
సిఎం చంద్రబాబు నాయుడు నేడు తిరుపతిలో జరిగిన భారతీయ విజ్ఞాన సమ్మేళనంలో మన పురాణాలు, వాటిలో పాత్రల గొప్పదనం గురించి వివరిస్తూ తల్లితండ్రులు తమ పిల్లలకు వాటి గురించి చెప్పాలని విజ్ఞప్తి చేశారు. అందరూ అయన మాటలను యధాలాపంగా విని అక్కడే వదిలేస్తారు. కానీ ఆయన చెప్పిన దాంట్లో ఒక్క రామాయాణం గురించి నాలుగు ముక్కలు చెప్పుకున్నా మనం ఎన్ని విషయాలు తెలుసుకోకుండా జీవించేస్తున్నామో అర్ధమవుతుంది.
రామాయణంలో శ్రీరామ చంద్రుడు మనిషి ఎలా జీవించాలో చెప్పాడు. సీతారాములు భార్యభర్తల బంధం ఏవిధంగా ఉండాలో ఒకవిధంగా చెపితే, అటువంటి అవకాశం లేని ఊర్మిళాదేవి మరోలా చెప్పారు. దురాశతో జీవితం నాశనమవుతుందని కైకేయి చెప్పింది.
సోదరులు ఎలా భరత, లక్షణ, శతృజ్ఞులు మసులుకోవాలో తెలిపారు. మనిషిలో అంతర్లీనంగా ఉండే శక్తిని ఏవిధంగా వెలికితీసి ఉపయోగించుకోవాలో హనుమంతుడు తెలియజెప్పాడు. బంగారు లేడి వ్యామోహంతో రామరావణ యుద్ధం జరుగవచ్చని తెలిపింది.
మనిషి తలుచుకుంటే సముద్రంపై ఆనకట్టకట్టవచ్చు.. సముద్రాన్ని లంఘించవచ్చని వానరులు చెప్పారు. పరాయి స్త్రీ, పరాయి పురుషుల పట్ల వ్యామోహం పతనానికి దారి తీస్తుందని రావణుడు, శూర్పణక చెప్పారు. దుష్ట సాంగత్యం వీడాలని విభీషణుడు చెప్పాడు.
నేటి అత్యాధునికమైన విమానాలలో సీట్లకు పరిమితి ఉంటుంది. కానీ నాటి పుష్పకవిమానంలో ఎంతమంది ఎక్కినా మరొకరికి చోటు ఉంటూనే ఉంటుంది. సముద్రంపై తేలియాడే రాళ్ళు… వాటితో వంతెన నిర్మాణం… నాటి మంత్ర శక్తులు, దివ్యాస్త్రాలు… ఇవన్నీ ఇంజనీరింగ్, టెక్నాలజీ అద్భుతాలా లేక యుగయుగాల క్రితమే గొప్ప గొప్ప ఆలోచనలకు నిదర్శనమా? ఏమైనా అనుకోవచ్చు.
ఇంత క్లుప్తంగా కుంటేనే రామాయణ గాధలో ఇన్ని విభిన్నమైన పాత్రలు, వాటి గొప్పదనం కళ్ళకు కట్టినట్లు కనిపిస్తోంది! అందుకే నాటి నుంచి నేటికీ రామాయణ, మహాభారత, భాగవతాలు చదువుతూనే ఉన్నారు. ఇక ముందు కూడా చదువుతూనే ఉంటారు.
ఎంతగానో అభివృద్ధి చెందామని, గొప్ప టెక్నాలజీ మా సొంతం అని గొప్పగా చెప్పుకుంటున్న మనం, ఇంకా యుగాల క్రితం నాటి వాటిని ఇంకా శోదిస్తున్నాము? నేటికీ వాటి నుంచే ఎప్పటికప్పుడు కొత్తకొత్త ఆలోచనలు కలుగుతున్నాయి. కొత్త అర్ధాలు, కొత్త కోణాలు కనిపిస్తూనే ఉన్నాయి. నేటికీ ఎంతో మందికి ఎన్నో విధాలుగా స్పూర్తి కలిగిస్తూనే ఉన్నాయి. అంటే మనం వెనక్కి, అవి ముందుకు టైమ్ ట్రావెల్ చేస్తున్నట్లే కదా?
యుగయుగాల కాల పరీక్షకు నిలిచి మనకి అందుబాటులో ఉన్న ఇంత గొప్ప గ్రంధాల పట్ల మనకి ఆసక్తి కోల్పోవడమే బాధాకరమనుకుంటే, వాటిని మనమే అపహాస్యం చేసుకోవడం ఇంకా బాధాకరం.
కనుక మనకి తెలియనివన్నీ విలువలేనివి కావు. వాటి విలువని మనం గుర్తించలేకపోతున్నాము. అంతే! మనం గుర్తించినా గుర్తించకపోయినా వాటి విలువెన్నడూ తగ్గదు. ఎవరూ తగ్గించలేరు కూడా!
For the first time in Bigg Boss history, there is a double eviction in the…
Toxic has emerged as an epic disaster at the box office. While the movie bombed…