
కనుక ఆ… నాడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా మద్యపానం గురించి చెప్పిన మాటలను ఓ సారి గుర్తుకు తెచ్చుకొన్నాక, నేడు రాష్ట్రంలో మద్యపానం దశలవారీగా ఏవిదంగా నిషేదించబడుతోందో అందరూ తప్పక తెలుసుకొని తరించాల్సిందే.
ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రజలతో మాట్లాడుతూ, “చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విచ్చలవిడిగా మద్యం అమ్మేస్తోంది. బాబు ప్రభుత్వం మద్యపానం నిషేధిస్తుందో లేదో తెలీదు కానీ బుద్దున్నవాడు ఎవడైనా చేయాల్సిందే. రెండు మూడేళ్ళలో మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. రాగానే రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలుచేస్తామని ‘గట్టిగా’ చెపుతున్నాను.
మద్యం తాగాలంటే ఏ ఫైవ్ స్టార్ హోటల్కో పోయి తాగాలి. బాగా డబ్బున్నోడు… సూట్లు బూట్లు వేసుకొన్నోడు అక్కడ తప్పతాగి పడిపోయినా పర్వాలేదు. కానీ రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం అమ్ముతుండటం వలన పిల్లలు చదువులు తప్పుతున్నాయి. పదో తరగతి పాస్ అవుతూనే మద్యం షాపుకు పోతున్నారు. స్కూల్ ఎదురుగానే మద్యం షాపులు కనిపిస్తుంటే పిల్లలు చెడిపోతున్నారు. అందుకే ఒక్క ఫైవ్ స్టార్ హోటల్స్ లో తప్ప రాష్ట్రంలో మరెక్కడా మద్యం కనబడకుండా చేసేస్తానని చెపుతున్నాను,” అని ఆవేశంగా చెప్పి జనాల చేత చప్పట్లు కొట్టించుకొన్నారు. ఇది నాడు.
ఇక నేడు ఎలాఉందంటే, మొదట ప్రభుత్వమే వైన్ షాపులు నిర్వహించింది. తరువాత ధరలు తగ్గించి మద్యాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చింది. మొన్న శని, ఆదివారాలలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 838 బార్లలో 815 బార్లకు వేలంపాట నిర్వహిస్తే వాటిని దక్కించుకొనేందుకు వైసీపీ నేతలు పోటీలు పడ్డారు. వాటి వేలం ద్వారా జగన్ ప్రభుత్వానికి రూ.597.35 కోట్లు ఆదాయం సమకూర్చుకొంది. కనుక జగనన్న చెప్పినట్లు రాష్ట్రంలో రోడ్లు, మద్యం విషయంలో నాడు-నేడులో ఎటువంటి మార్పు లేదని స్పష్టమవుతోంది.
ఇటీవల మంత్రి గుడివాడ అమర్నాథ్ బైబిల్, ఖురాన్, భగవద్గీతతో సమానమైన తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో చిన్న సవరణ చేస్తూ, “మద్యపాన నిషేదం మా మ్యానిఫెస్టోలో లేదు,” అని అన్నారు. టిడిపి సీనియర్ మహిళా నేత అనితా వంగలపూడి స్పందిస్తూ, “ ఇది దిగజారుడుతనం. తనకు ఓట్లు వేసిన మహిళలను మోసగించడమే అంటూ ఓ ట్వీట్ చేశారు. దానితో పాటు ఆనాడు జగనన్న ఆవేశంగా మద్యపానం నిషేధం గురించి చెప్పిన వీడియోని కూడా ట్విట్టర్ పోస్ట్ చేసి, సంపూర్ణ మద్యపాన నిషేదం మీ మ్యానిఫెస్టోలో ఉందో లేదో చెప్పాలంటూ సవాల్ విసిరారు.
Chatrapathi is set to re-release in a 4K version this year on the occasion of…
Following the terrible failure of Retro, director Karthik Subbaraj made a comeback with his indie…