
అందరికీ వినోదం పంచుతూ వేలాదిమందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తున్న సినీ పరిశ్రమ నిత్యం అనేక సమస్యలు ఎదుర్కొంటూనే ఉంది. ఏపీ, తెలంగాణ ఆర్టీసీల పరిస్థితి కూడా ఇంచుమించు ఇదే.
కనుక పరస్పర ప్రయోజనం పొందుతూ ప్రయాణికులకు కాలక్షేపం, వినోదం అందించేందుకు నిత్యం రద్దీగా ఉండే విజయవాడ ఆర్టీసీ కాంప్లెక్స్‌లో రెండు మినీ థియేటర్లు ఏర్పాటు చేశారు. వాటికి మంచి ప్రజాధరణ లభించడంతో ఓ 4-5 ఏళ్ళు బాగానే నడిచాయి. వాటి ద్వారా ఆర్టీసీకి ఏడాదికి సుమారు రూ.5 లక్షలకు పైగా ఆదాయం వచ్చేది.
కానీ కోవిడ్, లాక్ డవున్ దెబ్బకు వాటిని లీజుకి తీసుకున్న వ్యక్తి ఆర్టీసీకి అద్దె చెల్లించలేకపోయారు. ఆ తర్వాత కోర్టు కేసుతో రెండు థియేటర్స్ మూతపడ్డాయి.
ఏడాది క్రితం మళ్ళీ వాటిని అద్దె ప్రాతిపదికన నిర్వహణకు టెండర్లు పిలవగా రవి అనే వ్యక్తి టెండర్ దక్కించుకొని, రెండు మినీ థియేటర్లను పూర్తిగా మరమత్తులు చేయించి, రవి సినిమాస్ పేరుతో అందుబాటులోకి తెచ్చారు. శుక్రవారం నుంచి రెండు థియేటర్లు ప్రారంభించారు.
ఆర్టీసీ కాంప్లెక్స్‌లో బస్సుల కోసం రెండు మూడు గంటలు ఎదురుచూసేవారు చాలా మందే ఉంటారు. ఊర్లోకి వెళ్ళి రావాలంటే సమయం సరిపోదు. కానీ అంతసేపు బస్టాండ్‌లో కూర్చొని కాలక్షేపం చేయడం కూడా కష్టమే. అలాంటి వారికి అక్కడే ఉన్న ఈ థియేటర్లలో సినిమా చూసి కాలక్షేపం చేయవచ్చు.
కేవలం ప్రయాణికులే వాటిలో సినిమాలు చూడాలనే నిబంధన ఏమీ ఉండదు కనుక చుట్టుపక్కల ప్రాంతాలలో నివసించేవారు వస్తారు.
కనుక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పెద్ద ఆర్టీసీ బస్టాండ్లలో, ముఖ్యంగా రైల్వే స్టేషన్లలో, విమానాశ్రయాలలో కూడా ఇటువంటి మినీ థియేటర్స్ ఏర్పాటు చేసినట్లయితే, ప్రయాణికులు, సినీ పరిశ్రమ, ఆర్టీసీ లేదా సదరు సంస్థలు, ప్రభుత్వం అందరికీ ఉపయోగపడతాయి కదా?
The grand launch of the M.S. A Legacy On Screen Launch event was held at…
An Instagram reel showing a chariot procession in Lewisham, London, has gone viral. The footage…