
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో రాజకీయ వారసులుగా ప్రజాదరణ పొందిన నేతలు చాలామందే ఉన్నప్పటికీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా సేవలందించిన ఆరుగురి ముఖ్యమంత్రుల కుమారులు నేడు ఏపీ రాజకీయ రణరంగంలో పోటీ పడడానికి సిద్ధమయ్యారు. ఈ ఆరుగురి రాజకీయ వారసుల పోరు గురించి క్లుప్తంగా…
1 * వైస్సార్ కుమారుడిగా రాజకీయ అరంగేట్రం చేసి ముఖ్యమంత్రి పదవిని అందుకున్న వైస్ జగన్ మోహన్ రెడ్డి. ఈయన వైసీపీ పార్టీ నుండి కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం నుండి బరిలోకి దిగనున్నారు. 2009 లో తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ తరుపున కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.
2 * మాజీ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్. ఈయన 2014 లో టీడీపీ నుంచి పరోక్ష రాజకీయ వేదికైన ఎమ్మెల్సీ ద్వారా విభజిత ఏపీకి ఐటీ, పంచాయితీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2019 ఎన్నికలలో తొలిసారిగా ప్రత్యక్ష రాజకీయాలను పలకరించిన లోకేష్ పోటీ చేసిన గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం నుండి బరిలో దిగి వైసీపీ అభ్యర్థి ఆర్కే చేతిలో స్వల్ప తేడాతో ఓటమి చెందారు. 2024 లో కూడా అదే ప్రాంతం నుండి పోటీకి సిద్ధమయ్యారు ఈ మాజీ ముఖ్యమంత్రి తనయుడు.
3 * తెలుగు వాడి ఆత్మ గౌరవం అనే నినాదంతో తెలుగు వారి పౌరుషాన్ని ఢిల్లీ గల్లిలలో చూపించిన నందమూరి తారక రామారావు కుమారుడు నందమూరి బాలకృష్ణ. రాష్ట్ర విభజన అనంతరం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన బాలకృష్ణ 2014 లో అనంతపురం జిల్లా హిందూపూర్ నుండి టీడీపీ ఎమ్మెల్యే గా పోటీ చేసి గెలుపొందారు. 2024 లో కూడా అదే ప్రాంతం నుండి పోటీకి సై అంటున్నారు బాలయ్య.
4 * ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో టీడీపీ పార్టీలో వచ్చిన ఊహించని సంక్షోభంతో ఏపీ ముఖ్యమంత్రిగా పట్టాలు అందుకున్నాడు నాదెండ్ల భాస్కర్ రావు. ఆయన రాజకీయ వారసుడిగా కాంగ్రెస్ పార్టీలో తన రాజకీయ జీవితాన్ని ఆరంభించిన నాదెండ్ల మనోహర్ ఇప్పుడు జనసేన పార్టీ నుండి గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం బరిలో నిలవనున్నారు.
5 * కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి తనయుడు కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి. 2004 లో తండ్రి వారసత్వాన్ని అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ పార్టీ తరుపున ఎంపీ అభ్యర్థి పోటీలో నిలబడిన జయ సూర్య ప్రకాశ్ 2019 లో టీడీపీ పార్టీ కండువా కప్పుకున్నారు. 2019 ఎన్నికలలో ఓటమి పాలైన సూర్య ప్రకాష్ 2024 లో కర్నూల్ జిల్లా దోనె నియోజకవర్గం నుండి బరిలో దిగనున్నారు.
6 * నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు ఎన్ . రామ్ కుమార్ రెడ్డి. 2018 లో బీజేపీ నుండి బయటకు వచ్చి వైసీపీ లో చేరిన రామ్ కుమార్ 2024 ఎన్నికలలో నెల్లూరు జిల్లా లోని వేంకటగిరి నియోజకవర్గం నుండి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల బరిలో అడుగు పెట్టబోతున్నారు.
ఇలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రులు గా సేవలందించిన ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు, వైస్సార్, నాదెండ్ల భాస్కర్ రావు, కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఈ ఆరుగురి మాజీ ముఖ్యమంత్రుల తనయులు వారి తండ్రుల వారసత్వాన్ని నిలబెట్టుకోవడానికి…తమ రాజకీయ భవిష్యత్తు మెరుగుపరుచుకోవడానికి 2024 ఏపీ ఎన్నికల కురుక్షేత్రంలో దిగనున్నారు.
Andhra Pradesh’s local body elections are becoming an important test for the relationship between Chandrababu…
Yash’s look as Ravana in Nitesh Tiwari’s Ramayana has sparked another debate, with Aarya Babbar…