
Andhra Local Body Elections and Political Tensions
స్థానిక సంస్థల ఎన్నికలంటే అధికార, ప్రతిపక్ష పార్టీలకు, పోటీ చేస్తున్న అభ్యర్ధులకే పరిమితం అనుకునే రోజులు కావివి. ఈ చెత్త రాజకీయాలు మాకొద్దని దూరంగా ఉండేవారికి కూడా ఈ ఎన్నికలు పరీక్ష పెడుతున్నాయి.
ఏవిధంగా అంటే, ఇప్పటికే కులాల వారీగా విడిపోయిన ప్రజలు, ఈ రాజకీయ పార్టీల పుణ్యమాని మరిన్ని వర్గాలుగా విడిపోయారు. కనుక ప్రజల ప్రమేయం లేకుండానే వారు ఏదో ఓ వర్గంలో పడతారు.
రాజకీయాలంటే రోత అనుకునే అలాంటివారు సైతం తమ బంధుమిత్రులు కలిసినప్పుడు మాట్లాడుకుంటునప్పుడు తప్పకుండా వారి మద్య రాజకీయాలపై చర్చ జరుగుతుంది. దాంతో వారి మధ్య మినీ యుద్ధాలు జరుగుతుంటాయి.
కనుక బంధుమిత్రులు కలిసినప్పుడు ‘రాజకీయాలు మాట్లాడరాదు’ అని అందరూ నిబంధన విధించుకోవడం చాలా అవసరం.
ఇప్పుడు పార్టీల విషయానికి వస్తే, కూటమిలో సీట్ల సర్దుబాట్లే మూడు పార్టీలకు పెద్ద తలనొప్పిగా మారాయనుకుంటే, వాటితో తీవ్ర అసంతృప్తి చెందిన టీడీపి, జనసేన నాయకులు, కార్యకర్తలు తిరుగుబాటు అభ్యర్థులుగా నామినేషన్లు వేస్తున్నారు.
తమ పార్టీలలోకి వచ్చి తమ సీట్లు, తమ కష్టం ఎత్తుకుపోతున్న నాయకులపై వారు నిప్పులు చెరుగుతున్నారు. అలాంటి ప్యారాచూట్ నాయకులకు సహకరించే ప్రసక్తే లేదని తేల్చి చెపుతున్నారు.
“మేము ఎప్పటికీ జెండా కూలీలుగానే మిగిలిపోవాలా? కనీసం స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా మాకు అవకాశం ఇవ్వరా?” అని ప్రశ్నిస్తున్నారు.
ఇక వైసీపీ, టీడీపిలో కూడా అసమ్మతి రాగాలు వినిపిస్తూనే ఉన్నాయి. సీట్లు దక్కనివారు హడావుడిగా జనసేనలోకి జంప్ చేసి సీట్లు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
మరికొంత మంది నాయకులు పార్టీ మారలేక అలాగని పార్టీ నిర్ణయాన్ని అంగీకరించలేక “మాకు అన్యాయం జరిగిందంటూ” అనుచరుల ముందు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. కొందరు ఈ ఎన్నికలకు దూరంగా ఉండిపోతామని ఎలా గెలిపించుకుంటారో గెలిపించుకోమంటున్నారు.
ఇక వైసీపీలో కొంత మంది నాయకులకు అధిష్టానం సీట్లు ఇవ్వజూపినా, ఈ ఎన్నికలలో పోటీ చేసేందుకు మా దగ్గర డబ్బు లేదని చెప్పి తప్పించుకున్నట్లు సమాచారం.
ఇప్పుడు పట్టణ, గ్రామీణ ఓటర్ల విషయానికి వస్తే, ‘నువ్వు ఫలానా పార్టీ వాడివి.. మా పార్టీలోకి ఎందుకు వచ్చావు? నీలాంటి వాళ్ళకు ఓట్లు వేసే ప్రసక్తే లేదని’ కొందరు మొహం మీదే చెప్పేస్తుంటే, మరికొందరు “మా కులపోళ్ళ మనోభావాలు దెబ్బ తీశారు కనుక ఈ ఎన్నికలలో మీ పార్టీని దెబ్బ తీస్తామని’ బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు.
చివరాఖరుగా పోలీసులు, ఎన్నికల సంఘం గురించి రెండు ముక్కలు చెప్పుకోవడం ధర్మం. వారి పరిస్థితి ‘కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం’ అన్నట్లు మారింది. కనుక అధికార, ప్రతిపక్షాల మధ్య జరుగుతున్న భీకర యుద్ధాలకు వారే ప్రత్యక్ష ప్రేక్షకులుగా మిగిలిపోతున్నారు.
కనుక ఈ స్థానిక పరీక్షలలో రాష్ట్రంలో ఎవరికీ మినహాయింపు లేదు. మన ఇష్టాయిష్టాలతో సంబంధం లేదు. అందరూ ఈ పరీక్షలు ఎదుర్కోవాల్సిందే.
Ranabaali has been facing criticism over its background score since its release. Starring Vijay Deverakonda…
The family entertainer January 12 Vidudala features Victory Venkatesh and Nandamuri Kalyan Ram, with Keerthy…