
AP Local Body Elections: Supreme Court Rejects 34% BC Quota Plea
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలను హైకోర్టు రద్దు చేయడంతో హైకోర్టు తీర్పుని సుప్రీంకోర్టులో సవాలు చేసింది. కానీ సుప్రీంకోర్టులో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్ధిస్తూ ప్రభుత్వ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.
బీసీ రిజర్వేషన్ల విషయంలో హైకోర్టు, సుప్రీంకోర్టులు గతంలో కూడా ఈవిధంగానే స్పందించాయి. కనుక ఇప్పుడూ అలాగే స్పందిస్తాయని అందరూ ఊహించిందే. కానీ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు వరకు వెళ్ళి కాదనిపించుకుంది. అయితే ఆరు వారాల్లోగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మొదలుపెట్టాలని హైకోర్టు అప్పుడే గడువు విధించింది.
కనుక అందుకోసం కూటమి ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం అప్పుడే సన్నాహాలు మొదలుపెట్టాయి. త్వరలో రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికల సంఘానికి తెలియజేస్తే ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటిస్తుంది.
ఇప్పటికే కూటమిలో మూడు పార్టీలు సీట్ల పంపకాల గురించి పలుమార్లు సమావేశమయ్యి ఓ మాట అనుకున్నాయి. కనుక మరోసారి సమావేశమయ్యి ‘మమ’ అనేసుకొని అభ్యర్ధులను ప్రకటించేసుకోవచ్చు.
ఆ తర్వాత ఎలాగూ కాస్త సిగపట్లు తప్పవు. కానీ మెజార్టీ స్థానాలు గెలుచుకోగలిగితే అది వాటి సఖ్యతకు, బలానికి నిదర్శనంగా నిలుస్తుంది.
వైసీపీ విషయానికి వస్తే, ‘సిఎం చంద్రబాబు నాయుడు ఎలాగూ ఈ ఎన్నికలను నిష్పక్షపాతంగా జరగనివ్వడు… కనుక మనం ఎలాగూ గెలవలేమని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముందే చెప్పేశారు.
అలాగే ‘ఇలా కళ్ళు మూసుకుంటే అలా గిర్రున మూడేళ్ళు గడిచిపోతాయని’ కూడా పదేపదే చెపుతున్నారు. కనుక ఓడిపోబోయే ఎన్నికలలో పోటీ చేసి డబ్బు, పరువు పోగొట్టుకోవడం దేనికని అనుకుంటే 2029 ఎన్నికల వరకు వైసీపీ శ్రేణులు కళ్ళు మూసుకొని కూర్చోవచ్చు. అదే జరిగితే కూటమి పార్టీలకు ఈ ఎన్నికలలో పెద్దగా పోటీ ఉండకపోవచ్చు.
పంచాయితీ ఎన్నికలను ఒక విడతలో, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను రెండు విడతలలో నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తున్నట్లు సమాచారం.
Sharwa is coming up with the rural period action drama Bhogi. Directed by Sampath Nandi…
Katrina Kaif is in a new phase of life after becoming a mother, but her…