
ఒక్కో సినిమా విడుదలకు ఒక్కో రూల్ అప్లై చేస్తూ చివరకు ధియేటర్లలో బొమ్మ పడితే చాలు అనే స్థాయికి సినీ రంగాన్ని తీసుకువెళ్లడంలో వైసీపీ నాయకత్వం విజయవంతం అయ్యింది. ప్రత్యర్థి పార్టీ అధినేత సినిమా విడుదల సమయంలో అయితే ఏకంగా ప్రభుత్వ సిబ్బందిని రంగంలోకి దింపిన దృశ్యాలు కళ్ళ ముందు సాక్షాత్కరించాయి.
మెగాస్టార్, సూపర్ స్టార్, డార్లింగ్ ప్రభాస్, రాజమౌళి, కొరటాల ఇలా తెలుగు సినీ రంగ ప్రముఖులుగా చెప్పబడే అగ్ర తారాగణం మొత్తం జగన్ ముందు ప్రత్యేక్షమైతేనే కానీ సమస్యకు పరిష్కారం దొరకని పరిస్థితి తెలుగు సినిమాది. అయితే అక్కడ కూడా కండిషన్స్ అప్లై అంటూ షరతులతో కూడిన రూల్స్ పెట్టిన వైనం తెలిసిందే.
“ఆర్ఆర్ఆర్” సినిమాతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పారు జక్కన్న. ఇటువంటి ప్రతిష్టాత్మక చిత్రం విడుదలకు కూడా “వస్తేనే పెంచుతాను” అన్న చందంగా రాజమౌళి వచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి తన వినతులు విన్నవించుకున్న తరువాతనే ధరలు పెంచుకునే అవకాశం ఏపీ ప్రభుత్వం కల్పించింది.
తెలుగు సినిమాలకు ఇన్ని అవంతరాలు సృష్టించిన జగన్ సర్కార్, డబ్బింగ్ సినిమాగా దేశ వ్యాప్తంగా విడుదలకు సిద్దమైన ‘కేజీఎఫ్’ మూవీకి మాత్రం టికెట్ ధరల పెంపుపై ఎటువంటి రచ్చ చేయలేదు. ఆ చిత్ర దర్శకులు జగన్ ను దర్శించనేలేదు, అయినా టికెట్ ధరల పెంపుకి అవకాశం కల్పించారు. జగన్ కు ఉన్నది తెలుగు సినీరంగం మీద కక్ష్య? లేక తెలుగు భాష మీద కక్ష్యా? అంటూ నోరెళ్లబెట్టడం సగటు తెలుగు సినీ అభిమానుల వంతవుతోంది.
తెలుగు సినిమా పట్ల జగన్ ప్రభుత్వం చూపిస్తున్న ఈ ‘సవతి తల్లి’ ప్రేమను చూసి “అయినోడికి ఆకుల్లో… కానోడికి కంచాల్లో” అంటూ చెవులు కోరుకుంటున్నారు సినీ ఇండస్ట్రీ పెద్దలు. ఇదే ఒరవడిని ఇక మున్ముందు తెలుగు సినిమాలకు కూడా కొనసాగిస్తే చాలు అన్నది అంతిమంగా టాలీవుడ్ వర్గీయులు కోరుకుంటున్న విషయం.
The nomination process for municipal elections in Andhra Pradesh has ended with the YSR Congress…
The firing incident at Tiger Shroff’s residence in Mumbai has taken a new turn after…