
ఇప్పుడు తెలుగు సినిమాలంటే పాన్ ఇండియా.. గ్లోబల్ మార్కెట్.. తప్పనిసరిగా మారిపోయాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలనే ఆలోచన, ప్రయత్నాలు తప్పు కాదు. కానీ ఎప్పుడూ అదే యావ మంచిది కాదు. ప్రస్తుతం టాలీవుడ్‌లో పెద్ద హీరోలు, పెద్ద దర్శక నిర్మాతలు పాన్ ఇండియా సినిమాలు తీయకపోవడం నామోషీగా భావిస్తున్నారంటే అతిశయోక్తి కాదు.
కానీ ఈ పరుగులో మన తెలుగు భాష, మన నేల, మన మనుషులు, మన సంస్కృతి, మన పండుగలు, పల్లె వాసనలను మరిచిపోతున్నారు.
ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమడ్‌లో పెద్ద హీరోలు, దర్శకులకు ఇంగ్లీష్ టైటిళ్లపై మోజు బాగా పెరిగిపోయింది. ఆ ప్రభావం సినిమా పాటలపై కూడా పడుతోంది. తెలుగు పాట అని చెప్పుకోలేని సంకర భాషలో పాటలు వ్రాస్తుంటే, ఆ పాట వినపడకుండా సంగీతంతో చెవులు మూసుకునేలా చేస్తున్నారు.
తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న ఈ పరాయి మోజు హీరోయిన్లు, విలన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులకు ఎప్పుడో విస్తరించింది. కానీ దాని వలన ఇతర రాష్ట్రాలు, భాషలు మాట్లాడేవారికి మన సినీ పరిశ్రమలో అవకాశాలు కల్పిస్తోందని సంతోషపడవచ్చు.
అయితే ఈ పరాయి మోజు కారణంగానే తమిళ డబ్బింగ్ సినిమాలను తమిళ పేర్లతోనే విడుదల చేస్తున్నారు. తెలుగు ప్రేక్షకుడు ఏదైనా అంగీకరించి ఆదరిస్తారనే ధీమా కోలీవుడ్‌లో కనిపిస్తోంది. మన తెలుగు సినీ పరిశ్రమే మన భాషకి ప్రాధాన్యం ఇవ్వనప్పుడు, ఇతర సినీ పరిశ్రమలు ఎందుకు ఇస్తాయి?
అయితే చిన్న సినిమాలు ఈలోటు తీరుస్తున్నాయని చెప్పవచ్చు. ‘తెల్ల కాగితం’, ‘ఇడుపు కాయితం’ వంటి అచ్చమైన తెలుగు పేర్లతో మన పట్టణ, గ్రామీణ జీవితం, సంస్కృతి, ప్రాంతీయ పలుకుబడులను ప్రేక్షకులకు పరిచయం చేస్తూ అలరిస్తున్నాయి.
తెల్ల కాగితం అంటే స్వచ్ఛతకు ప్రతీకగా ఉపయోగిస్తాం. కానీ ‘ఇడుపు కాయితం’ అంటే ఏమిటి? అని చాలా మంది గూగులలో వెతుకుతున్నారు. అందరూ ఇంగ్లీష్ సినిమా టైటిల్స్ మోజులో కొట్టుకుపోతున్న ఈ తరుణంలో కనీసం కొందరికి ఇడుపు కాయితం అంటే అర్థం తెలుసుకోవాలనే ఆసక్తి రేకెత్తించడం విశేషమే కదా?
తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో దీనిని విడాకుల పత్రాలకు సూచనగా దీనిని ఉపయోగిస్తారు. ఈ చిన్న పదం వెనుక కూడా ఒక ప్రాంత భాష, మళ్ళీ దాని మాండలికం, జీవన విధానం దాగి ఉన్నాయి. కనుక తెలుగు భాష, మాండలికాలు, ప్రజల జీవన విధానాన్ని ప్రతిబింబించే ఇటువంటి సినిమాలు చాలా అవసరం.
Venkatesh’s much-hyped Aadarsha Kutumbam AK 47, directed by Trivikram, has been indefinitely postponed. Producer Naga…
The Ministry of External Affairs in India has amended the passport rules for minors of…