
రాజధాని లేని అనాధ రాష్ట్రంగా బయటకొచ్చిన ఆంధ్రప్రదేశ్ కి మేమున్నాం అంటూ రాజధాని నిర్మాణం కోసం తమ సొంత భూములను త్యాగం చేసేందుకు ముందుకొచ్చారు అమరావతి రైతులు, వారి కుటుంబాలు.
తాతముత్తాల నుంచి వారసత్వంగా వచ్చిన భూములను, తమ సొంత కష్టార్జితంతో కూడబెట్టుకున్న ఆస్తులను, తమ భవిష్యత్ తరానికి భరోసా కల్పించే సొత్తును ఒక ప్రభుత్వాన్ని నమ్మి ముఖ్యంగా ఒక వ్యక్తి విజనరిని విశ్వసించి సుమారు 33 వేల ఎకరాల పంట భూములను స్వచ్ఛందంగా ప్రభుత్వానికి అప్పగించారు.
అయితే ఆ నమ్మకమే ఇప్పుడు వారికి శాపంగా మారిందా.? ఆ త్యాగమే వారి కుటుంబాలను బలిపీఠం ఎక్కించిందా.? అంటే అవుననే అంటున్నారు రాజధానికి భూములిచ్చిన రైతులు. 2015 రాజధాని ప్రకటనతో అమరావతి రైతుల జీవితాలలో మొదలైన ఆ ప్రకంపనలు నేటికీ వారిని ప్రశాంతంగా జీవించనివ్వడం లేదు.
నాడు ఒక ప్రభుత్వాన్ని నమ్మి భూములిచ్చిన రైతులకు తిరిగి టీడీపీ, వైసీపీ ప్రభుత్వాల నుంచి అందిన సాయం…ఇప్పటికి ఆ భూములకు తగ్గ పరిహారం కోసం అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరగడం, మా త్యాగాన్ని గుర్తించండి, మాకు ఇస్తానన్న భూములను తిరిగి అప్పగించండి అంటూ ప్రభుత్వాల చుట్టూ వినతి పత్రాలతో మోకరిల్లడం.
ఇదేనా వారి త్యాగాలకు ప్రభుత్వాలు ఇచ్చే గౌరవం, మర్యాద.? నాడు టీడీపీ ప్రభుత్వం మాచేతిలో అధికారం చేజారింది అంటూ తప్పుకుంది, ఇక అధికారంలోకి వచ్చిన వైసీపీ మా చేతిలోకి అధికారం వచ్చింది అనే అహంకారం తో తిప్పలు పెట్టింది. నాడు వైసీపీ అవమానపరిస్తే నేడు టీడీపీ కూటమి అలసత్వం చూపిస్తుందా.?
తిరిగి అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి రాజధాని పనులను అయితే వేగవంతం చేసింది కానీ వారి సమస్యలకు పరిష్కారం మాత్రం చూపలేకపోతుంది. వారి భయాలకు భరోసా అందించలేకపోతుంది. సీఆర్డీఏ అధికారులు తమ రోదన పట్టించుకోవడం లేదు మహా ప్రభో అంటూ అమరావతి రైతులు ప్రభుత్వానికి తమ గోడు వినిపిస్తున్నారు.
దీనితో వారికి న్యాయం చెయ్యాల్సిన అవసరం, ఆవశ్యకత కూటమి ప్రభుత్వం మీద పడింది. ఇప్పటికే ప్రభుత్వానికి భూములిచ్చి దశాబ్దం గడిచింది. అయినా ప్రభుత్వం నుంచి తిరిగి రావాల్సిన భూ కేటాయింపు మాత్రం ఇప్పటికి జరగలేదని, దాని ఫలితంగా మా కుటుంబాలు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందనేది వారి ఆవేదన.
అలాగే ఈ సారి కూడా టీడీపీ ప్రభుత్వం తమకు న్యాయం చేయలేకపోతే రేపటి రోజున వైసీపీ అధికారంలోకి వస్తే అన్న ఊహే వారి వెన్నులో వణుకు తెప్పిస్తుంది. కాబట్టి కూటమి ప్రభుత్వం రాజధాని నిర్మాణం మీద పెట్టిన శ్రద్దే ఆ నిర్మాణానికి భూములిచ్చిన రైతు కుటుంబాల మీద కూడా ఉంచాలని వారి హయాంలోనే ఆయా కుటుంబాల త్యాగాలను తగిన న్యాయం చెయ్యాలనే డిమాండ్ వినపడుతుంది.
లేకపోతే నాడు వైసీపీ కక్ష్య సాధిస్తే, నేడు టీడీపీ కూటమి కాపు కాయడం లేదు అనే అపవాదును ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే రానున్న రోజులలో ఒక ప్రభుత్వం ను నమ్మి భూములివ్వడం అంటే తమ గొయ్యి తాము తీసుకున్నట్టే అనే భావన సర్వత్రా బలపడిపోతుంది.
Aniesh made a good impression with his performance in the songs and teaser of Itllu…
Tom Cruise can still make audiences run to theatres, but it seems they need a…