Telugu

లెగసీ ఒక అవకాశం మాత్రమే… స్టార్‌డమ్ తన సృష్టి

తొలి అడుగు ‘గంగోత్రి’తో ప్రారంభం

టాలీవుడ్ మాస్ సినిమాల ఆధిపత్యంలో కొనసాగుతున్న సమయం. కొత్తదనం కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. కాలేజీ ప్రేమకథలు రాజ్యమేలుతున్న దశలో ఇంకేదో కోరుకుంటున్నారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, చిరంజీవి తరం తర్వాత కొత్త జనరేషన్‌ను ఆకట్టుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ADVERTISEMENT

అది 2003 సంవత్సరం. అల్లు రామలింగయ్య కుటుంబం నుంచి నిర్మాతగా ముద్ర వేసిన అల్లు అరవింద్ వారసత్వాన్ని నటనలో చూపించాలని రంగంలోకి దిగాడు అల్లు అర్జున్.

అశ్వినీదత్ నిర్మాణంలో, రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘గంగోత్రి’తో బన్నీ అరంగేట్రం చేశాడు. ఒక పాటలో అమ్మాయి వేషం అయినా, డాన్సులు, ఫైట్లు అయినా వెనకడుగు వేయలేదు. సీనియర్ ఆర్టిస్టుల ముందూ ధైర్యంగా నిలిచాడు.

‘గంగోత్రి’ విజయం సాధించినా, క్రెడిట్ ఎక్కువగా దర్శకుడికే దక్కింది. బన్నీ లుక్, నటనపై కామెంట్స్ వచ్చాయి. కానీ ఉలి దెబ్బలు తిన్న రాయే శిల్పంగా మారుతుంది.

యూత్‌ను ఊపేసిన ‘ఆర్య’

సుకుమార్ తీసుకొచ్చిన ‘ఆర్య’తో అల్లు అర్జున్ కెరీర్ కొత్త దిశలోకి వెళ్లింది. అప్పటివరకు సాధారణంగా కనిపించిన హీరో ఇమేజ్‌ను పూర్తిగా మార్చే ప్రయత్నంగా, వన్ సైడ్ లవ్ అనే కాన్సెప్ట్‌తో ఎవ్వరూ చూపించని క్యారెక్టరైజేషన్‌ను ఎంచుకున్నాడు. అల్లు అర్జున్ తనను తాను పూర్తిగా మార్చుకున్నాడు. స్టెప్పుల్లో గ్రేస్ పెరిగింది. నటనలో చలాకీతనం వచ్చింది. మాస్ కోసం పోరాటాల్లో తెగువ పెరిగింది.

యువతను ఆకట్టుకునే స్టయిలింగ్‌తో బన్నీ తనను తాను కొత్తగా ఆవిష్కరించాడు. ఈ మార్పు అతనికి నంది స్పెషల్ జ్యూరి అవార్డు తెచ్చి, ప్రేక్షకుల్లో ఫాలోయింగ్‌ను అమాంతం పెంచింది. తెలుగు హీరో ఇలా కూడా ఉంటాడా అనిపించేలా చేసిన ఈ మేకోవర్ బన్నీ కెరీర్‌ను మలుపుతిప్పింది.

వివి వినాయక్ తెరకెక్కించిన ‘బన్నీ’తో అల్లు అర్జున్ మాస్ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. తండ్రి ఆశయం కోసం పోరాడే యువకుడిగా అన్ని వర్గాలకూ కనెక్ట్ అయ్యాడు. ‘హ్యాపీ’ ఆశించిన ఫలితం అందుకోకపోయినా, బన్నీలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసింది.

కొత్త కోణాన్ని చూపించిన ఐకాన్ స్టార్

‘దేశముదురు’తో బన్నీ మరో కోణాన్ని చూపించాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సన్యాసిని వెనుకపడే ప్రియుడిగా అతని నటన ప్రత్యేకంగా నిలిచింది. ముఖ్యంగా సిక్స్ ప్యాక్‌తో అల్లు అర్జున్ చూపించిన ఫిజిక్ టాలీవుడ్‌లో కొత్త బెంచ్‌మార్క్‌గా మారి, తర్వాత చాలా మంది హీరోలకు ప్రేరణగా నిలిచింది.

