
ACB investigation into the Andhra Pradesh liquor scam
ఏపీ మద్యం కుంభకోణం కేసు విచారణ జరుగుతున్న తీరు, సిఎం చంద్రబాబు నాయుడుతో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపి నేతలు అందరూ దానికి దూరంగా ఉండటం గమనిస్తే ఒకటి అర్ధమవుతుంది.
“జగన్‌ని అరెస్ట్ చేయించడానికి నాకు క్షణం పట్టదు. కానీ ప్రజలు మాకు రాజకీయ కక్షలు తీర్చుకునేందుకు అధికారం అప్పజెప్పలేదు. రాష్ట్రాన్ని పాలించేందుకు, అభివృద్ధి చేసేందుకే అప్పజెప్పారు. కనుక ఇలాంటి కేసులలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది,” అని సిఎం చంద్రబాబు నాయుడు పదేపదే చెప్తున్నారు కూడా.
కనుక కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా… టీడీపి ఈ కేసును రాజకీయంగా వాడుకోవాలని ఆరాటపడకుండా, ప్రాధమికంగా నేర నిరూపణకు అవసరమైన పూర్తి సాక్ష్యాధారాలన్నీ సేకరించిన తర్వాత, చట్టబద్దంగానే ముందుకు సాగాలని నిశ్చయించుకున్నట్లు స్పష్టమవుతోంది.
రాజకీయ కక్షతో ప్రభుత్వం దుందుడుకుగా వ్యవహరిస్తే, నాడు వైసీపీ హయంలో ‘స్కిల్ డెవలప్‌మెంట్ కేసు’ పేరుతో చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసినప్పుడు, ఆ తర్వాత ఏం జరిగిందో మళ్ళీ అలాగే జరుగవచ్చు.
కనుక ఈ కేసు విచారణ విషయంలో ఏసీబీ అధికారులకు ప్రభుత్వం పూర్తి స్వేచ్చ ఇచ్చింది. ఇది మంచి ఫలితాలు ఇస్తోంది.
మద్యం కుంభకోణం కేసుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్నవారు, జగన్ హయంలో పని చేసిన ఎక్సైజ్ శాఖ ప్రధాన కార్యదర్శిగా చేసిన రజత్ భార్గవ వంటి మాజీ ఐఏఎస్ అధికారులు ఏసీబీ కోర్టుకు హాజరవుతున్నారు.
మద్యం కుంభకోణం ఏవిధంగా జరిగిందో, దీనిలో ఎవరెవరి హస్తాలు ఉన్నాయో, ఎవరు లబ్ది పొందారో వంటి పూర్తి వివరాలతో కూడిన వాంగ్మూలాలు ఇస్తున్నారు.
ఈ కేసులో కర్త, కర్మ, క్రియ అన్నీ మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డేనని, నాటి సీఎంవోలో ఉన్నతాధికారులు, తాడేపల్లి ప్యాలస్‌లోని వైసీపీ ముఖ్య నేతల ఆదేశాల ప్రకారమే ఈ వ్యవహారమంతా జరిగేదని రజత్ భార్గవ చెప్పినట్లు తెలుస్తోంది.
కనుక ఏసీబీ అధికారులు ఈ కేసులో త్వరలో జగన్మోహన్ రెడ్డికి నోటీసులు పంపే అవకాశం కనిపిస్తోంది. దీనిని వైసీపీ రాజకీయంగా, న్యాయపరంగా ఏవిధంగా హ్యాండిల్ చేస్తుందో ఊహించవచ్చు.
కానీ ఈ కేసుపై ఇంత కాలం.. ఇంత లోతుగా విచారణ జరిపిన ఏసీబీ అధికారులు ఈ కేసుని ఏవిధంగా హ్యాండిల్ చేస్తారనేదే కీలకం.
Telangana politics is set for an important development today as Chief Minister Revanth Reddy visits…
As far as Telugu cinema is concerned, 2026 is slowly coming to an end. And…