
సువిశాలమైన భారతదేశానికి ఒకే ఒక్క రాజధాని ఉంటే. రాష్ట్ర విభజనతో మరింత చిన్నదైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రం ఒకటి సరిపోదు మూడు రాజధానులు ఉండాలని కనిపెట్టిన మహా మేధావి జగన్మోహన్ రెడ్డి. రివర్స్ టెండరింగ్, వాలంటీర్, సచివాలయ వ్యవస్థలను స్థాపించిన మహా మేధావి జగన్.
రాష్ట్రాని పరిశ్రమలు, ఐటి కంపెనీలు రప్పించి, రోడ్లు నిర్మించి అభివృద్ధి చేయడం కంటే సంక్షేమ పధకాల పేరుతో అందరికీ డబ్బు పంచిపెడితే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని, దానినే అభివృద్ధి అంటారని అభివృద్ధికి కొత్త భాష్యం చెప్పిన గొప్ప ఆర్ధికవేత్త జగన్.
ఆయన కలలుగన్న ఆ అభివృద్ధి కోసం… ప్రజలకు మేలు చేయడం కోసమే జగన్ లక్షల కోట్లు అప్పులు తెచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టారు.
పేదవాడికి సెంటు భూమిలో ఇల్లు, తనకు రూ. 500 కోట్లతో ప్యాలస్ అవసరమని చాటి చెప్పిన మహనీయుడు జగన్.
ఇంత అద్భుతమైన తెలివితేటలు కలిగిన జగన్‌కు సలహాదారు అవసరమా? అంటే లేదనే అర్దమవుతోంది. కానీ చాలా ఉదార హృదయంతో సుమారు ఓ వందమందిని 5 ఏళ్ళు మేపారు. వారితో పాటు ‘ఐప్యాక్’ని కూడా 5 ఏళ్ళు పోషించారు.
అలాగని జగన్ ఏనాడూ వారిని సలహాలు అడిగి ఇబ్బంది పెట్టలేదు. ఎందుకంటే మహా మేధావి అయిన జగన్‌కు వారి తొక్కలో సలహాలు అవసరమే లేదు కనుక!
అయితే తన మనసులో ఆలోచనలని, ద్వేషాన్ని, ఆశలు, కోరికాలని మీడియాతో చెప్పే బాధ్యత సజ్జల రామకృష్ణా రెడ్డికి అప్పగించడంతో, ఆయన తన కొడుకు భార్గవ్ రెడ్డితో కలిసి గుర్రపుడెక్క మొక్కల్లా వైసీపి అంతటా అల్లుకుపోయారు.
దాంతో వారు చెప్పిందే శాసనం.. అన్నట్లయిపోయింది. పచ్చపచ్చగా ఉంది కదాని గుర్రపుడెక్క మొక్కని తెచ్చి పెంచుకుంటే చివరికి ఏమయిందో అందరూ చూశారు.
కనుక జగన్ ఆ మొక్కని పెరికివేసి దాని స్థానంలో ‘ఆళ్ళ మోహన్ సాయి దత్’ అనే కొత్త మొక్కని నాటుకున్నారు. చెన్నై ఐఐటిలో చదువుకున్న ఈయన గత కొంతకాలంగా ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్‌లా ఓ టీమ్ ఏర్పాటు చేసుకొని వివిద పార్టీలకు పనిచేస్తున్నారు. కనుక సజ్జల, ఐప్యాక్ ఇద్దరికీ ఆళ్ళ మోహన్ సాయి దత్ రీప్లేస్‌మెంట్ అన్నమాట!
కానీ జగన్ సలహాదారుల మాట విని ఉంటే నేడు వైసీపికి ఈ దుస్థితి దాపురించేదే కాదు. వందమందిలో ఎవరో ఒకరైన జగన్‌కి మంచి సలహాలు ఇచ్చేవారు.
కానీ తాను మేధావినని, తాను పట్టిన ఏ కుందేలుకైనా మూడే కాళ్ళు ఉంటాయని వాదించే జగన్‌కి ఎవరి సలహాలు అవసరం లేదు.
కానీ లక్షల రూపాయల జీతాలు తీసుకుంటున్నామనే కృతజ్ఞతతో అందరూ కలిసి జగన్‌కు శల్య సారధ్యం చేసి 11 ఎమ్మెల్యేలు గెలుచుకునేలా చేశారు. అందుకు జగన్ (ఫలితాలకు ముందు రోజు) ‘ఐప్యాక్’కి కృతజ్ఞతలు తెలుపుకొన్నారు కూడా.
కానీ వైసీపి ఓటమికి తన విచిత్ర ధోరణే అని గ్రహించకుండా వారిని మెచ్చుకొని సెల్ఫీలు దిగిన తర్వాత మెడ పట్టుకొని గెంటేశారు. తన ఓటమికి వారందరినీ బలి పశువులుగా చేశారు. కనుక రేపు ఆళ్ళ మోహన్ సాయి దత్ పరిస్థితి కూడా అదే కావచ్చు. అయితే అంతవరకు సజ్జల రామకృష్ణా రెడ్డిలాగా ఆయన కూడా ఓ వెలుగు వెలగవచ్చు. ఇలా జరుగుతుందని ఆయన ముందే గ్రహిస్తే తర్వాత బాధపడాల్సిన అవసరం ఉండదు.
Imran Khan recently came into the headlines when he was detained during demonstrations organized in…
Vijay Deverakonda and Rashmika Mandanna's upcoming film Ranabaali has cleared the censor process ahead of…