
ఎవరైనా విలాసవంతమైన జీవితమే కావాలని కోరుకుంటారు. కార్లు, బంగ్లా, ఖరీదైన బ్రాండడ్ దుస్తులు, లక్ష-రెండు లక్షల ఖరీదైన ఫోన్లు, విదేశీ యాత్రలు… ఇలాంటి జీవితం ఎంత గొప్పగా ఉంటుందో కదా? అని అనుకునేవారే ఎక్కువ.
కానీ అవన్నీ ఉన్నవారు ఎలాంటి బాధలు, కష్టాలు, ఒత్తిళ్ళు లేకుండా సుఖంగా, సంతోషంగా జీవిస్తున్నారా?నచ్చినవి తినగలుగుతున్నారా?స్వేచ్చగా తిరగ గలుగుతున్నారా? అంటే కాదనే చెప్పాలి.
ఆరోగ్యం కోసం కడుపు మాడ్చుకుంటారు. సామాన్య ప్రజలు ఇంకా మంచం మీద నుంచి లేవకమునుపే వారు వాకింగ్, జాగింగ్ అంటూ తెల్లవారుజామునే రోడ్లపై పరుగులు తీస్తుంటారు.
పని ఒత్తిళ్ళు పెరిగిపోయినప్పుడు కుటుంబంలో బంధాలు విచ్చినమైపోతుంటాయి. కనుక అన్నీ ఉన్నవారు మనశాంతి కోసం బాబాలు, స్వామీజీల చుట్టూ తిరుగుతుంటారు. భరించలేక ఆత్మహత్యలు చేసుకున్నవారు ఉన్నారు. లేదా అన్నిటినీ త్యజించి అడవులలోకో లేదా హిమాలయాలకో బయలుదేరేవారూ ఉన్నారు.
అలాగని వారందరూ దుర్భర జీవితం గడుపుతారని కాదు. కానీ జీవితంలో ఆశలు, కోర్కెలు, లక్ష్యాలు పెరుగుతున్న కొద్దీ అదే నిష్పత్తిలో ఒత్తిళ్ళు కూడా పెరుగుతూనే ఉంటాయని, మనశాంతి, ఆరోగ్యం తగ్గుతుంటుందని చెప్పడమే ఉద్దేశ్యం.
కనుక నిరాడంబరంగా జీవించగలగడం కూడా ఓ విధంగా విలాసవంతంగా జీవించడమే అనుకోవచ్చు. కానీ బంగారు పంజరంలో ఉన్న పక్షి బయట స్వేచ్చగా ఎగురుతున్న పక్షులను చూసి అసూయ పడుతుంటే, స్వేచ్చగా ఎగురుతున్న పక్షులు బంగారు పంజరంలో పక్షి రాజభోగాన్ని చూసి అసూయ పడుతున్నట్లుగానే మనుషుల ఆలోచనలు కూడా సాగుతుంటాయి.
ఉదారణకు మన దేశంలో సామాన్య ప్రజలకు జీవితంలో ఒక్కసారైనా విమానంలో ప్రయాణించాలని కలలు కంటారు. కానీ ఆఫీస్, బిజినెస్ పనుల మీద ప్రతీ రోజూ విమానాలలో తిరిగేవారు దానిని దుర్భరంగా భావిస్తుంటారు.
విమానం అదే… కానీ ఒకరికి ఒక రకమైన అనుభూతి మరొకరికి మరో రకమైన భావన ఎందువల్ల? అంటే ఏదైనా మితంగా ఉన్నప్పుడు ఉండే విలువ అతిగా మారితే ఇబ్బందిగా మారుతుందన్న మాట!.
కనుక ఆర్ధిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలు లేకుండా సామాన్య జీవితం గడుపుతున్నవారు ఏదో తక్కువైందని బాధ పడవలసిన అవసరం లేదు. మనం సుఖంగా, సంతోషంగా జీవిస్తున్నామనుకుంటే జీవితం ఇంకా అద్భుతంగా మారుతుంది.
For the first time in Bigg Boss history, there is a double eviction in the…
Toxic has emerged as an epic disaster at the box office. While the movie bombed…