
కానీ సంక్షేమ భారంతో నానాటికీ క్రుంగిపోతున్న జగన్ సర్కార్, ఆ తర్వాత ఏపీఎస్ ఆర్టీసీ, కార్మికుల పట్ల సవతితల్లి ప్రేమ చూపడం మొదలుపెట్టింది. పేరుకు ప్రభుత్వంలో విలీనం చేసినా వారిని ప్రభుత్వోద్యోగులుగా ఎన్నడూ పరిగణించలేదు. వారితో సమానంగా వేతన సవరణ చేయలేదు. కనీసం బకాయిలు కూడా చెల్లించలేదు. పైగా డీజిల్ సెస్ పేరుతో ఏపీఎస్ ఆర్టీసీ కాస్త ఆదాయం పెంచుకొంటే దానిలో 25 శాతం వాటా వసూలు చేసుకొంటోంది. గుంతలు పడిన రోడ్లపై తిరుగుతున్న డొక్కు బస్సులు పూర్తిగా పాడైపోవడంతో వాటి స్థానంలో కొత్త బస్సులు కొనేబదులు అద్దె బస్సులను తీసుకొని తిప్పడం మొదలుపెట్టింది.
ఆర్టీసీ డ్రైవర్లకు మరో కష్టం వచ్చిపడిందిప్పుడు. డ్రైవర్ వృత్తిలో ఉండేవారందరికీ వెన్నుపూస, మోకాలు, భుజం, కిడ్నీ, కళ్ళు, శ్వాసకోశ సమస్యలు వస్తుంటాయి. ఏపీఎస్ ఆర్టీసీ డ్రైవర్లలో చాలామంది ఇటువంటి ఆరోగ్య సమస్యలతో సతమతమవుతూ చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న డ్రైవర్లు చికిత్స తీసుకొని కోలుకొని మళ్ళీ విధులలో చేరేందుకు వస్తే ఆర్టీసీ మెడికల్ బోర్డు ‘అన్ ఫిట్ ఫర్ డ్యూటీ’ అనే ముద్రవేస్తోంది.
ఒకవేళ వారికి ఇంకా ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు భావిస్తే ఆర్టీసీలోనే వేరే పని లేదా వేరే శాఖలలో పని కల్పించాల్సి ఉంటుంది. కానీ అసలు ‘ఏ ఉద్యోగానికి పనికిరారు’ అని ముద్రవేసి, ఆరోగ్య కారణాలతో ఉద్యోగానికి రాజీనామా చేయాలని పై అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. నిజానికి అటువంటి పరిస్థితులలో ‘వాలంటీరీ రిటైర్మెంట్’ ఇచ్చి పంపించవచ్చు. కానీ అలా చేస్తే వారి మిగిలిన సర్వీస్ కాలం అంతటికీ ప్రభుత్వం సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. అది భరించే స్థితిలో లేదు కనుక ఆరోగ్య కారణాలతో ఉద్యోగానికి రాజీనామా చేయాలని పై అధికారులు ఒత్తిడి చేస్తున్నారు.
ఉద్యోగసంఘాల నాయకులు ఈ సమస్యపై అధికారులతో మాట్లాడుతున్నా వారు కూడా తమ చేతుల్లో ఏమీ లేదని అంతా ‘పైవాడి’ ఆదేశం ప్రకారమే చేయవలసి వస్తోందని నిసహాయత వ్యక్తం చేస్తున్నారు. కనుక ఏపీఎస్ ఆర్టీసీ డ్రైవర్లు ఓ పక్క అనారోగ్య సమస్యలతో, మరోపక్క ఉద్యోగం ఊడిపోతోందనే భయాందోళనతో ఏమి చేయాలో పాలుపోక, ఎవరికి మొరపెట్టుకోవాలో తెలీక బాధపడుతున్నారు.
ఆర్టీసీలో తోటి కార్మికులు ఎదుర్కొంటున్న ఈ సమస్యలను చూసి, మిగిలినవారు కూడా ఏ చిన్నపాటి అనారోగ్య సమస్య తలెత్తినా హడలిపోతున్నారు. ‘నేను విన్నాను… నేను చూశాను… నేనున్నాను’ అంటూ గొప్పగా చెప్పుకొనే జగనన్నకు ఆర్టీసీ కార్మికుల కష్టాలు కనపడుతున్నాయో లేదో? వారి గోస వినబడుతోందో లేదో?
Vishwaksen’s #CULT is gearing up for a worldwide theatrical release on October 30. The project…
Sandeep Reddy Vanga has postponed Prabhas' Spirit once again, with the film now scheduled to…