
విజయమ్మ రాజీనామా వ్యవహారం ఒక్క రోజు ముందే బయటకి పొక్కిపోవడంతో మీడియా ప్రతినిధులకు జవాబు చెప్పలేక ఇబ్బంది పడిన వైసీపీ నేతలు, మొదటిరోజు సమావేశం ముగిసిన తరువాత మళ్ళీ అదే ప్రశ్న ఎదుర్కోవలసి రావడంతో చాలా ఇబ్బందిపడ్డారు.
విజయమ్మ ఎందుకు రాజీనామా చేయవలసి వచ్చింది? లేదా విజయమ్మను ఎందుకు పంపేశారు?అని మీడియా నిలదీస్తుందని గ్రహించారు కనుక సిఎం జగన్మోహన్ రెడ్డి అందరినీ ముందే సిద్దం చేసినట్లున్నారు. కనుక ఇంచుమించు అందరూ ఒకే రకంగా సమాధానం చెప్పారు.
ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ ప్రశ్నకు సమాధానం చెపుతూ, “విజయమ్మ ఎందుకు రాజీనామా చేశారో ఆమె వేదిక మీదనే చాలా స్పష్టంగా చెప్పారు. వైఎస్సార్ కుటుంబంలో అందరికీ మొదటి నుంచి అన్ని విషయాలలో చాలా ఓపెన్‌గా మాట్లాడే అలవాటు ఉంది. అందుకే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నానని విజయమ్మ చాలా ఓపెన్‌గా చెప్పారు.
అక్కడ తెలంగాణలో వైఎస్ షర్మిలకు తన అవసరం ఉంది కనుక వైసీపీలో బాధ్యతల నుంచి తప్పుకొని ఆమెకు సహాయపడాలనుకొంటున్నట్లు చెప్పారు. అంతే తప్ప సిఎం జగన్మోహన్ రెడ్డి విజయమ్మ చేత బలవంతంగా రాజీనామా చేయించి బయటకి పంపలేదు. ఆమె ఇంత స్పష్టంగా చెప్పినా టిడిపి, దాని అనుకూల మీడియా కోడిగుడ్డుకి ఈకలు పీకే ప్రయత్నం చేసినట్లు విజయమ్మ మాటలలో నుంచి పెడర్ధాలు తీసి దానికి వక్ర బాష్యాలు చెపుతున్నాయి. వాటి తీరే అంత. ప్రతీ దానిపై రాజకీయం చేయడం, మా మీద బురద జల్లడం దురలవాటుగా మారిపోయింది,” అని అన్నారు.
ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ పెట్టి గంటసేపు వైఎస్సార్‌కి తీరని అన్యాయం జరిగిందని మాట్లాడిన వైఎస్ షర్మిల, విజయమ్మ రాజీనామా అంశంపై విలేఖరులు ప్రశ్నించినప్పుడు, “వైఎస్సార్ గారి జయంతి రోజున అవన్నీ ఎందుకు?” అంటూ సమాధానం చెప్పకుండా దాట వేశారు.
తండ్రి జయంతి సందర్భంగా ఈరోజు ఉదయం ఆమె ఇడుపులపాయకు వెళ్ళినప్పుడు, అన్నను పలకరించలేదు. ‘జగనన్న’ని చెప్పుకొనే సిఎం జగన్మోహన్ రెడ్డి కూడా చెల్లిని పలకరించలేదు. విలేఖరుల ప్రశ్నకు, విజయమ్మ రాజీనామాపై వైసీపీ నేతల వాదనలకు ఇదే సమాధానంగా భావించవచ్చు.
Chatrapathi is set to re-release in a 4K version this year on the occasion of…
Following the terrible failure of Retro, director Karthik Subbaraj made a comeback with his indie…