ఇంతలో ఈ చర్చలోకి ఫోన్ లైన్ ద్వారా శ్రీ పీఠం స్వామి పరిపూర్ణానంద రావడంతో చర్చ మరింత రసకందాయంలో పడింది. ఈ సమయంలో పరిపూర్ణానంద స్వామిని రమణానంద పదేపదే ‘నువ్వు’ అని సంబోధించడంతో… మళ్ళీ చర్చ వ్యక్తిగత విమర్శల వైపుకు మళ్ళింది. ఉన్నత స్థాయిలో ఉన్న ఓ వ్యక్తి, ఇతరులను గౌరవించాలన్న కనీస జ్ఞానాన్ని కలిగి వుండాలని, పక్కవారిని గౌరవిస్తేనే తనకు గౌరవం లభిస్తుందన్న చిన్న విషయం తెలియని వారు ఇతరులకు మార్గనిర్దేశం ఎలా చేస్తారని పరిపూర్ణానంద మొట్టికాయలు వేయగా.., తన కంటే వయసులో చిన్నవాడు కాబట్టి పరిపూర్ణానందను ‘నువ్వు’ అనవచ్చని సమర్థించుకునే ప్రయత్నం చేయగా… దీనికి అడ్డుపడ్డ గోవిందానంద, జ్ఞానంలో పెద్దగా ఉండాలే తప్ప వయసులో పెద్దయినంత మాత్రాన అగౌరవ పరిచేలా ఎందుకు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
అయితే ఈ ఎపిసోడ్ తర్వాత చర్చ మరింత వేడేక్కింది. సాయిబాబా దేవుడే కాదని, ఆయన భూతమై తిరుగుతున్నాడని, హిందూ మత విశ్వాసాల ప్రకారం, మరణించిన వ్యక్తికి కర్మకాండలు జరగకుంటే, ప్రేతమై సంచరిస్తుందని, దీని ప్రకారం సాయి భూతమై సంచరిస్తున్నాడని, ఓ భూతాన్ని పూజించాల్సిన అవసరం ఏంటని, ఒకవేళ సాయి మృతదేహాన్ని ఖననం చేశామని చెప్పుకున్నట్లయితే, ఆయన ముస్లిం మతానికి చెందిన వాడని ఒప్పుకోవాలని, ఓ ముస్లింకు పూజలు చేయాల్సిన అవసరం హిందువులకు లేదని, సాయి ఒక ముస్లిం అని షిరిడీ సంస్థాన్ ట్రస్ట్ ప్రచురించిన బుక్ లో స్పష్టంగా ఉందని, ఆయన పేరు చెప్పుకుని హిందువులను మోసం చేస్తూ, మభ్య పెడుతూ, డబ్బులు దండుకుంటున్నారని గోవిందానంద సంచలన వ్యాఖ్యలు చేసారు.
మరోవైపు ఈ కార్యక్రమం తిలకించిన పలువురు భక్తులు కూడా ఛానల్ కార్యాలయానికి వచ్చి తమ నిరసన తెలుపుతుండటంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ స్తంభించి, సదరు ఛానల్ వద్ద భారీ ఎత్తున పోలీసులను మోహరించాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. ఈ చర్చను రెండు తెలుగు రాష్ట్రాల్లో వేలాది మంది ఆసక్తిగా తిలకిస్తుండగా, మాడుగుల నాగఫణిశర్మ, జొన్నవిత్తుల తదితర పలువురు ప్రముఖులు స్పందించి తమ అభిప్రాయాలు చెబుతూ, ఇద్దరికీ బుద్ధి చెప్పే ప్రయత్నం చేశారు. ఏ దేవుడినైనా ఎవరు చూసారు… వీళ్ళ వాదోపవాదాలు చూసి ముక్కున వేలేసుకోవడం భక్తుల వంతవ్వడం తప్ప… భక్తీ, నమ్మకాలే ప్రజలను ఆయా దేవుళ్ళను ప్రజలు విశ్వసించేలా చేస్తున్నాయి. అయినా ఇలా అనుచిత వ్యాఖ్యలు చేసుకుంటూ కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతీసే హక్కు ఈ ఇద్దరికీ ఎవరిచ్చారు?
The gap between film reviewers and audiences is nothing new in Telugu cinema. Nani's The…
Virat Kohli and Shubman Gill smashed centuries as India defeated West Indies by eight wickets…