‘వరుడు’, ‘బద్రీనాథ్’ ఆశించిన ఫలితాలు అందుకోకపోయినా, ‘వేదం’లో కేబుల్ రాజుగా అతని పెర్ఫార్మెన్స్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ‘పరుగులో’ బాధ్యతగల ప్రేమికుడిగా, ‘ఆర్య 2’లో క్లిష్టమైన క్యారెక్టర్‌లో నటన ఆ సినిమాను కల్ట్ క్లాసిక్‌గా మార్చింది.

‘జులాయి’లో బన్నీ విశ్వరూపం

‘జులాయి’తో బన్నీ కొత్త స్థాయిలో మెరిశాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఇంటెలిజెంట్ యువకుడిగా ఇంటర్నేషనల్ మాఫియా కేసును ఛేదించే రవీంద్ర నారాయణ్ పాత్రలో అల్లు అర్జున్ నటనకు టెర్రిఫిక్ అనే మాట చిన్నదే. ముఖ్యంగా ఇంటర్వెల్, క్లైమాక్స్, సోనూ సూద్‌తో పోరాట సన్నివేశాలు మాస్, క్లాస్ ప్రేక్షకులందరి నుంచి ప్రశంసలు అందుకున్నాయి.

‘రేసుగుర్రం’లో లక్కీగా బన్నీ నటన పెద్దలు, పిల్లలను సమానంగా మెప్పించింది. అన్నయ్యతో చిలిపి పోటీ, విలన్లతో ఆడిపాడే రెండు షేడ్స్‌ను సమతూకంగా చూపించడం అతని ప్రత్యేకత. ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో కుటుంబ విలువలను కాపాడే విరాజ్ ఆనంద్‌గా అతను ఒక యాక్టింగ్ టెక్స్ట్‌బుక్‌లా నిలిచాడు.

గోనగన్నరెడ్డిగా మెప్పించిన బన్నీ

‘రుద్రమదేవి’లో గోనగన్నరెడ్డి పాత్రలో అల్లు అర్జున్ పలికించిన తెలంగాణ యాస ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తక్కువ స్క్రీన్ టైమ్ ఉన్నప్పటికీ, అతని ఎంట్రీ, డైలాగ్ డెలివరీ థియేటర్లలో గూస్ బంప్స్ తెప్పించాయి. టైటిల్ రోల్ అనుష్కదైనా, కలెక్షన్లలో బన్నీ పాత్ర కీలకంగా నిలిచింది.

బాక్సాఫీస్‌కు నిజమైన ‘సరైనోడు’

‘సరైనోడు’తో బన్నీ మాస్ స్టామినాను మరో స్థాయిలో చూపించాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా వంద కోట్ల వసూళ్లతో రికార్డులు సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద తన రేంజ్ ఏమిటో స్పష్టంగా చూపించింది. ‘డీజే దువ్వాడ జగన్నాథం’లో బ్రాహ్మణ వంటవాడిగా చూపించిన వేరియేషన్ మరో హైలైట్.

‘అల వైకుంఠపురంలో’ రికార్డు రైడ్

‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’తో కొత్త దర్శకులకు అవకాశం ఇచ్చే బన్నీ ధైర్యం కనిపించింది. ఫలితం ఎలా ఉన్నా ఆర్మీ ఆఫీసర్‌గా అతని నటన ప్రశంసలు అందుకుంది.

‘అల వైకుంఠపురములో’ కుటుంబ కథగా రికార్డులను తిరగరాసింది. ‘బుట్టబొమ్మ’, ‘రాములో రాములో’ పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.

