
2019-2022 సం.ల మద్య అంటే ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర పెట్టుబడుల ప్రమోషన్ బోర్డ్ రూ.1,81,821 కోట్ల పెట్టుబడులకి ఆమోదం తెలిపింది. ఆమోదించిన ఈ పెట్టుబడులన్నీ వస్తే రాష్ట్రంలో 1,40,903 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభిస్తాయని అధికారులు లెక్కలు కట్టారు. కానీ ఆచరణలో సగటున ఏడాదికి రూ.15,693 కోట్లు మాత్రమే పెట్టుబడులు వస్తున్నట్లు ప్రభుత్వ రికార్డులే చెపుతున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి ప్రతీ నెల సగటున వచ్చే కనిష్ట పెట్టుబడులు ఇవి. అంటే పెట్టుబడులని ఆకర్షించడంలో ఏపీ ఎంతగా వెనకబడిపోయిందో అర్ధం చేసుకోవచ్చు.
రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా సదస్సులు నిర్వహించవచ్చు… అంతకంటే గొప్ప వాటి గురించి ప్రచారం కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ సొంత డబ్బా కొట్టుకోవడానికి లేదా ప్రజలకి చెప్పుకోవడానికి మాత్రమే పనికి వస్తాయి తప్ప వాటితో పెట్టుబడులు రావు.
ఏ రాష్ట్రానికైనా పెట్టుబడులు రావాలంటే సుస్థిరమైన ప్రభుత్వం, పెట్టుబడులకి అనుకూలమైన చక్కటి రాజకీయ వాతావరణం, శాంతి భద్రతలు, వ్యాపారావకాశాలు ఉండాలి. ఇవన్నీ ఉంటే అప్పుడు ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలు లేదా రాయితీలని పెట్టుబడుదారులు చూస్తారు. కానీ ఏపీలో ఇటువంటి మంచి వాతావరణం ఉందా?అంటే సమాధానం అందరికీ తెలుసు.
ఒకవేళ వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులని అనకుండా విశాఖని రాజధానిగా చేసుకొని పరిపాలన చేస్తున్నా పెట్టుబడిదారులకి నమ్మకం కలిగి ఉండేదేమో?కానీ ప్రభుత్వమే మూడు రాజధానుల కోసం ఉద్యమాలు చేస్తుంటే పెట్టుబడుదారులు రాష్ట్రానికి వస్తారా?
గత ప్రభుత్వం మొదలుపెట్టిన అమరావతి నిర్మాణ పనులని వైసీపీ ప్రభుత్వం నిలిపివేసింది. ఏపీలో టిడిపి అధికారంలోకి వస్తే మళ్ళీ అమరావతినే రాజధానిగా చేస్తామని చెపుతోంది. కనుక వైసీపీ ప్రభుత్వం సదస్సులో పెట్టుబడుదారులకి ఏమని చెపుతుంది?మళ్ళీ తామే అధికారంలోకి వస్తామని, ఇవే విధానాలు కొనసాగిస్తామని, కనుక పెట్టుబడులు పెట్టమని వారిని ఒప్పించగలదా?
రాష్ట్రంలో ఇటువంటి రాజకీయ అస్తిరత ఉన్నపుడు పెట్టుబడి పెట్టడం అంటే ఆత్మహత్య చేసుకోవడమే అవుతుంది. ఉదాహరణకి మొదట అమరావతి రాజధాని అనుకొన్నప్పుడు ఆ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ బూమ్ వచ్చింది. తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చి మూడు రాజధానులనప్పుడు అమరావతిలో రియల్ ఎస్టేట్ తీవ్రంగా నష్టపోయింది. ఈ చేదు అనుభవంతో విశాఖలో రియల్ ఎస్టేట్ పెట్టుబడులు పెట్టడానికి భయపడుతున్నారు. నేటికీ విశాఖ రాజధాని చేయలేకపోవడం వలన విశాఖలో రియల్ ఎస్టేట్ రంగం డైలమాలో ఉంది. ఎందుకంటే విశాఖలో పెట్టుబడులు పెట్టిన తర్వాత మళ్ళీ రాజధాని అమరావతికి షిఫ్ట్ అయిపోతే నష్టపోతామనే భయమే కారణం. రూ.5-10 కోట్లు పెట్టుబడిపెట్టే చిన్న చిన్న రియల్ ఎస్టేట్ సంస్థలే ఇంతగా ఆలోచిస్తున్నప్పుడు, వందల కోట్ల పెట్టుబడులు పెట్టేవాడు ఇంకెంత ఆలోచిస్తాడు?
ఏపీకి పెట్టుబడులు రాకపోవడానికి ప్రధాన కారణం ఒక ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాలను, మొదలుపెట్టిన పనులను తర్వాత ప్రభుత్వం కొనసాగిస్తుందనే నమ్మకం లేకపోవడమే అని స్పష్టం అవుతోంది.
గతంలో అనేక ప్రభుత్వాలు మారాయి. కానీ ఎప్పుడూ ఈవిదంగా జరగలేదు. కనుక నిలకడగా పెట్టుబడులు, పరిశ్రమలు వస్తుండేవి. కనుక ఏపీలో ఈ రాజకీయ అస్తిరత్వం పూర్తిగా తొలగిపోయే వరకు ఏపీకి పెట్టుబడులు, పరిశ్రమలు రావడం కష్టమే అని భావించవచ్చు. కనుక రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా సదస్సులు నిర్వహించే ముందు ఈ సమస్యలకి సంతృప్తికరమైన సమాధానాలు సిద్దం చేసుకోవడం చాలా అవసరం. లేకుంటే విశాఖలో జరుగబోయే సదస్సు కాలక్షేప సదస్సుగా మిగిలిపోతుంది అంతే!
Music composer Anirudh and Sunrisers Hyderabad CEO Kavya Maran are making headlines after their wedding…
Sanchi Rai gives the saree a moodier, more playful makeover in this warm, intimate photoshoot.…