
Veteran Telugu Actor Giri Babu Passes Away at 83
ప్రముఖ తెలుగు సినీ నటుడు గిరిబాబు శనివారం హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈరోజు ఉదయం ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు.
గిరిబాబు అసలు పేరు యర్రా శేషగిరిరావు. స్వస్థలం ప్రకాశం జిల్లా రావినూతల గ్రామం. చిన్నప్పటి నుంచే నాటకాలపై ఆసక్తితో నటించడం మొదలుపెట్టారు. ఆయన ‘జగమే మాయ’ (1973)లో సినీ పరిశ్రమలో ప్రవేశించి 2023 వరకు నాలుగు దశాబ్దాలలో అనేక వందల సినిమాలలో నటించారు.
ఆయన 1970-1990 మధ్య కాలంలో చేసిన సినిమాల్లో అనేక సూపర్ హిట్స్ ఉన్నాయి. ఆ సమయంలో ఆయన అందరు అగ్రహీరోలతో నటించారు. అలాగే విలన్, రాజకుమారుడు, కామాంధుడు, దురాశాపరుడు, అన్న, తండ్రి, వెర్రి వెంగళప్ప.. ఇలా ఏ పాత్ర చేసినా గిరిబాబు ముద్ర స్పష్టంగా కనిపించేది. ఇదివరకు అల్లు రామలింగయ్య, ఆ తర్వాత బ్రహ్మానందం, అలీ, నేటికీ వెన్నెల కిషోర్ వంటి వారు లేకుండా సినిమా లేదన్నట్లే, ఆరోజుల్లో గిరిబాబు లేని సినిమా లేదంటే అతిశయోక్తి కాదు.
నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన ఆయన సినీ ప్రస్థానంలో వందల సినిమాల్లో నటించారు. ఆయన నటించిన వాటిలో సూపర్ హిట్స్ కూడా చాలా ఎక్కువే. ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ సినీ జీవితంలో అన్ని హిట్స్ ఊహించడం కష్టమే.
ఆయన నటించిన హిట్ సినిమాలు: అన్నదమ్ముల అనుబంధం (1975), జ్యోతి (1976), కురుక్షేత్రం (1977), దేవతలారా దీవించండి (1977), కరుణామయుడు (1978), మల్లెపూవు (1978), సింహ గర్జన (1978), హేమాహేమీలు, బుర్రిపాలెం బుల్లోడు (1979), కాళీ (1980), భోగ భాగ్యాలు (1981), ఊరికిచ్చిన మాట (1981), గురు శిష్యులు (1981), నా దేశం (1982), ముందడుగు (1983), సింహాసనం (1986), ఖైదీ రుద్రయ్య (1986), జయం మనదే (1986), పసివాడి ప్రాణం (1987), అత్తకు యముడు అమ్మాయికి మొగుడు (1989), హలో బ్రదర్ (1994), భైరవ ద్వీపం (1994), నిన్నే పెళ్లాడతా (1996) వంటివి కొన్ని.
‘మెరుపు దాడి’, ‘ఇంద్రజిత్’, ‘నీ సుఖమే నే కోరుతున్నా’ వంటి సినిమాలతో గిరిబాబు నిర్మాతగా, దర్శకుడిగా తన ప్రతిభ చాటుకున్నారు.
గిరిబాబు చివరిగా చేసిన సినిమా 2023లో విడుదలైన అన్నీ మంచి శకునములే. ఆ తర్వాత ఆరోగ్య సమస్యల కారణంగా సినిమాలు చేయడం మానుకున్నారు.
గిరిబాబు సతీమణి 2016లో అనారోగ్యంతో మరణించారు. గిరిబాబు దంపతులకు బోసుబాబు, రఘుబాబు ఇద్దరు కుమారులు. వారిలో ప్రముఖ హాస్యనటుడు రఘుబాబు మనకు సుపరిచితులే.
గిరిబాబు మృతి పట్ల తెలుగు సినీ పరిశ్రమలో పలువురు సంతాపం తెలుపుతూ, ఆయనతో కలిసి పని చేసినప్పుడు ఏర్పడిన అనుబంధం గుర్తు చేసుకుంటున్నారు.
November 20, will mark the theatrical debut of Tamil star Dhanush's upcoming film Om. This…
ఒకప్పుడు రాజకీయ పార్టీలు ఎన్నికల్లో గెలిస్తే చాలు… ఆ తర్వాత పాలన, అభివృద్ధి, సంక్షేమ పథకాలపై పూర్తి సమయం కేటాయించి…