
ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడితే తర్వాత అధికారంలోకి వచ్చిన పార్టీ వారిపై కేసులు నమోదు చేయించి విచారణ జరిపిస్తుంది. జైళ్ళకు కూడా పంపిస్తుంటుంది. కానీ ఏ ఒక్క కేసు విచారణ ఎన్నటికీ పూర్తికాదు. అవినీతికి పాల్పడినవారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడవు.
జగన్ అక్రమాస్తుల కేసులు మొదలు వివేకా హత్య కేసు వరకు ప్రతీ కేసు పరిస్థితి ఇదే. కనుక మద్యం కుంభకోణం కేసులో ఏదో జరిగిపోతుందనుకునేవారు రాజకీయ అజ్ఞానులే అనుకోవలసి ఉంటుంది. ఈ కేసులలో చిక్కుకున్నవారు నోటికి ఎంత పని చేపితే అంతగా కేసులు వేగవంతం అవుతుంటాయి. అదేవిదంగా సైలంట్ అయిపోయిన వారి పట్ల ప్రభుత్వం ఉదారంగా వ్యవహరిస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు.
అంటే గతంలో అవినీతికి పాల్పడినా ఇప్పుడు తమ ప్రభుత్వాన్ని ఇబ్బందిపెత్తకుండా నోరు మూసుకొని ఉంటే చాలు వారికి కేసుల బాధ ఉండదు. అధికారంగా ఏ ప్రభుత్వమూ ఇటువంటి హామీ ఇవ్వలేదు. కానీ రాజకీయాలలో బాగా నలిగిన మాజీ మంత్రి రోజా వంటి వారికి ఈ విషయం బాగా తెలుసు. కనుక ఎప్పుడు నెగ్గాలో కాదు ఎప్పుడు తగ్గాలో కూడా వారికే బాగా తెలుసు.
రోజా పర్యాటక, యువజన శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ‘ఆడుదాం ఆంధ్రా’ కార్యక్రమాలలో భారీగా అవినీతికి పాల్పడ్డారని విజిలెన్స్ నివేదికలో తేల్చి చెప్పింది. కానీ ప్రభుత్వం ఇంతవరకు ఆమెపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. బహుశః ఆమె సైలంట్ అయిపోయారు గనుకనే అని అనుకోవాలేమో?
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆమె చాలా జోరుగా నోటికి పని చెప్పేవారు. తీవ్ర విమర్శలు గుప్పించేవారు. కానీ గత కొంత కాలంగా ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకొని మీడియాతో మాట్లాడకుండా చిర్నవ్వులు చిందిస్తూ వెళ్ళిపోతున్నారు.
తాజాగా ఆమె మళ్ళీ సినిమాలలో నటించడం ప్రారంభించారు. కానీ తెలుగులో కాదు తమిళంలో! కోలీవుడ్‌లో బాల చంద్రన్ దర్శకత్వంలో ‘లెనిన్ పాండియన్’ అనే తమిళ సినిమాలో రోజా క్లిష్ట పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొనే ‘సంతానం’ అనే గ్రామీణ మహిళగా నటిస్తున్నారు.
ఈ విషయం ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. మళ్ళీ 12 ఏళ్ళ తర్వాత తమిళ సినీ పరిశ్రమకి తిరిగివస్తున్న రోజాకు స్వాగతం అంటూ తమిళ నటి కుష్బూ ట్వీట్ చేశారు.
రోజా భర్త సెల్వమణి కోలీవుడ్‌లో దర్శకుడనే సంగతి తెలిసిందే. కనుక ఆమె రీ-ఎంట్రీ పెద్ద కష్టం కాదు. కానీ ఆమె తెలుగు బదులు తమిళ సినిమా ఎంచుకోవడానికి బలమైన కారణమే కనిపిస్తోంది. ఏపీకి దూరంగా తమిళ సినిమాలు చేసుకుంటూ ఉంటే ‘ఆడుదాం ఆంద్రా’ కేసు, సమస్యలు ఉండవు.
మళ్ళీ తెలుగులో నటించాలనుకున్నా ఎవరూ ఆమెని తీసుకునే సాహసం చేయకపోవచ్చు. ఒకవేళ తీసుకున్నా ఆమె రాజకీయ నేపధ్యం కారణంగానే ఆ సినిమాకు ఎదురు దెబ్బ తగలవచ్చు. కనుక ముందుగా తమిళంలో సినిమాలు చేసి కొన్ని హిట్స్ కొడితే, ఆ తర్వాత టాలీవుడ్ తలుపులు వాటంతట అవే తెరుచుకుంటాయి.
అవినీతికి పాల్పడినట్లు విజిలెన్స్ నివేదికలు ప్రభుత్వం చేతిలో ఉన్నా, ఇటువంటి కారణాలతో చర్యలు తీసుకోకుండా ఉపేక్షిస్తుంటే, ఇక ఎవరు ఎంత అవినీతికి పాల్పడినా భయపడాల్సిన అవసరం ఉండదు కదా?
Telugu cinema is facing a quiet but noticeable problem. Everything is starting to sound the…
Royal Challengers Bengaluru defeated Delhi Capitals in the 39th match of IPL 2026 at the…