
Andhra Pradesh Needs Odisha-Like Cyclone Management System
అర్నాబ్, మురుసు తుఫానుల దెబ్బల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంకా కోలుకోకముందే ఇప్పుడు ‘అక్వాన్’ తుఫాన్ రాష్ట్రంపై విరుచుకుపడబోతోంది.
ఇది క్రమంగా బలపడుతూ గురువారం నెల్లూరు-విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ, విశాఖపట్నం జిల్లాలపై తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. రాయలసీమలో కూడా గురు, శుక్రవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్‌కు తుఫాన్లు కొత్తేమీ కాదు. అలాగే ఇప్పుడు తుఫాన్లు, భారీ వర్షాలు, పిడుగుల గురించి ముందుగానే సమాచారం లభిస్తోంది.
దీంతో ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేసుకొని ప్రాణనష్టాన్ని తగ్గించగలుగుతోంది. అయితే పంట నష్టం, ఆస్తి నష్టాన్ని పూర్తిగా నివారించడం మాత్రం ప్రభుత్వం చేతిలో లేదు. అందుకే తుఫాన్ తర్వాత వెంటనే సహాయక చర్యలు చేపట్టి, నష్టపరిహారం ప్రకటిస్తుంటుంది.
అయితే ఎన్ని చర్యలు చేపట్టినా తుఫాన్ల వల్ల రైతులు, మత్స్యకారులు, తీరప్రాంత ప్రజలకు కలిగే కష్టనష్టాలను కొంత వరకు తగ్గించగలుగుతోంది తప్ప పూర్తిగా నివారించలేకపోతోంది. ముఖ్యంగా ఈ విధంగా ఒకదాని తర్వాత మరొక తుఫాన్ విరుచుకుపడుతున్నప్పుడు వారి సమస్యల తీవ్రత మరింత పెరిగిపోతోంది.
తుఫానులను ఎదుర్కోవడం కోసం ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ ప్రత్యేకంగా ఒక శాశ్వత వ్యవస్థను ఏర్పాటు చేశారు. 1999లో సూపర్ సైక్లోన్ తీవ్ర విధ్వంసం సృష్టించిన తర్వాత, అదే ఏడాది డిసెంబర్ 28న నవీన్ పట్నాయక్ ప్రభుత్వం ‘ఒడిశా స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ’ అనే స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేసింది. ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడానికి దేశంలోనే తొలిసారిగా ఏర్పాటైన ప్రత్యేక విపత్తు నిర్వహణ సంస్థల్లో ఇది ఒకటి.
ఈ సంస్థ కేవలం తుఫాన్లు వచ్చినప్పుడు సహాయక చర్యలకే పరిమితం కాకుండా, ముందస్తు హెచ్చరికలు, ప్రజలకు సమాచారం చేరవేయడం, విపత్తుల నివారణ, నష్టాన్ని తగ్గించే చర్యలు, పునరావాసం, పునర్నిర్మాణం వంటి బాధ్యతలు కూడా నిర్వహిస్తుంది. దీనిలో రాష్ట్ర, జిల్లా, బ్లాక్ స్థాయిల్లో సమాచార వ్యవస్థలను ఏర్పాటు చేసి, తీరప్రాంత ప్రజలకు హెచ్చరికలు చేరేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
ఇది తుఫానులకు ముందు, తర్వాత ముఖ్యమంత్రి లేదా ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురుచూడకుండా అవసరమైన చర్యలు చేపడుతుంటుంది. అలాగే తుఫానులను సమర్థంగా ఎదుర్కోవడానికి అవసరమైన శాశ్వత పరిష్కారాలపై కూడా దృష్టి పెడుతుంది. తీరప్రాంతాల్లో రక్షణ వ్యవస్థలను బలోపేతం చేయడం, లోతట్టు ప్రాంతాలను గుర్తించి అక్కడ డ్రైనేజీ వ్యవస్థలను మెరుగుపరచడం వంటి చర్యలు చేపడుతుంది.
తరచూ తుఫానుల తాకిడికి గురవుతున్న ఆంధ్రప్రదేశ్‌లో కూడా అటువంటి స్వతంత్ర, శాశ్వత వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం మంచిది. ఇలాంటి వ్యవస్థ నిరంతరాయంగా పని చేస్తుంటే ప్రకృతి విపత్తులను సమర్థంగా ఎదుర్కోవడంతో పాటు ప్రభుత్వంపై కూడా ఒత్తిడి తగ్గుతుంది కదా?
Some of the biggest banks in the world faced temporary disruptions yesterday as the United…
Relationship rumours surrounding Tharun Bhascker and Eesha Rebba have been doing the rounds for quite…