
అధికారంలో ఉన్నవారు ప్రజలకు ఆదర్శంగా వ్యవహరించాలని ఆశించడం అత్యాశ కాదు. కానీ “మేము లంచాలు తీసుకొంటాము… ఎన్నికల ఫలితాలపై లక్షల రూపాయలు పందాలు కాస్తాము. కానీ అంత మాత్రాన్న మేము అవినీతిపరులమైపోము. మేమేమి వేలకోట్లు పోగేసుకోలేదు’ అని ఎవరైనా అంటే?
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్వయంగా ఇది చెప్పుకొన్నారు. ఒంగోలు పట్టణంలో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, “నేనేమి మహా నీతిమంతుడిని అని గొప్పలు చెప్పుకొను. మంత్రిగా ఉన్నప్పుడు ఎవరైనా డబ్బు ఇస్తే తీసుకొన్నాను. కానీ దాంతో నేనేమీ వేలకోట్లు పోగేయలేదు. ఎమ్మెల్యేగా ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర నుంచి తీసుకోలేదు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని నేను రూ.50 లక్షలు పందెం కాశాను. కానీ బిఆర్ఎస్ పార్టీ గెలిచి కేసీఆర్ మళ్ళీ సిఎం అవుతారని మా అబ్బాయి ప్రణీత్ రెడ్డి గట్టిగా వాదించాడు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే ఏపీలో జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి కాగలరని మావాడు వాదించాడు. మా వాడిని నొప్పించడం ఇష్టం లేక నేను బెట్టింగ్ నుంచి తప్పుకొన్నాను. కానీ చివరికి నేను పందెం కాసిన్నట్లే తెలంగాణలో కాంగ్రెస్ గెలిచి అధికారంలోకి వచ్చింది. మావాడికి, మా కుటుంబానికి జగన్ అంటే వెర్రి ప్రేమ. కానీ ఆయనకీ మాపై ఉండాలి కదా?” అని బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
తెలంగాణలో కేసీఆర్ మళ్ళీ అవ్వాలని, కాంగ్రెస్ ఓడిపోవాలని వైసీపి నేతలు ఎందుకు కోరుకొంటున్నారో బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్వయంగా బయటపెట్టేశారు కదా?
చంద్రబాబు నాయుడు హయాంలో భారీగా అవినీతికి పాల్పడ్డారంటూ జగన్ ప్రభుత్వం ఆయనపై ఎన్నో కేసులు నమోదు చేసి జైలుకి కూడా పంపింది. కానీ ఆయన నేరం చేసిన్నట్లు ఇంతవరకు నిరూపించలేకపోయింది. కానీ జగన్ మంత్రివర్గంలో పనిచేసిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి తాను అవినీతికి పాల్పడ్డానని స్వయంగా చెప్పుకొన్నారు. మరి ఆయనపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేయగలరా?పోలీసులు అరెస్ట్ చేయగలరా?
తెలంగాణ ఎన్నికలపై ఏపీలో జోరుగా బెట్టింగ్లు జరిగాయి. పోలీసులు బెట్టింగ్లు కాస్తున్నవారిపై దాడులు జరిపి భారీగా నగదు, మొబైల్ ఫోన్లు, లాప్ టాప్లు స్వాధీనం చేసుకొన్నారని వార్తలు వచ్చాయి. రూ.50 లక్షలు బెట్టింగ్ కాసానని బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్వయంగా బహిరంగంగా చెప్పుకొన్నారు. పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోగలరా?
వైసీపి ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలలో చాలామంది ఈ కోవకు చెందినవారేనని టిడిపి ఊరికే ఆరోపించడం లేదని స్పష్టమవుతోంది కదా?
Rajinikanth's Jailer 2 has taken a strong start at the global box office and is…
The TDP, Jana Sena and BJP have finalised their seat-sharing agreement for Andhra Pradesh’s urban…