
అందినకాడికి అప్పులు చేస్తూ బటన్ నొక్కి సంక్షేమ పధకాలకి వేలకోట్లు పంచిపెట్టేస్తుండటంతో నేటికీ ప్రభుత్వోద్యోగులకి జీతాలు, పెన్షనర్లకి పెన్షన్లు చెల్లించలేక జగన్ ప్రభుత్వం విమర్శలపాలవుతోంది. జీతాలు, పెన్షన్లు చెల్లించలేకపోతున్నా వందలకోట్లు ఖర్చు పెట్టి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటనలు ఇస్తూనే ఉంది. అంటే ప్రభుత్వానికి ఆర్ధిక క్రమశిక్షణ లేదని అర్దం అవుతోంది.
రాష్ట్రానికి రోజుకి పన్నుల రూపేణా నెలకి సుమారు రూ. 12,00-15,000 కోట్లు ఆదాయం వస్తుంటుంది. దానిలో రూ. 5,500 కోట్లు ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకి పోతుంది. ప్రభుత్వం చేసిన, చేస్తున్న అప్పులకి, వడ్డీలకి నెలకి సుమారు రూ.4,500 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇవి కాక ప్రభుత్వం మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సలహాదారుల జీతభత్యాలు, ప్రభుత్వం రోజువారీ నిర్వహణ ఖర్చులు, సిఎం జగన్మోహన్ రెడ్డి జిల్లా పర్యటనలు వగైరాలకు నెలకు రూ.500-1,000 కోట్లు పైనే అవసరం ఉంటుంది. అంటే ఆదాయం కంటే ఖర్చులే ఎక్కువని స్పష్టం అవుతోంది.
ఈ నెలలో ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకు ఇంకా రూ.2,900 కోట్లు చెల్లించాల్సి ఉంది. కానీ అందరికీ ఒకేసారి జీతాలు చెల్లించలేక రోజుకి కొంత మందికి చొప్పున జీతాలు, పెన్షన్లు చెల్లిస్తోంది. ఈ లెక్కన 15వ తేదీ వరకు అందరికీ చెల్లించే అవకాశం ఉంది. మళ్ళీ 15 రోజులలో జీతాలు, అప్పులు, వడ్డీలు అన్నీ చెల్లించాల్సి ఉంటుంది. కనుక కొత్త సంవత్సరంలో కూడా ఈ పాత కష్టాలే కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇటువంటి పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వం జగన్ ప్రభుత్వానికి ఊహించని పెద్ద షాక్ ఇచ్చింది. జీఎస్టీ, తదితర పన్నులలో ఏపీ వాటాగా కేంద్ర ప్రభుత్వం రూ.682 కోట్లు, అదనంగా మరో రూ.300 కోట్లు కలిపి మొత్తం రూ.982 కోట్లు విడుదలకావాల్సి ఉంది. దాని కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆతృతగా ఎదురుచూస్తుంటే కేంద్ర ప్రభుత్వం దానిని వెనక్కి తీసేసుకొని పాత బకాయిల కింద దానిని జమా చేసుకొంటున్నట్లు వర్తమానం పంపించింది. మూలిగే నక్కపై తాటి పండు పడటం అంటే ఇదేనేమో?
కనుక సంక్షేమ పధకాలకు, జీతాలు, పెన్షన్ల చెల్లింపులకు మరింత కష్టమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్ధిక క్రమశిక్షణ లోపించడం వలననే ఈవిదంగా జరుగుతోందని అర్దమవుతూనే ఉంది. దానికి ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయలు, చివరికి పనులు చేసిన కాంట్రాక్టర్లు కూడా మూల్యం చెల్లించాల్సివస్తుండటమే చాలా బాధాకరం! అయినప్పటికీ వైసీపీ పాలన దివ్యంగా ఉందని సిఎం జగన్మోహన్ రెడ్డి మొదలు మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ గొప్పలు చెప్పుకోవడం మానుకోకపోవడమే విడ్డూరం.
The fifth T20I between India and West Indies was washed out due to rain at…
Vijay Deverakonda’s Ranabaali is trying to maintain momentum at the box office after receiving mixed…