
దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీ తో తమిళనాడు రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది. 75 ఏళ్ళ రాజకీయ చరిత్ర అంటూ తొడలు కొట్టిన డీఎంకే, దశాబ్దాల రాజకీయ అనుభవం అంటూ జెబ్బలు చరుచుకున్న అన్నాడీఎంకే రెండేళ్ల రాజకీయ పసికందైన విజయ్ టీవీకే ముందు కుప్పకూలిపోయాయి.
అయితే డీఎంకే అధికార పీఠానికి దూరమై ప్రతిపక్ష పాత్ర పోషించడానికి సిద్దమైన తరుణంలో డీఎంకే అధినేత స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ కు తనను తానూ ఒక పరిణితి చెందిన రాజకీయ నేతగా నిరూపించుకోవడానికి మంచి అవకాశం లభించినట్లైయింది.
స్టాలిన్ ఓటమితో ఉదయనిధి స్టాలిన్ కి అసెంబ్లీ లో ప్రతిపక్ష నేత హోదా దక్కింది. అయితే ఆ వచ్చిన అవకాశాన్ని ఉదయనిధి సద్వినియోగం చేసుకుని పార్టీకి బలంగా మారతారా.? లేదా వచ్చిన అవకాశాన్ని తన రాజకీయ విధానాలతో దుర్వినియోగ పరచుకుని పార్టీకి బరువవుతారా.? అనేది రానున్న రోజులలో తెలుస్తుంది.
అయితే గతంలో సనాతన ధర్మం పై ఉదయనిధి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు డీఎంకే ఓటమిలో, స్టాలిన్ అపజయంలో కీలక పాత్ర పోషించాయని ఇప్పటికే టాక్ మొదలయింది. ఇక తాజాగా మరోసారి ఉదయనిధి అసెంబ్లీ సాక్షిగా సనాతన ధర్మం నిర్మూలన తప్పనిసరి అంటూ సీఎం విజయ్ కి సూచనలు చేయడం,
విజయ్ ని, ఆయన టీవీకే పార్టీని ఉద్దేశిస్తూ మేము, మా పార్టీ మీకంటే రాజకీయంగా బాగా సీనియర్స్ అని, పొలిటికల్ జూనియర్స్ సీనియర్స్ సలహాలు తీసుకోవాలంటూ ఉదయనిధి విజయ్ కి ఉచిత సలహాలు ఇస్తున్నారు. అలాగే విజయ్ టీవీకే పార్టీని తమిళనాట 65% ప్రజలు వ్యతిరేకించారని,
డీఎంకే రాజకీయ వయస్సు 75 వసంతాలు అంటూ విజయ్ ని, ఆయన పార్టీ టీవీకే ని తక్కువ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే టీవీకే ని 65% ప్రజలు వ్యతిరేకించారు అని తెలుసుకున్న ఉదయనిధి ఆయన తండ్రి పార్టీ డీఎంకే ను 75% ప్రజలు తిరస్కరించారని గ్రహించలేకపోతున్నారా.?
అయినా తమిళ ప్రజలు దశాబ్దాల నుంచి రాష్ట్రంలో సాగుతున్న రాజకీయాలను మార్చాలని అనే భావనతో విజయ్ టీవీకే పార్టీకి 108 సీట్లు కట్టబెట్టారు. అంటే తమిళ ప్రజలు రాష్ట్రంలో రాజకీయ మార్పు కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారు అనేది స్పష్టమయ్యింది.
కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీవీకే పార్టీ విషయంలో ఉదయనిధి పదేపదే రాజకీయ అనుభవం గురించి లేవనెత్తితే అది డీఎంకే పార్టీకి రాజకీయ ఇబ్బందులను తెచ్చిపెట్టే ప్రమాదం లేకపోలేదు. డీఎంకే పార్టీ పరంగా అనుభవం ఉన్నప్పటికీ ప్రజలు ఆమోదం దక్కలేదు అనే విషయాన్ని ఉదయనిధి ఇప్పటికైనా గ్రహించాలి.
లేదు అని ఇలానే సనాతన ధర్మాన్ని నిర్ములించాలి, సీనియర్ పొలిటికల్ పార్టీల సలహాలు తీసుకోవాలి అంటూ సీఎం విజయ్ కి సూచనలు, సలహాలు ఇస్తూ పోతే ఉదయనిధి స్టాలిన్ రాజకీయం డీఎంకే పార్టీకి రాజకీయ ప్రయోజనాల కంటే రాజకీయ నష్టాన్నే తెచ్చిపెట్టే ప్రమాదం ఉంది.
ఉదయనిధి టీడీపీ పార్టీ అధినేత బాబు తనయుడు లోకేష్ మాదిరి తన రాజకీయ విధానాలతో పార్టీని తిరిగి అధికారంలోకి తెగలరా.? కేసీఆర్ తనయుడు కేటీఆర్ మాదిరి పార్టీ బాధ్యతలను భుజాన వేసుకుని అధికార పార్టీతో పోరాడగలరా.? లేదా జగన్ మాదిరి వచ్చిన ఒక్క ఛాన్స్ అవకాశాన్ని తన మూర్కత్వంతో, మొండి వాదనతో దుర్వినియోగం చేసుకుంటారా.? అనేది వేచి చూడాలి.
AP Chief Minister N. Chandrababu Naidu and Deputy Chief Minister Pawan Kalyan held a key…
Venkatesh-Trivikram’s Aadarsha Kutumbam AK 47 was expected to arrive on October 9 after missing its…