
ఐదేళ్ళపాటు ఆడిందే ఆట పాడిందే పాట… నా మాటే శాసనం అన్నట్లు సాగిపోయింది జగన్ ప్రభుత్వానికి. అలాగని ఇప్పుడు జరుగబోతున్న ఎన్నికలను జగన్ తక్కువ అంచనా వేయకుండా మొదటి నుంచే ఓటర్లనే లబ్ధిదారులకు సంక్షేమ పధకాలతో డబ్బు అందిస్తూనే ఉన్నారు. వారికి వాలంటీర్లతో కాపలా పెట్టుకున్నారు కూడా.
చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్నట్లు టిడిపిని దెబ్బ తీసేందుకు అన్ని ప్రయత్నాలు చేసి చివరికి చంద్రబాబు నాయుడుని జైల్లో కూడా వేశారు. పనిలో పనిగా ఆ చేత్తోనే ఓటర్ల జాబితాలను కూడా సర్దారు. అంతా సెట్ చేసేశాము. ఇక చొక్కా మడత పెట్టి ఎన్నికలకు వెళ్ళి 175 సీట్లు తెచ్చేసుకోవడమే అని అనుకుంటే, ఒకటొకటిగా అపశకునాలు కనబడటం మొదలయ్యాయి.
· టిడిపి, జనసేనల పొత్తులే వద్దనుకుంటే వాటితో బీజేపీ కూడా కలిసింది.
· టిడిపి, జనసేనలు ఎన్డీయే కూటమిలో చేరిపోయాయి.
· గత ఎన్నికలలో గెలిచేందుకు తోడ్పడిన కేసీఆర్ పరిస్థితి తారుమారైంది. దాంతో ఆయన ఇప్పుడు ఏపీ వైపు కన్నెత్తి చూడటం లేదు.
· గత ఎన్నికలలో వైసీపిని గెలిపించిన ప్రశాంత్ కిషోర్ ఈసారి సాయం చేయకపోగా, జగన్ ఓటమి ఖాయం అంటూ చెపుతూ ఎన్నికలకు ముందే వైసీపిని సగం ఓడిపోయేలా చేస్తున్నారు.
· ఎప్పుడో సందించి పడేసిన బాణం వైఎస్ షర్మిల ఏపీకి తిరిగి వచ్చి జగన్, అవినాష్ రెడ్డి గుండెల్లో గుచ్చుకుంటోంది.
· ఆమె కడప నుంచి పోటీ చేస్తుండటం, వివేకా హత్య కేసులో అన్నను వేలెత్తి చూపుతుండటం వైసీపి కొంప ముంచేవే.
· ఈ ఎన్నికల కోసమే వందల కోట్ల ప్రజాధనం ఖర్చు చేసి వాలంటీర్లను ఏర్పాటు చేసుకుంటే, సరిగ్గా ఎన్నికల సమయంలో వారు వైసీపికి ఉపయోగపడకుండా పోయారు.
· నయన్నో భయన్నో వారి చేత రాజీనామాలు చేయించి వాడుకుందామంటే చంద్రబాబు నాయుడు మద్యలో దూరి ‘ఎవరూ రాజీనామాలు చేయొద్దు… మేము అధికారంలోకి వచ్చాక నెలకు రూ.10 వేలు జీతాలు ఇస్తామని అడ్డు పడ్డారు.
· తాజాగా పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి, పురపాలక శాఖలలో ఆధ్వర్యంలోని స్వయం సహాయక బృందాలను ఎన్నికల కోసం వాడుకోవడానికి వీల్లేదని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా జగన్ ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేశారు.
·‘గులక రాయితో హత్యయత్నం’ కేసు కూడా బెడిసికొట్టిన్నట్లే ఉంది. అది జస్ట్ ఓ క్వార్టర్ బాటిల్ కధ అని నారా లోకేష్ ట్వీటేశారు.
· కరువులో అధిక మాసమన్నట్లు తోట త్రిమూర్తుల కేసులో సరిగ్గా ఇప్పుడే తీర్పు వచ్చింది. ఎప్పుడో 28 ఏళ్ళ క్రిందట శిరోముండనం కేసులో విశాఖ జిల్లా కోర్టు ఆయనకు 18 నెలలు జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. దాంతో ‘వైసీపిలో పై నుంచి కిందవరకు అందరూ సౌమ్యులు, ఆణిముత్యాలేనా?’ అంటూ టిడిపి నేతలు అప్పుడే సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.
ఈ వరుస పరిణామాలన్నీ వైసీపికి అపశకునాలుగానే కనిపిస్తున్నాయి. ఒకటో రెండో అపశుకునాలయితే సర్ధిచెప్పుకోవచ్చు. కానీ వరుసగా ఇన్ని అపశకునాలంటే ఏదో తేడాగానే ఉంది. కనుక వైసీపిలో అందరూ ఆలోచించుకోవలసిందే.
Aadarsha Kutumbam - AK47 was recently postponed again, and there is still no clarity about…
The USCIS has officially removed the 540-day automatic extension granted to H-4 visa holders with…