‘పుష్ప’తో బన్నీ పాన్ ఇండియా ప్రస్థానం…కొత్త చరిత్ర రాసింది

ఇది కేవలం సినిమా కాదు… బన్నీ రేంజ్ మార్చిన మలుపు. ‘పుష్ప’లో స్మగ్లర్ పాత్రను అల్లు అర్జున్ జీవించిన తీరు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సుకుమార్ విజన్‌ను మరింత ఎత్తుకు తీసుకెళ్లిన అతని నటన కొత్త చరిత్ర రాసింది. ‘తగ్గేదేలే’ మ్యానరిజమ్ ప్రపంచవ్యాప్తంగా అనేక మంది అనుకరించే స్థాయికి చేరింది. ‘పుష్ప 2’ భారీ వసూళ్లతో అరుదైన రికార్డులు సొంతం చేసుకుంది.అవార్డులకే చిరునామా, వసూళ్లు మాత్రమే కాదు… గౌరవాలు కూడా వెంటపడ్డాయి.

అల్లు అర్జున్ ప్రయాణం కేవలం నటుడిగా కాదు… తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే దిశగా సాగుతోంది. ఉత్తమ జాతీయ నటుడి అవార్డును సాధించడం అతని కృషికి నిదర్శనం. ఫిలింఫేర్, నంది, జాతీయ, గద్దర్ అవార్డులు సహా ఎన్నో పురస్కారాలు అతని ఖాతాలో ఉన్నాయి.

అల్లు సినిమాస్ ద్వారా ప్రేక్షకులకు కొత్త అనుభవాన్ని అందించే ప్రయత్నం కొనసాగుతోంది. పసి వయసు నుంచి ప్యాన్ ఇండియా స్థాయికి

బాలనటుడిగా మొదలైన ఈ ప్రయాణం నేడు ఐకాన్ స్టార్ స్థాయికి చేరుకుంది. కేరళలో ‘మల్లుస్టార్’గా ప్రత్యేక అభిమానాన్ని సంపాదించుకోవడం అతని ప్రత్యేకత. అక్కడి ప్రేక్షకులు అతని సినిమాలను పండుగలా జరుపుకోవడం అరుదైన విషయం.

అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్

పాన్ ఇండియా స్థాయిని దాటిన బన్నీ ఇప్పుడు గ్లోబల్ దిశగా అడుగులు వేస్తున్నాడు. అల్లు అర్జున్ – అట్లీ కలయిక అంతర్జాతీయ స్థాయిలో కొత్త ప్రమాణాలకు నాంది పలుకుతోంది. భారీ విజువల్, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో కొత్త రికార్డులను సృష్టించే లక్ష్యంతో ఈ కాంబినేషన్ ముందుకు సాగుతోంది.

రియాలిటీకి దగ్గరగా ఉండటం బన్నీ స్వభావం. ఇమిటేషన్లకు దూరంగా, హీరోయిజం కంటెంట్‌లోనే ఉండాలని నమ్మడం అతని సిద్ధాంతం. ఎదిగేకొద్దీ ఒదగడమే నిజమైన ఎదుగుదల అని విశ్వసించడం అతని వ్యక్తిత్వం. మంచిని చెప్పడం కాదు, అభిమానుల ద్వారా చేయించడం అతని సేవాగుణం.

లెగసీ అందరికీ వస్తుంది… కానీ దాన్ని నిలబెట్టేది కొందరే. అందుకే అల్లు అర్జున్ కేవలం స్టయిలిష్ స్టార్ కాదు… టాలీవుడ్ రేంజ్ మార్చే ఐకాన్ స్టార్.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

AK47 Postponed: Naga Vamsi’s Deadline Drama Backfires

Venkatesh-Trivikram’s Aadarsha Kutumbam AK 47 will miss its October 9 release. Producer Naga Vamsi confirmed…

17 minutes ago

వైసీపీ ‘కోర్టు’లలో యుద్ధం చేస్తుందా.?

స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో వైసీపీ క్యాడర్, లీడర్ అందరు ఎలర్ట్ గా ఉండాలని, ఏకగ్రీవాలకు ఎట్టి పరిస్థితులలోను ఆస్కారం…

28 minutes ago