
ప్రో. నాగేశ్వర్ ఎపిసోడ్ తర్వాత ఏపీ-తెలంగాణ మధ్య విభేదాలు మరోసారి సోషల్ మీడియాలో భగ్గుమన్నాయి. రెండు రాష్ట్రాల సోషల్ మీడియా వారియర్స్ తమ తమ రాష్ట్రాల తరపున యుద్ధాలు చేస్తున్నారు. ఒకరిపై ఒకరు విరుచుకుపడుతున్నారు. అయితే తమ రాష్ట్రంలోనే ఏకాభిప్రాయం, ఐఖ్యత లేనప్పుడు జీవితంలో మనమెన్నడూ చూడని పొరుగువారితో యుద్ధాలు అవసరమా?
ఉదాహరణకు తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నేతల మద్య, వారియర్స్ మధ్య నిరంతరం యుద్ధాలు సాగుతూనే ఉంటాయి. తెలంగాణ తల్లి విగ్రహం మొదలు రైతు డిస్కం వరకు ఎవిషయంలోను ఏకాభిప్రాయం లేక పరస్పరం విమర్శలు చేసుకుంటూ మళ్ళీ పొరుగు రాష్ట్రంతో కూడా యుద్ధాలు అవసరమా?
ఆంధ్రప్రదేశ్‌లోనూ పరిస్థితి భిన్నంగా లేదు. టీడీపీ, వైసీపీ, జనసేనల మధ్య రాజకీయ యుద్ధం ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది. మూడు పార్టీలకు చెందిన సోషల్ మీడియా సైన్యాలు ప్రతిరోజూ పరస్పరం తలపడుతూనే ఉంటాయి. కానీ ఏదైనా వివాదం వచ్చినప్పుడు తెలంగాణతో యుద్ధానికి సై అంటారు.
అయితే తెలంగాణ లేదా మరో రాష్ట్రంవారు ఎవరైనా సిఎం చంద్రబాబు నాయుడు లేదా టీడీపీని విమర్శిస్తే వైసీపీ వారియర్స్ వెంటనే ఎదురుదాడి చేస్తారా? అంటే చేయరనే తెలుసు. ఆ అవసరం లేదు కూడా.
అదే విధంగా టీడీపీ-జనసేన మధ్య కూడా పొత్తులు, నాయకత్వం, భవిష్యత్ రాజకీయాల విషయంలో తరచూ ‘తేలికపాటి యుద్ధాలు’ జరుగుతూనే ఉంటాయి.
అంటే ఒక రాష్ట్రంలోనే రాజకీయాలు, ప్రాంతాలు, కులాలు, భావజాలాల పరంగా ఇన్ని విభేదాలు ఉన్నప్పుడు, పొరుగు రాష్ట్రంతో శత్రుత్వం అవసరమా?
వాస్తవానికి రెండు రాష్ట్రాల ప్రజల సమస్యలు కూడా దాదాపు ఒకటే. ఉపాధి, పెట్టుబడులు, అభివృద్ధి, విద్య, వైద్యం వంటి అంశాలే ఎక్కువ మందిని ప్రభావితం చేస్తాయి. కానీ వాటి కంటే ప్రజలపై ఇప్పుడు రాజకీయ పార్టీల ప్రభావం బాగా ఎక్కువైపోయింది. అందువల్లే సమస్యలను పక్కనపెట్టి యుద్ధాలు చేస్తుంటారు. పొరుగు రాష్ట్రం వచ్చి మనల్ని దోచేస్తుందనే ఊహాజనిత భయాలతో యుద్ధాలు చేస్తుంటారు.
మన పాలకులు లేదా గత ప్రభుత్వాలు భారీగా అవినీతికి పాల్పడి దోచేసుకున్నాయని ఒకవైపు బాధపడుతూ మరోవైపు పొరుగు రాష్ట్ర ప్రజలే మనకు శత్రువులన్న భావనను పెంచుకోవడం ఎంతవరకు సమంజసం? అయినా పొరుగు రాష్ట్రంలో ప్రవేశించి దోచేసుకోవడానికి ఇదేమీ బ్రిటిష్, మొఘల్ రాజుల కాలం కాదు కదా? ప్రజాస్వామ్య భారతదేశం. ఈ దేశంలోనే అందరం కలిసి ఉన్నాము. రాజకీయాలలో శత్రువులు సహజం. కానీ వారి కోసం ప్రజలు శత్రువులుగా మారాల్సిన అవసరం లేదు. దీనిని గుర్తిస్తే చాలు ఇటువంటి యుద్ధాలు వాటంతట అవే ఆగిపోతాయి.
Venkatesh’s much-hyped Aadarsha Kutumbam AK 47, directed by Trivikram, has been indefinitely postponed. Producer Naga…
The Ministry of External Affairs in India has amended the passport rules for minors of…