
ఏపీ ప్రభుత్వం సరికొత్త ప్రయోగం చేయబోతోంది. రాష్ట్రంలో ఎంపిక చేసిన జిల్లాలలో 15 ‘లేబర్ అడ్డా’లు ఏర్పాటు చేయబోతున్నట్లు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు.
వీటిలో భవన నిర్మాణ రంగంలో శిక్షణ పొంది ఆధునిక పరికరాలు కలిగిన కార్మికులు ఉంటారు. ప్రభుత్వమే వారికి తగిన శిక్షణ ఇప్పిస్తుంది.
నిర్మాణ రంగంలో పని చేసే మేస్త్రిలు, కూలీలు ప్రతీరోజూ ఉదయం క్యారేజీలు పట్టుకొని తమ పరికరాలతో రోడ్లపై ఎండకి ఎండుతూ, వానకు తడుస్తూ నిలబడి తమకు ఆ రోజుకి పని ఇచ్చేవారి కోసం ఎదురుచూపులు చూస్తుంటారు.
ఇకపై వారు అలా రోడ్లపై నిలబడాల్సిన అవసరం లేకుండా విశ్రాంతి గదులు, మరుగు దొడ్లు, త్రాగునీరు వగైరా సదుపాయాలు కలిగిన లేబర్ అడ్డాలు (భవనాలు) ప్రభుత్వం నిర్మించబోతోందని మంత్రి సుభాష్ చెప్పారు.
ఈ ప్రయోగం విజయవంతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ నియోజకవర్గానికి ఒక లేబర్ అడ్డా నిర్మిస్తామని మంత్రి సుభాష్ చెప్పారు.
ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం కబుర్లు చెపుతూ కాలక్షేపం చేయకుండా, వారి కోసం ఇటువంటి ప్రతిపాదన సిద్దం చేయడం చాలా అభినందనీయం. అయితే కార్మికులకు శిక్షణ, పనిముట్లు ఇచ్చి భవనాలు నిర్మిస్తే సరిపోదు.
రాష్ట్రంలో రైతు బజార్లు, 108, అన్నా క్యాంటీన్లు వంటివి సమర్ధంగా పనిచేస్తున్నాయంటే వాటి నిర్వహణకు పటిష్టమైన యంత్రాంగం ఏర్పాటు చేసినందునే.
కనుక ‘లేబర్ అడ్డా’ల నిర్వహణకు కూడా అటువంటి పటిష్టమైన వ్యవస్థ ఏర్పాటు చేసినప్పుడే ఈ ప్రయోగం విజయవంతం అవుతుంది. లేకుంటే ‘లేబర్ అడ్డా’లు అసాంఘిక కార్యక్రమాలకు నిలయాలుగా మారుతాయి.
అలాగే కార్మికుల శిక్షణకు, వారికి ప్రభుత్వం ఇవ్వబోయే పనిముట్లు విషయంలో కూడా పటిష్టమైన పర్యవేక్షణ చాలా అవసరం. లేకుంటే అవినీతి ఏరులైపారుతుంది.
చివరిగా ఒక సూచన: ఇంగ్లీషు, హిందీ పదాలు కలిపి ‘లేబర్ అడ్డా’ అనే పేరు చాలా ఎబ్బెట్టుగా ఉంది. అదేదో రౌడీలు, తాగుబోతుల అడ్డా అన్నట్లుంది.
కనుక చక్కటి తెలుగు పేరు పెడితే బాగుంటుంది. రైతు బజార్లు, అన్నా క్యాంటీన్లు మాదిరిగా ఈ ప్రయోగం కూడా విజయవంతంగా నిర్వహిస్తే దేశంలో అన్ని రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలుస్తుంది.
Venkatesh-Trivikram’s Aadarsha Kutumbam AK 47 was expected to arrive on October 9 after missing its…
Sanjay Dutt faced severe criticism after a recent appearance on Shekhar Suman’s show. His comments…