
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్న సోషల్ మీడియాలో దుష్ప్రచారాలను, అనుచిత వ్యాఖ్యలను కట్టడి చేసేందుకు ఏపీ డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ తన కార్యాలయంలో ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే.
ఈరోజు సిఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై చాలా లోతుగా చర్చించారు. సోషల్ మీడియాలో పెట్రేగిపోతున్నవారిని కట్టడి చేసేందుకు పోలీస్ శాఖ ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని సిఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ సమావేశంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు ఏవిధంగా ఉండాలనేది వివరించడం విశేషం.
దేశంలో దాదాపు ప్రతీ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు ‘సోషల్ మీడియా వారియర్స్’ ఏర్పాటు చేసుకుంటున్నాయి. వారియర్స్ అని ముందే చెప్తున్నాయి కనుక వారు సోషల్ మీడియాలో తమ తమ పార్టీల తరపున ప్రత్యర్ధులతో యుద్ధాలు చేస్తున్నారు. ఆ యుద్ధాలు శృతి మించి వ్యక్తిగత దూషణలు, అసభ్యకర వ్యాఖ్యలు, ఫోటోల మార్ఫింగ్ చేసి వేధించడం వంటివి పరిపాటిగా మారిపోయాయి.
రాజకీయాలలో ఉన్నవారు నైతిక విలువలు పక్కన పెట్టి ప్రత్యర్ధులపై ఎదురుదాడి చేస్తూ తాత్కాలికంగా పైచేయి సాధించవచ్చు. కానీ కత్తితో యుద్ధాలు చేసేవాడు చివరికి ఆ కత్తికే బలవుతాడన్నట్లు, సదరు నేతలు కూడా ఏదో ఓ రోజున వాటికి బలవుతుంటారు.
కానీ ఈ విషయం అర్ధయ్యేసరికి చాలా ఆలస్యమవుతుంది. కనుక దీనికి దూరంగా ఉన్నవారితో సహా అందరికీ ఈ బురద అంటుకోకమానదు.
కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎట్టకేలకు సోషల్ మీడియాలో ఈ అసాంఘిక శక్తులను కట్టడి చేసేందుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటుచేయాలనుకోవడం చాలా మంచి నిర్ణయమే అని చెప్పవచ్చు.
కానీ దీని విధివిధానాలు, అధికారాలు, పరిమితులు అన్నీ రాజ్యాంగానికి లోబడి పూర్తి పారదర్శకంగా ఉండాలి. అప్పుడే ఈ ఆలోచన సత్ఫలితాలు ఇస్తుంది. లేకుంటే రాజకీయ కక్ష సాధింపు కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థగా మిగిలిపోతుంది.
Festival releases are usually a dream for film producers for better openings and a chance…
Yashasvi Jaiswal has started working on wicketkeeping ahead of the 2026-27 Ranji Trophy season, but…