
ఈ రోజుల్లో మనుషుల విలువ, తెలివి తేటలను వారి సంపాదనతో కొలుస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఎంత సంపాదిస్తున్నావనేదే ముఖ్యం తప్ప వివేకం, విచక్షణ, లోకజ్ఞానం, విలువలు, మల్టిపుల్ స్కిల్స్ వంటివేవీ లెక్కలోకి రావు.
బ్యాంకుకి వెళ్లి విత్‌డ్రా ఫారం నింపడం రాకపోయినా పర్వాలేదు. ఎంత ప్యాకేజీ అనేదే ముఖ్యం. కాకినాడ ఎక్కడుందో… ముఖ్యమంత్రి, రాష్ట్రపతి ఎవరో తెలియకపోయినా పర్వాలేదు. నెలకు ఎంత సంపాదన అనేదే తెలివి తేటలకు నిదర్శనం.
కుటుంబ బంధాలలో కూడా డబ్బు సంపాదనే ప్రామాణికం. కనుక చాలా మంది తమ విలువని ఆ విధంగానే పెంచుకొని సమాజంలో తమ ‘రేటింగ్’ బాగా ఉంచుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ డబ్బు సంపాదించడం ఒక్కటే మనిషి విలువకి, తెలివికి కొలమానం కాదు.
డబ్బుతో విలాసవంతంగా జీవించవచ్చు. కానీ డబ్బు పంచిపెట్టి లేదా ఉదారంగా సాయపడి సమాజంలో, కుటుంబంలో కూడా విలువ పెంచుకోవచ్చు. కానీ అదే డబ్బు బంధాలను కత్తెరలా కత్తిరించేస్తుందని మరిచిపోకూడదు.
“వందల కోట్ల ఆస్తులున్నా నేను చనిపోకుండా ఏ వైద్యుడు నన్ను కాపాడలేకపోయాడు,” అని కన్నీళ్ళు పెట్టుకుంటూ చనిపోయిన ప్రముఖులు ఎందరో ఉన్నారు.
కనుక జీవించడానికి డబ్బు చాలా అవసరమే కానీ అదే జీవితం కాదు. డబ్బుతో మనుషులను కొలిచే దురలవాటు అసలే మంచిది కాదు.
మనిషి జీవితంలో మొదటి 10–15 బాల్యం, కౌమార దశలలో అమాయకంగా గడిచిపోతుంది. ఈరోజుల్లో సగటు ఆయుర్దాయం 65–75 ఏళ్ళకే ముగుస్తోంది. కనుక మనిషుల జీవితాలలో నుంచి 25-30 ఏళ్ళు కత్తిరించి తీసేసినట్లే భావించవచ్చు. కనుక ఈ రెండూ తీసేస్తే మిగిలింది 40-50 ఏళ్ళ చిన్న జీవితం మాత్రమే.
కనుక ఇంత చిన్న జీవితాన్ని డబ్బుతో ముడిపెట్టేసుకొని, తాము అశాంతి, అభద్రతాభావంతో బ్రతుకుతూ చాలా తెలివైన, విలువైన వారమని అనుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంటుంది.
డబ్బుతో అప్‌గ్రేడ్ అవడం తప్పు కాదు… కానీ మన విలువలు డీగ్రేడ్ కాకుండా జాగ్రత్తపడాలి. డబ్బు-బంధాలు-విలువల మధ్య బ్యాలెన్సింగ్ సాధించాలి. అప్పుడే జీవితానికి అసలైన విలువ ఏర్పడుతుంది.
For the first time in Bigg Boss history, there is a double eviction in the…
Toxic has emerged as an epic disaster at the box office. While the movie bombed…