
ట్రంప్ వచ్చాక అమెరికా వీసాలు అందని ద్రాక్ష పళ్ళుగా మారిపోతున్నాయి. అమెరికా వెళ్ళాలని కొత్తగా ఆలోచనలు మొదలైనవారికి వాటితో పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు. అమెరికా కాకపోతే కెనడా కాకపోతే జర్మనీ, ఆస్ట్రేలియా ఎక్కడో అక్కడికి పోగలరు.
కానీ ఇప్పటికే అమెరికాతో పేగు బంధం ఏర్పడినవారికి, చదువులు, ఉద్యోగాల కోసం అమెరికా వెళ్ళడం తప్పనిసరి అయినవారికి ట్రంప్ ఆంక్షలు చాలా ఇబ్బందికరంగానే మారుతాయి.
డయాబెటిస్, ఊబకాయం, గుండె సమస్యలు, క్యాన్సర్ వంటి దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి అమెరికా వీసాలు ఇవ్వకూడదని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించింది.
అటువంటి రోగాలతో ఉన్నవారు అమెరికా రావాలనుకుంటే, అత్యవసరమైనప్పుడు ఆ వ్యాధులకు సొంత డబ్బుతో వైద్య చికిత్స చేయించుకోగల ఆర్ధిక స్థోమత కలిగి ఉండాలి. లేదా మెడికల్ ఇన్స్యూరెన్స్ కవరేజ్ ఉందని నిరూపించుకోవాలి. అప్పుడే వీసా లభిస్తుంది. లేకుంటే లేదు.
హెచ్-1బీ వీసాలతో అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నవారు, వారి జీవిత భాగస్వాములు, వారి కోసం భారత్ నుంచి వచ్చే వారి తల్లితండ్రులు, ఇలా అనేకమందికి ఈ నిబంధనతో బ్రేకులు వేసినట్లవుతుంది.
ఈ కొత్త నిబందన వలన మరో 20-25 శాతం వరకు వీసాలు తగ్గవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా భారతీయులలో ఇటువంటి వ్యాధులు చాలా ఎక్కువ. కనుక ఈ ప్రభావం అమెరికా వెళ్ళాలనుకునే భారతీయులపై చాలా ఎక్కువగా పడుతుంది.
ఈ వ్యాదులేవీ లేనప్పటికీ, లేవని నిర్ధారించుకునేందుకు, అమెరికా అధికారులకు ఆమోదయోగ్యమైన విధంగా అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించుకొని ఆ రిపోర్టులు సమర్పించాల్సి ఉంటుంది. కనుక ఆరోగ్యంగా ఉన్నవారికి కూడా ఇదో పరీక్షగానే మారుతుంది.
డోనాల్డ్ ట్రంప్ భారత్‌పై 50 శాతం పన్నులు విధించి, రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేయించి, మోడీ నా ఆప్తమిత్రుడు అంటున్నట్లే ఉన్నాయి ఈ తాజా ఆంక్షలు కూడా.
ట్రంప్ ప్రభుత్వం మాకు విదేశీయులు వద్దని చాలా స్పష్టంగానే చెపుతోంది. కనుక ఇక నుంచి భారతీయులు అమెరికా కలలు కనడం మానుకుంటేనే మంచిది. అమెరికా వెళ్ళేందుకు ఇన్ని ఆంక్షలు, అవమానాలు, ఈసడింపులు భరించాల్సిన అవసరం ఉందా? అని ప్రతీ ఒక్కరూ ఆలోచించాల్సిన తరుణం ఇదే!
For the first time in Bigg Boss history, there is a double eviction in the…
Toxic has emerged as an epic disaster at the box office. While the movie bombed…