Telugu

కాంగ్రెస్ చేసింది రాజకీయాలే… మరి మీరు చేసిందేంటి..?

రాజ్యసభ సభ్యుడు కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లు వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఒక ప్రధాన ప్రయోజనం చేకూరింది. ఎలాగైనా ‘స్పెషల్ స్టేటస్’ వస్తుందని ఇంకా ఆశల్లో ఎవరైనా ఉంటే… అవి ఒట్టి కలలుగానే మిగిలిపోక తధ్యం తప్పదని కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేసారు. ఏపీకి ‘ప్రత్యేక హోదా’ మా వల్ల కాదు… అంటూ తేల్చేసారు. దానికి గల కారణాలను కూడా తన సుదీర్ఘ ప్రసంగంలో వివరించారు.

వివరణతో రాజకీయ ప్రత్యర్ధి పార్టీ అయిన కాంగ్రెస్ పై మండిపడ్డారు. ‘హోదా హోదా అంటూ కేవలం రాజకీయాలు మాత్రమే చేస్తున్నారు, నిజంగా ప్రత్యేక హోదా మీకు ఇవ్వాలని ఉంటే, ఆనాడు చట్టంలో ఎందుకు పొందుపరచలేదు’ అంటూ విరుచుకుపడ్డారు. ఒక రకంగా ఆలోచిస్తే… అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యలు నూటికి నూరు శాతం నిజం. కాంగ్రెస్ కుటిల రాజకీయానికి ఆంధ్రప్రదేశ్ బలైన మాట వాస్తవమే. అయితే మరో వైపున ఉన్న బిజెపి ఏం చేసింది? రాజకీయాలకతీతంగా ఏపీ కోసం పోరాడిందా? అంటే నోరెళ్ళబెట్టాల్సిందే.

ADVERTISEMENT

పునర్విభజన చట్టంలో ‘ప్రత్యేక హోదా’ లేదన్న విషయం ఆనాడు బిజెపి పెద్దలకు తెలియదా? అంటే అంత తెలియకుండానే రాష్ట్ర విభజన వంటి కీలక విషయంలో తేలికపాటుతనాన్ని వ్యవహరించారా? ఒకవేళ తెలిసి వుంటే విభజన బిల్లుకు ఎందుకు మద్దతు తెలిపారు? ఆనాడే ఈ అంశాన్ని బిల్లులో చేర్చాలని పట్టుబట్టి ఉండవచ్చు కదా!? లేదా బిల్లులో చేర్చలేని పక్షంలో ప్రత్యేక హోదా సాధ్యం కాదన్న విషయం బహిరంగంగా చెప్పవచ్చు కదా!? అలా గాక… ఏపీకి వచ్చి ‘ప్రత్యేక హోదా’ పదేళ్ళు ఇస్తామని ప్రజలకు వాగ్దానం చేసిందెవరు? కాంగ్రెస్ పార్టీ వారా? బిజెపి వర్యులా? దీనినేమంటారు… రాజకీయమా..? లేక తెలుగు డిక్షనరీలో పదాలు వెతికి సరికొత్త నామకరణం చేయాలా..?

సరే… అంతా జరిగిపోయింది… ఊహకందని విధంగా, ఎవరూ అంచనాలు వేయని రీతిలో బిజెపి సోలోగా విజయాన్ని అందుకుంది. ఇక్కడ నుండి ‘స్పెషల్ స్టేటస్’ అంశంపై ఏపీ ప్రజలకు ఏం చెప్పారు. తొలుత… దేశంలో ఇతర రాష్ట్రాలు అంగీకరించడం లేదని చెప్పినదెవరు? ఆ తర్వాత నీతి అయోగ్ నివేదిక రావాలని కాలయాపన చేసిందెవరు? విభజన చట్టంలో లేదు గనుక, అమలుకు సాధ్యం కాదు అన్న విషయాన్ని ఏనాడైనా ఏపీ ప్రజలకు చెప్పారా? నేడు కూడా ఓ కాంగ్రెస్ ఎంపీ ప్రైవేట్ బిల్లు రూపంలో అడిగి, రచ్చ రచ్చ చేస్తే గానీ, సమాధానం చెప్పలేదు. దీనిని ఏమంటారో ఎవరికైనా తెలుసా? రాజకీయమా? లేక ఇంకేమైనా తనమా..?

