
పూర్తి స్థాయిలో ఇంకా తెలుగు నాట బుకింగ్స్ ఓపెన్ అవ్వలేదు గానీ, ఇప్పటివరకు బుకింగ్స్ ఓపెన్ చేసిన ప్రతి చోట హౌస్ ఫుల్స్ తో “పుష్ప” అల్లాడిస్తోంది. అలాగే యుఎస్ మార్కెట్ లో కూడా ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలోనే ఉన్నాయి. ఇక ఇతర భాషల విషయానికి వస్తే మలయాళంలో ఎలాగూ బన్నీ సూపర్ స్టార్ కాబట్టి, ఖచ్చితంగా భారీ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంటుందనే టాక్ బలంగా వినపడుతోంది.
తమిళ, కన్నడలలో కూడా బన్నీకి మార్కెట్ ఉంది, అలాగే మాస్ సినిమాలను ఆదరించడంలో తమిళ ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారు కాబట్టి, ఈ రెండు ఏరియాలలో కూడా బన్నీ స్థాయికి తగ్గ ఆదరణే లభిస్తుందన్న అంచనాలు ఏర్పడ్డాయి. కానీ పాన్ ఇండియా మూవీ అంటే, హిందీ మార్కెట్ అత్యంత కీలకం. ఇక్కడ నెగ్గిన వారే పాన్ ఇండియా స్టార్ గా అవతరిస్తారు.
కానీ సరిగ్గా ఈ మార్కెట్ లోనే “పుష్ప” ఎలాంటి ప్రభావం చూపలేకపోతోంది. హిందీలో సినిమాను సరిగా ప్రమోట్ చేయకపోవడం ప్రధాన కారణం. ఇందుకు దర్శకుడిగా సుకుమార్ ని మరియు ప్రొడ్యూసర్స్ గా మైత్రీ మూవీ మేకర్స్ ను నిందించక తప్పనిసరి. హిందీ ఓపెనింగ్స్ ఎలా ఉండబోతున్నాయో బహుశా ‘పుష్ప’ టీమ్ సరిగా అంచనా వేయలేదని తాజాగా వస్తోన్న ఫిగర్స్ చెప్తున్నాయి.
ప్రముఖ బాలీవుడ్ సినీ విశ్లేషకుడు సుమిత్ కడేల్ ప్రకారం ‘పుష్ప’ హిందీ ఓపెనింగ్స్ 50 లక్షల నుండి 1.50 కోట్ల వరకు ఉంటాయని అంచనా వేస్తున్నారు. 16వ తేదీన విడుదల కాబోతోన్న హాలీవుడ్ “స్పైడర్ మ్యాన్” సినిమా ప్రభావం హిందీలో ఎక్కువగా ఉన్నందున, ‘పుష్ప’ ఓపెనింగ్స్ దారుణంగా ఉంటాయనేది సుమిత్ అంచనా.
ఒకవేళ ఇదే నిజమైతే ‘పుష్ప’గా పాన్ ఇండియా స్థాయిలో ఖ్యాతి తెచ్చుకోవాలనుకున్న అల్లు అర్జున్ ఆశలు అడియాశలు అయినట్లే. విడుదలకు ఇంకా నిండా మూడు రోజుల సమయం కూడా లేకపోగా, చిత్ర యూనిట్ మాత్రం ఇప్పటికీ కళ్ళు తెరవకుండా, ప్రమోషన్స్ విషయంలో నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం బన్నీ అభిమానులను కలచివేస్తోంది.
ఒక్క హిందీలోనే కాదు, ఏ భాషలో కూడా “పుష్ప” ప్రమోషన్స్ పాన్ ఇండియా మూవీ స్థాయిలో లేవు. తెలుగు నాట మొక్కుబడిగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ వలన పెద్దగా ఒరిగింది కూడా ఏం లేదు. అయితే స్టార్ హీరోగా తెలుగు, తమిళ, కన్నడ, మళయాలంలో బన్నీకి గుర్తింపు ఉండడంతో ఓపెనింగ్స్ గురించి ఆలోచించాల్సిన పనిలేదు. హిందీలో మాత్రం పరిస్థితి ఇందుకు పూర్తి విరుద్ధం.
The pre-release event of Ramayana was held in Hyderabad, where a large crowd gathered for…
Nani and OG director Sujeeth have teamed up for Bloody Romeo, a stylish action film…