
దేశవ్యాప్తంగా వందల కొద్దీ ఇండిగో విమానాలు రద్దు అవుతుండటం ప్రకంపనలు సృష్టిస్తోంది. దేశంలో 60 శాతం ప్రయాణికుల వాటా కలిగిన అతి పెద్ద సంస్థ హటాత్తుగా ఇలా కుప్పకూలుతుండటం బాధాకరమే.
గతంలో కింగ్ ఫిషర్, జెట్ ఎయిర్ వేస్, ఎయిర్ డెక్కన్, గో ఫస్ట్ లుక్ పోస్టర్, ఎయిర్ కోస్టా, ట్రూజెట్, ఇండస్ ఎయిర్ వేస్, వంటి అనేక విమానయాన సంస్థలు నష్టాల ఊబిలో కూరుకుపోయి మూతపడ్డాయి. వాటిలో కొన్ని వేరే సంస్థలలో విలీనమయ్యాయి.
అభివృద్ధి చెందుతున్న బారతదేశంలో ఇలా వరుసగా విమానయాన సంస్థలు మూత పడుతుండటం ప్రపంచదేశాలకు తప్పుడు సంకేతాలు పంపుతున్నట్లవుతుంది. ఈ రంగంలో భారత్ అభివృద్ధి ‘బలుపు కాదు కేవలం వాపు మాత్రమే’ అని భావించేలా చేస్తుంది.
కనుక ఇండిగో ఎదుర్కొంటున్న సమస్యలని పరిష్కరించి కాపాడుకోవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైనే ఉంటుంది. కానీ ఆంక్షలు, నిబంధనలు, హెచ్చరికలు జారీ చేస్తుంటే అది కూడా మూత పడుతుంది.
ఇండిగో తిప్పలు పడుతుంటే మిగిలిన విమానయాన సంస్థలు పండగ చేసుకుంటున్నాయి. ఈ సమస్యల నుంచి బయటపడేందుకు అవి ఇండిగోకి తోడ్పడటం లేదు. కానీ పొరుగింటికి మంటలు అంటుకుంటే పండగ చేసుకుంటే రేపు మన ఇంటికీ ఆ మంటలు వ్యాపిస్తాయి.
విమాన ప్రయాణికులలో 60 శాతం మందికి ఇండిగో సేవలు అందిస్తోంది. ఒకవేళ అది మూతపడితే మిగిలిన సంస్థలు ఆ లోటుని భర్తీ చేయలేవు. ఆ భారం భరించలేక అవి కూడా వరుసగా మూతపడే ప్రమాదం పొంచి ఉందనే విషయం ఇంకా గ్రహించినట్లు లేదు.
మొన్న పలు విమానాశ్రయాలలో ఏటీసీ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్)లో సాంకేతిక సమస్యలు, ఇప్పుడీ ఇండిగో సమస్యతో పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రత్యర్ధ పార్టీలకు దొరికిపోయారు.
అప్పుడే ఆయనపై విమర్శలు మొదలైపోయాయి. ఇంతకాలం మంచి చురుకైన మంత్రిగా ఆయన సంపాదించుకున్న మంచి పేరు ఈ సమస్యలతో తుడిచిపెట్టుకుపోతోంది.
ఒకవేళ కేంద్ర ప్రభుత్వంపై ఈ నింద తమపై పడకుండా తప్పించుకోవాలని అనుకుంటే రామ్మోహన్ నాయుడుని ‘బకరా’గా బలిచ్చినా ఆశ్చర్యం లేదు. ఏపీలో వైసీపీ కాచుకు కూర్చోంది. కనుక ఇది టీడీపికి ఇబ్బందికరంగా మారుతుంది.
కనుక వ్యవస్థలో లోపాలు గుర్తించి సరిదిద్దుకోవడం చాలా ముఖ్యం. రామ్మోహన్ నాయుడుని నిందించడం ఈ సమస్య పరిష్కారం కానే కాదు.
అంతర్జాతీయ స్థాయిలో విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు నిర్మించడం మంచిదే. కానీ ఇలాంటి సాంకేతిక, ఆర్ధిక, విధాన పరమైన సమస్యలు లేకుండా బలమైన వ్యవస్థలు, యంత్రాంగం, దానికి అవసరమైనంత మంది సిబ్బందిని ఏర్పాటు చేసుకోవడం ఇంకా ముఖ్యం.
లేకుంటే ‘పేరు గొప్ప ఊరు దిబ్బ’ అన్నట్లు ఇలాంటి సమస్యలు, ప్రమాదాలు పునరావృతం అయిన ప్రతీసారి అందరం ఇబ్బంది పడుతూనే ఉంటాము. అప్పుడు మనల్ని చూసి లోకం నవ్వుతూనే ఉంటుంది.
For the first time in Bigg Boss history, there is a double eviction in the…
Toxic has emerged as an epic disaster at the box office. While the movie bombed…