
దశాబ్ధాల కాలంలో హైదరాబాద్ నగరం క్రమంగా అభివృధ్ది చెంది నేడు ఈ స్థాయికి చేరుకుంది. కనుక నేటి జనాభా, ఇంకా పెరగబోయే జనాభా, వాహనాలు, త్రాగునీరు, విద్యుత్ వంటి అవసరాలకు తగినట్లుగా ముందుగా ప్లాన్ చేసుకోవడం సాధ్యపడలేదు. అందువల్లే నేటికీ హైదరాబాద్ నగరంలో కొత్తగా ఫ్లై ఓవర్లు, హాస్పిటల్స్, రిజర్వాయర్స్, రైల్వే స్టేషన్లు, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లు, బహుళ అంతస్తుల భవనాలు వగైరా నిర్మిస్తూనే ఉన్నారు.
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకపోవడం చాలా బాధ కలిగించినప్పటికీ, అదే ఇప్పుడు రాష్ట్రానికి గొప్ప వరంగా మారబోతోంది.
భూమిని చదును చేయడం నుంచి అమరావతిని కొత్తగా నిర్మిస్తుండటంతో భవిష్యత్ జనాభా, వాహనాలు, విద్యుత్, నీళ్ళు వంటివన్నీ దృష్టిలో పెట్టుకొని, చాలా ప్రణాళికాబద్దంగా నిర్మించుకునే అవకాశం కలిగింది. అత్యాధునిక టెక్నాలజీ, భవన నిర్మాణ రంగంలో పెను మార్పులు కూడా వచ్చినందున దేశంలోనే అత్యంత నివాస యోగ్యమైన, అత్యంత ఆధునికమైన హంగులు, సదుపాయాలు కలిగిన నగరంగా అమరావతి ఆవిర్భవించబోతోంది.
అమరావతిలో 40 అంతస్తుల 5 ఐకానిక్ టవర్లు, అనేక బహుళ అంతస్తుల భవనాలు, హైకోర్టు, శాసనసభ, ప్రభుత్వ కార్యాలయాలు, అధికారులు, ఉద్యోగుల నివాస కాలనీలు నిర్మించబోతున్నారు.
అమరావతి ప్రీ-ప్లాన్డ్ సిటీ కనుక నగరంలో విశాలమైన రోడ్లు, అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్లు, ఎక్కడికక్కడ పార్కులు, పచ్చదనం ఉండేలా నిర్మించబోతున్నారు.
భవిష్యత్ విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని సోలార్ విద్యుత్ ఉత్పత్తి కొరకు అమరావతిలో కొత్తగా నిర్మించే ప్రతీ భవనంపై సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేయబోతున్నారు.
అమరావతిలో ప్రభుత్వ, ప్రైవేట్ యూనివర్సిటీలు, ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, ఐటి కంపెనీలు వంటివి అనేకం రాబోతున్నాయి. అలాగే రైల్, మెట్రో రైల్, రోడ్, ఎయిర్ కనెక్టివిటీతో నగరాన్ని నిర్మించబోతున్నారు. ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్ వంటి మహా నగరాలలో ఇవన్నీ ఏర్పడేందుకు దశబ్ధాలు పడితే అమరావతిలో ఇవన్నీ ఒకేసారి ఏర్పడబోతున్నాయి.
అదే.. జగన్ చెప్పినట్లు విశాఖలో రాజధానిగా చేయాలనుకుంటే, అప్పుడు హైదరాబాద్‌లో మాదిరిగానే ఎక్కడ ఖాళీ ప్రదేశం ఉంటే అక్కడ, ఎప్పుడు ఏది అవసరమైతే అది నిర్మించుకోవలసిందే. అడ్డుగా ఉన్నవి కూల్చుకోవలసిందే.
ఉదాహరణకు హైదరాబాద్ పాతబస్తీ గుండా మెట్రో కారిడార్ ఏర్పాటు చేయడానికి అనేక నిర్మాణాలు కూల్చివేయవలసి వస్తోంది. కానీ అమరావతిలో ప్రతీదీ ముందుగానే ప్లాన్ చేసుకొని నిర్మిస్తున్నందున అటువంటి అవసరమే ఉండదు. పైగా ప్రతీదీ చాలా సౌకర్యవంతంగా నిర్మించుకోవచ్చు.
మే 2న ప్రధాని మోడీ అమరావతి నిర్మాణ పనులను ప్రారంభిస్తారు. మూడేళ్ళలో నిర్మాణ పనులు పూర్తి చేసి అమరావతికి రూపు రేఖలు తీసుకురావాలని సిఎం చంద్రబాబు నాయుడు గడువు విధించడంతో వచ్చే ఎన్నికల నాటికి దేశంలోనే అన్ని హంగులతో, అత్యాధునిక సదుపాయాలతో, అత్యంత నివాస యోగ్యమైన నగరంగా అమరావతి సాక్షాత్కరించబోతోంది. అప్పుడు అమరావతి మా రాజధాని అని ప్రతీ ఆంధ్రుడు గర్వంగా చెప్పుకోగలుగుతారు.
Vijay’s son Jason Sanjay chose to make his entry into films as a director rather…
A little over two years after the previous Assembly elections, Andhra Pradesh is preparing for…