
‘నాకు టైమ్ లేదు.. లేకుంటేనా..’ అనేవాళ్ళే ఈ లోకంలో ఎక్కువ. కానీ ఉన్న ఆ కొద్ది పాటి టైమ్‌లో కొందరు సామాజిక సేవ, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటుంటారు. జంతు ప్రేమికులు, కళాకారులు, రచయితలు, నటీనటులు ఇలా ఒకటేమిటి.. అనేక రకాల పనులు చేస్తున్నవారు మన మద్యనే ఉన్నారు కదా? వారిలో చాలా మంది ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకునేవారు లేదా గృహిణులే ఉంటారు.
అందరికీ రోజుకి 24 గంటలే ఉంటాయి. మరి వాళ్ళకు ఈ అదనపు సమయం ఎలా లభిస్తోంది? మనకి టైమ్ ఎందుకు ఉండటం లేదు? ఏ పని చేయకుండా ఖాళీగా ఉన్నవారికి కూడా టైమ్ ఎందుకు ఉండటం లేదు?
ఈ సందర్భంగా ఇటీవల పెళ్ళి చేసుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందనల గురించి నాలుగు ముక్కలు చెప్పుకోవాల్సి ఉంటుంది.
వారిద్దరికీ డబ్బుకి కరువు లేదు. ఓ పది రోజులు బ్రేక్ తీసుకుంటామంటే దర్శక నిర్మాతలు అభ్యంతరం చెప్పరు. కనుక పెళ్ళి చేసుకున్నాక హనీమూన్‌కి విదేశాలకు చెక్కేసి హాయిగా ఎంజాయ్ చేయవచ్చు.
కానీ పెళ్ళి చేసుకున్నాక ఇద్దరూ కలిసి ‘రణబాలి’ చేస్తూ అదే హనీమూన్ అని సరిపెట్టుకుంటున్నారు. ముందుగా ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేస్తున్నారు! మద్యలో కాస్త టైమ్ సృష్టించుకొని హీరోయిన్ ఓరియంటడ్ ‘మైసా’ కోసం బ్యాంకాక్ వెళ్ళి అక్కడ శిక్షణ పొందుతున్నారు!
ఇండస్ట్రీలో దాదాపు చాలా మంది ఇలాగే శ్రమిస్తుంటారు. కనుక ఇది సర్వసాధారణమే కావచ్చు. మనం వారి సినిమాలనే చూసి అభిమానిస్తాము తప్ప వారి ఈ శ్రమని, ముఖ్యంగా వారి టైమ్ సెన్స్, టైమ్ మేనేజిమెంట్‌ని ఎందుకు చూడలేకపోతున్నాము? చూస్తే మనం కూడా సమయాన్ని, అవకాశాలను సద్వినియోగం చేసుకోగలం కదా?
వారిరువురే కాదు.. అన్ని రంగాలలో ఉన్నత స్థానాలలో ఉన్నవారు కూడా ఇలాంటి స్పృహతోనే పని చేస్తుంటారు. చివరిగా మన మన రాజకీయ నాయకుల గురించి కూడా రెండు ముక్కలు చెప్పుకోవాలి.
మనం వీకెండ్స్ ఎంజాయ్ చేస్తున్నప్పుడో లేదా డ్యూటీ ముగించుకొని వచ్చి హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నప్పుడో వాళ్ళు ఏదో సభ, సమావేశం లేదా ప్రెస్‌మీట్‌లో బిజీగా కనబడుతుంటారు. మనం ఎండ, వాన, చలికి భయపడతామేమో కానీ వాళ్ళు వాటికి అతీతులన్నట్లు పనిచేస్తుంటారు. ఎలా? దేనికి?
అంటే మనం అవినీతిపరులు, అసమర్దులని విమర్శించే రాజకీయ నాయకులు కూడా మన కంటే చాలా ఎక్కువ కష్టపడుతున్నారన్న మాట!
ఇన్ని రంగాలలో ఇంత మంది సమయాన్ని, అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నప్పుడు మనం ఏం చేస్తున్నాము?
సమయం లేక కాదు మనం దానిని వాడుకోవడం లేదు అంతే! మనం వాడుకోని ఈ సమయం మన కోసం ఆగదు కూడా!
India's 351/7 looked like a strong enough total, but the third ODI against West Indies…
Legendary filmmaker Singeetham Srinivasa Rao has passed away at Kauvery Hospital in Chennai following ill…