నాడు కాంగ్రెస్ చేసింది ఎంత పెద్ద తప్పో… నేడు అంతకుమించిన పొరపాటును బిజెపి చేస్తోందన్న విషయం రాజకీయ విశ్లేషకులు వ్యక్తపరుస్తున్నారు. కేవలం బిల్లులో పొందుపరచలేదు అన్న కారణం ఒక్కటే ఏపీ ప్రత్యేక హోదా అడ్డుకోలేదు, నిజంగా బిజెపికి చిత్తశుద్ది ఉంటే, సినీ నటుడు శివాజీ గతంలో చెప్పినట్లు… కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోడీకి కేవలం అది కొద్ది సెకన్ల సమయం తీసుకునే పని మాత్రమే. బిల్లు వంకతో కాంగ్రెస్ పై ఎదురుదాడి చేస్తున్న బిజెపి పెద్దలంతా నిజంగా రాష్ట్రానికి ఏం చేసారు? ప్రత్యేక హోదా ఇవ్వలేదు సరే… స్పెషల్ ప్యాకేజ్ ఏమైనా మంజూరు చేసారా?

కేవలం ఎన్నికల సమయంలోనే బీహార్ కు 1.10 కోట్ల ప్యాకేజ్ ని ప్రధాని మోడీ ఎందుకు కేటాయించారు? రాజకీయం కోసమా? లేక మంచితనం మీద ఇచ్చారా? ఇలా చెప్పుకుంటూ పోతుంటే లెక్కలేనన్ని ప్రశ్నలు తాండవిస్తాయి. రాజధాని కోసం కేవలం 1050 కోట్లు ఇచ్చి, దానిని 2500 కోట్లుగా చెప్పుకునే నీచ స్థితిలో బిజెపి ఆర్ధిక వేత్తలు ఉండడం దేశం సిగ్గుపడాల్సిన విషయం. ఏపీ ప్రజలు పిచ్చివాళ్ళని భావిస్తున్నారో… లేక ఏమీ తెలియని అమాయకులు అనుకుంటున్నారో గానీ, ఇచ్చిన కొద్దిపాటి కేటాయింపులలో కూడా అసత్యాలు పలకడం బహుశా కాంగ్రెస్ వారికి కూడా తెలియని రాజకీయమేమో..?

ఇప్పటివరకు కేటాయించిన మొత్తానికి ఏపీ లెక్కకట్టి చెప్పాలి… అప్పటివరకు నిధుల మంజూరు ఉండదని తెగేసి చెప్పిన ఆర్ధిక మంత్రివర్యులకు తొలి ఏడాది రెవిన్యూ లోటు గుర్తు లేదా? కాగ్ నివేదిక ప్రకారమే దాదాపు 12 వేల కోట్లు విభజన జరిగిన తొలి ఏడాదిలో ఏపీకి కేంద్రం మంజూరు చేయాల్సి ఉంది. మరి అందులో ఎంత శాతం మంజూరు చేసారు? రాష్ట్ర రెవిన్యూ లోటు పూడ్చాలన్న బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని విభజన బిల్లులోనే ఉంది కదా? మరి అది ఎందుకు అమలు చేయలేదు? తొలి ఏడాది లోటు అలాగే ఉండగానే, రెండవ ఏడాది లోటు వచ్చి వెళ్ళింది, ప్రస్తుతం మూడవ ఏడాది కూడా లైన్లో ఉంది. మరి దీనికేం సమాధానం చెప్తారు?

చివరగా… పాత వాక్యమే అయినప్పటికీ… అదే నిజమైనది గనుక మరోసారి చెప్పకతప్పడం లేదు… రాష్ట్రాన్ని విభజించి ఆంధ్రప్రదేశ్ కు కాంగ్రెస్ చేసిన ద్రోహం కంటే… ప్రస్తుతం బిజెపి చేస్తున్న ద్రోహం ఎక్కువన్న భావన ఇప్పటికే ఏపీ ప్రజల్లో బలంగా ఏర్పడింది. దానిని మరింత లోతుకు తీసుకెళ్ళే విధంగా కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ చేసిన ప్రసంగం ఉంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Comrade Kalyan Teaser: A Mix of Comedy, Love & Naxalism

Hero Sree Vishnu is coming up with a comedy entertainer Comrade Kalyan, directed by Janakiram…

6 minutes ago

CBN Drops Good News On Teachers Day!

Today, September 5 happens to be teachers Day and Andhra Pradesh chief minister Chandrababu Naidu…

22 minutes ago