
ప్రపంచంలో చాలా మంది జీవితం చాలా యాంత్రికంగా మారిపోయిందని, అందువల్ల అది చాలా బోరింగ్‌గా మారిందని చెపుతుంటారు. అందుకే వారాంతపు సెలవులు ఉన్నవారు సినిమాలు, షికార్లు, ఆలయ సందర్శనాలు, విహారయాత్రలకు బయలుదేరిపోతారు.
కొందరు పబ్బులు, క్లబ్బులు, మందు పార్టీలతో రోటీన్ జీవితంలో చిన్న బ్రేక్ తీసుకుంటారు. ఈ విధంగా ఎవరి స్థాయి, అవకాశం బట్టి వారు రోటీన్ మధ్యలో గ్యాప్‌ను ఎంజాయ్ చేస్తుంటారు. అది మంచిదే, చాలాసార్లు అవసరం కూడా.
కానీ తర్వాత మళ్లీ డ్యూటీ లేదా వ్యాపార పనులకు బయలుదేరాలంటే “అబ్బా… మళ్లీ మొదలైంది రోటీన్… బోరింగ్” అనుకుంటూ నిరుత్సాహంగా బయలుదేరుతుంటారు. మనిషి సుఖసంతోషాలే కోరుకుంటాడు కనుక ఇలాంటి తాత్కాలిక వైరాగ్యం చాలా సహజమే.
కానీ జీవించి ఉన్నంతవరకు, శరీరంలో శక్తి ఓపిక ఉన్నంతవరకు ప్రతిరోజూ పొద్దున్నే లేచి టీ, కాఫీలు, టిఫిన్ల తయారీతో మొదలుపెట్టి రాత్రి అందరూ పడుకునేవరకు అవిశ్రాంతంగా పనిచేసే ఇంట్లో ఆడవాళ్ల పరిస్థితి ఏమిటి?
ఉద్యోగాలు, వ్యాపారాలు చేసే మగవారికి వారంలో ఒక బ్రేక్ లభిస్తుంది. కానీ ఇంట్లో ఆడవాళ్లకు ఆ బ్రేక్ ఎన్నడూ లభించదు. వాళ్లు కూడా “రోటీన్ జీవితం… బోరింగ్” అని పనులు మానేసి కూర్చుంటే పరిస్థితి ఏమిటి?
అసలు ఈ రోటీన్ జీవితాలే లేనివాళ్లు ఉన్నారు. ఉద్యోగాలు, ఉపాధి లేనివారు, అనారోగ్యంతో మంచాన పడినవారు, వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ జీవిస్తున్నవారి పరిస్థితి ఏమిటి?
తీవ్ర ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, అంగవైకల్యం వంటి అనేక సమస్యలతో సతమతమవుతున్నవారి పరిస్థితిని చూసినప్పుడు, మనకు ఒక రోటీన్ జీవితం ఉండటమే ఎంత పెద్ద విషయం అనేది అర్థమవుతుంది.
ఒకవేళ హటాత్తుగా ఈ బోరింగ్ ఉద్యోగమే పోతే? ఈ బోరింగ్ వ్యాపారంలోనే నష్టాలు వచ్చి దివాళా తీస్తే? లేదా ఒక్కసారిగా క్యాన్సర్ వంటి తీవ్ర అనారోగ్యం వస్తే పరిస్థితి ఏమవుతుంది?
అప్పుడు కూడా ఈ రోటీన్ జీవితం వద్దనుకోగలమా? లేదు కదా. అప్పుడీ రోటీన్ జీవితంతోనే ఈ సమస్యల నుంచి బయటపడాలని అనిపిస్తుంది. ఈరోజు విసుగ్గా అనిపించినదే అప్పుడు వరంగా అనిపిస్తుంది.
కనుక రోటీన్ జీవితం ఎంత బోరింగ్‌గా అనిపించినప్పటికీ, చాలా మందికి లభించని ఈ రోటీన్ జీవితం మనకు లభించడం వరమే అని గ్రహిస్తే, దాని విలువ కూడా తెలుస్తుంది. అప్పుడే ఈ జీవితం ఎలా సంతోషంగా గడపాలో అర్థమవుతుంది.
For the first time in Bigg Boss history, there is a double eviction in the…
Toxic has emerged as an epic disaster at the box office. While the movie bombed…