
నేడు ఉగాది పండుగ.. నేటి నుంచి విశ్వావసు నామ సంవత్సరం ప్రారంభమయ్యింది. ఉగాది పండుగకు మాత్రమే పరిమితమైన షడ్రుచుల ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం.. మరీ ఇష్టం.
ఐదేళ్ళుగా అష్టకష్టాలు అనుభవించిన ఆంధ్రా ప్రజలు వాటి నుంచి విముక్తి పొందినందున మరింత సంతోషంగా ఇవాళ్ళ ఉగాది పండుగ జరుపుకొంటున్నారు.
‘విశ్వావసు’ అంటే విశ్వాన్ని నివాసయోగ్యంగా మార్చినవాడు… అంటే భగవంతుడు. సృష్టి, స్థితి, లయకరకులలో ‘స్థితి’ కారకుడైన శ్రీమన్నారాయణుడి నామాలలో విశ్వావసు కూడా ఒకటి. అంటే ఈ విశ్వాన్ని నడిపించే శ్రీమన్నారాయణుడి పేరుతో ఏర్పడిన సంవత్సరం అన్నమాట!
పంచాగకర్తలు కూడా ఈ ఏడాది అంతా శుభమే జరుగుతుందని చెపుతున్నారు. ఆ శ్రీమన్నారాయణుడి పేరుతో మొదలైన ఈ విశ్వావసు నామ సంవత్సరం రెండు తెలుగు రాష్ట్రాలకు భగవంతుని దీవెనగా భావించవచ్చు.
తెలుగు సంవత్సరాలు మొత్తం 60. వాటిలో 39వ సంవత్సరం ఈ విశ్వావసు సంవత్సరం. అసలు తెలుగు సంవత్సరాలు ఎలా ఏర్పడ్డాయి? వాటికి ఈ పేర్లు ఎలా వచ్చాయి?అని నేటితరం వారికి సందేహం కలుగుతుంది.
హిందూ పురాణాల ప్రకారం, నిత్యం నారాయణ నామం జపిస్తున్న కారణంగా తాను విష్ణుమాయకి అతీతుడునని నారదుడు గర్వంతో విర్రవీగుతుంటాడు. ఆయనకు బుద్ధి చెప్పాలనుకున్న విష్ణుమూర్తి భూలోకంలో ఓ అడవిలోని సెలయేరులో స్నానం చేసి రమ్మని సూచిస్తాడు.
అప్పుడు నారదుడు సెలయేరులో స్నానం చేయగా అందమైన స్త్రీగా మారిపోతాడు. తాను నారదుడిననే విషయం మరిచిపోయి అడవిలో తిరుగుతుంటే, వేటకు వచ్చిన ఓ మహారాజు ఆమెను చూసి మోహించి పెళ్ళిచేసుకుంటాడు. వారికి 60 మంది పిల్లలు కలుగుతారు. ఓ సారి యుద్ధంలో మహారాజు, 60 మంది కుమారులు చనిపోతారు.
అప్పుడు ఆమె వారిని తలుచుకొని శోకిస్తుంటే విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యి ఆమెకు పూర్వజన్మని గుర్తుచేస్తాడు. తాను విష్ణుమాయ వలననే స్త్రీగా మారి ఈ సంసార బంధాలలో చిక్కుకున్నానని గ్రహించిన నారదుడు, విష్ణుమూర్తిని ప్రార్ధించగా ఆయనకు మళ్ళీ పూర్వరూపం ప్రసాదిస్తాడు.
ఆ విదంగా నారదుడు ఇహలోక బంధాల నుంచి మళ్ళీ విముక్తి పొందినప్పటికీ, ఓ మాతృమూర్తిగా తన పిల్లలకు న్యాయం చేయాలని విష్ణుమూర్తిని ప్రార్ధించగా, ఆ 60 మంది సంతానం పేరుతో తెలుగు సంవత్సరాలు ఏర్పడేలా చేశాడని మన హిందూ పురాణాలు చెపుతున్నాయి.
హిందూ పురాణాల ప్రకారం, ఈ కలియుగంలో 5,126 సంవత్సరాలు పూర్తయ్యాయి. నేడు కలియుగంలో 5,127 వ సంవత్సరంగా విశ్వావసు ప్రారంభం అయ్యింది.
విశ్వావసు చాలా శుభప్రదమైన పేరు. కనుక ఈ ఏడాది అంతా శుభాలు జరుగుతాయని ఆశిద్దాం. తెలుగు ప్రజలందరికీ ఎం9 న్యూస్ తరపున ఉగాది పండుగ మరియు విశ్వావసు నామ నూతన సంవత్సరం శుభాకాంక్షలు.
The next 24 hours could be extremely consequential in Indian politics as something big is…
The elections to the Telugu Film and TV Dancers and Dance Directors Association will not…