
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాజా ఇంటర్వ్యూలో ‘పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం’ గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం చెపుతూ, “ఆయనకు ఎటువంటి విజన్ లేదు.
రాష్ట్రంలో చేయాల్సిన అనేక పనులున్నాయి. వాటిపై దృష్టి పెట్టి పనిచేయకుండా విలువైన సమయం వృధా చేసుకుంటున్నారు. అయినా రోజుకో రకం దుస్తులు ధరించి పనిచేయడానికి ఇదేమీ సినిమా కాదు కదా? అసలు పవన్ కళ్యాణ్‌ని ఉప ముఖ్యమంత్రి హోదాలో చూడటమే నాకు చాలా ఇబ్బందిగా ఉంది.
రాష్ట్రంలో ప్రతిపక్షమే లేనప్పుడు పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంగా నిలిచి ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు కదా?” అని ప్రకాష్ రాజ్ అన్నారు.
ప్రకాష్ రాజ్ విమర్శలు పవన్ కళ్యాణ్ అభిమానులకు, జనసేన నేతలు, కార్యకర్తలకు ఆగ్రహం, అసహనం కలిగించవచ్చు. కానీ ఆయన వారు తమ మనసులో అనుకుంటున్న మాటలే చెప్పారని భావించవచ్చు.
పవన్ కళ్యాణ్‌ని ముఖ్యమంత్రిగా చూడాలని తహతహలాడిన వారందరూ ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టినందుకు చాలా సంతోషించారు.
రాజకీయాలలో ఏవిదంగా తన మార్క్ చూపారో, ఉప ముఖ్యమంత్రి హోదాలో కూడా ఆయన తన మార్క్ చూపుతారని అందరూ ఆశించారు.
కనీసం హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణలా రాజకీయ బాధ్యతలు పార్టీకి అప్పగించి సినిమాలు చేసుకుంటున్నా అభిమానులు సంతోషించి ఉండేవారు.
కానీ పవన్ కళ్యాణ్ అలా చేయలేరు కనుక ఉప ముఖ్యమంత్రిగా తామందరూ గర్వపడేలా పనిచేసి చూపిస్తారని అభిమానులు ఆశించడం తప్పు కాదు.
సినిమాలలో విలన్లను ఇరగదీస్తూ, చక్కటి వేషధారణలో దేశవిదేశాలలో హీరోయిన్‌తో రొమాన్స్ చేసే హీరోని చూసిన కళ్ళతో, కాషాయ దుస్తులు ధరించి సనాతన ధర్మ పరిరక్షణ అంటూ మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ చూడటం అభిమానులకు కష్టమే కదా?
పదేళ్ళకు పైగా అనేక ఎదురుదెబ్బలు, ఆర్ధిక రాజకీయ సమస్యలు, అవమానాలు, అవహేళనాలు అన్నిటినీ భరించిన తర్వాత ఎట్టకేలకు ఆంధ్రాలో జనసేన అధికారంలోకి వచ్చింది. జనసేనని అధికారంలోకి తీసుకురావడానికి ఎంతగా శ్రమ పడ్డారో పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువ ఎవరికి తెలుసు?
కనుక పవన్ కళ్యాణ్ ముందుగా మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా తన సమర్ధత నిరూపించుకోవాలి. ఆ తర్వాత రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసుకునే ప్రయత్నాలు చేయాలి.
కానీ ఈ రెండూ చేయకుండా సనాతన ధర్మం అంటూ తమిళనాడు రాజకీయాల గురించి మాట్లాడుతుండటం, దీక్షలు, తీర్ధయాత్రలు చేస్తూ కాలక్షేపం చేస్తుండటం అభిమానులు కూడా జీర్ణించుకోవడం కష్టమే కదా?
సిఎం చంద్రబాబు నాయుడు స్వయంగా రేయింబవళ్ళు పనిచేస్తూ మంత్రులందరూ కూడా మరింత కష్టపడి పనిచేయాలని పదేపదే చెపుతున్నప్పుడు, ఆయన తర్వాత ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న యువకుడైన పవన్ కళ్యాణ్ మరెంత కష్టపడి పనిచేయాలి?ఎంత సాధించాలి?కానీ పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు? అని ప్రజలు, అభిమానులు ఆలోచించకుండా ఉంటారా?
పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష పాత్ర పోషించాలనే ప్రకాష్ రాజ్ మాటలలో వైసీపీ వాసన తగులుతున్నప్పటికీ, ఉప ముఖ్యమంత్రిగా నిర్వహించాల్సిన బాధ్యతలు, అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకోవడం గురించి ఆయన చెప్పిన మాటలు సహేతుకంగానే ఉన్నాయనిపిస్తుంది.
జగన్ ఒక్క ఛాన్స్ విలువ గ్రహించలేక నష్టపోయారని పవన్ కళ్యాణ్‌కి కూడా తెలుసు. కనుక మొదటి ఛాన్స్ విలువ గ్రహించి ఈ అవకాశాన్ని, వేగంగా గడిచిపోతున్న విలువైన ఈ సమయాన్ని పవన్ కళ్యాణ్ గుర్తించి సద్వినియోగం చేసుకోవాలనే ప్రకాష్ రాజ్ మాటలను ఓ శ్రేయోభిలాషి హితవుగానే స్వీకరించి పాటిస్తే అభిమానులతో సహా అందరూ హర్షిస్తారు కదా?
The elections to the Telugu Film and TV Dancers and Dance Directors Association will not…
Andhra Pradesh chief minister Chandrababu Naidu is currently serving his fourth term in the office…