
దక్షిణాది రాష్ట్రాలలో ఒక్క కర్ణాటక రాష్ట్రంలో మాత్రమే బీజేపీ అధికారంలోకి రాగలిగింది. ఇటీవల ఎన్నికలలో అక్కడా ఓడిపోయింది. ఇప్పుడు తెలంగాణ ఎన్నికలలో గెలిచి అధికారంలోకి రావాలని గట్టిగా ప్రయత్నిస్తోంది.
ఇటీవల బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరిన విజయశాంతి మీడియాతో మాట్లాడుతూ, “ఢిల్లీలో బీజేపీ పెద్దలు కేసీఆర్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని, తప్పకుండా చర్యలు తీసుకొంటామని హామీ ఇవ్వడంతోనే మావంటి ఉద్యమకారులు బీజేపీలో చేరారు. కానీ కేసీఆర్ ప్రభుత్వంపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఎందువల్ల?
ఎన్నికలకు ముందు బండి సంజయ్ని పార్టీ అధ్యక్ష పదవి నుంచి ఎందుకు తొలగించారో ఇంతవరకు చెప్పనే లేదు. ఆయనను తొలగించడంతో తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది. బిఆర్ఎస్, బీజేపీ పెద్దల మద్య రహస్య అవగాహన ఉందని ఇవన్నీ నిరూపిస్తున్నాయి కదా?” అని ప్రశ్నించారు.
ఆమె కాంగ్రెస్లో చేరారు కనుకనే ఈవిదంగా మాట్లాడుతున్నారనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇవన్నీ వాస్తవాలే అని అందరికీ తెలుసు. తెలంగాణలో బీజేపీని చేజేతులా దెబ్బ తీసుకొని ఇప్పుడు ఎన్నికలలో గెలవాలని ఆరాటపడుతుండటం, గెలవగలమని భ్రమిస్తుండటం రెండూ విచిత్రంగానే ఉన్నాయి కదా?
ఇక ఏపీ బీజేపీ పట్ల దాని అధిష్టానమే కాదు… ఏపీ బీజేపీలో నేతలు కూడా కూర్చొన్న కొమ్మను నరుక్కొన్నట్లుగానే వ్యవహరిస్తున్నారని చెప్పక తప్పదు.
రాష్ట్రంలో బీజేపీకి ఎవరు అధ్యక్షులుగా ఉంటే వారిని మిగిలినవారు వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఆనాడు కన్నా లక్ష్మినారాయణ, తర్వాత సోము వీర్రాజు ఇప్పుడు దగ్గుబాటి పురందేశ్వరి ముగ్గురికీ పార్టీలో నేతల సహకారం లభించడం లేదు. మద్యం, ఇసుక కుంభకోణాలపై ఆమె వైసీపి ప్రభుత్వంతో ఒంటరిగా పోరాడుతుంటే పార్టీలో ఎవరూ ఆమెకు అండగా నిలబడటం లేదు!
పైగా వైసీపి ఎంపీ ఏపీ బీజేపీలో చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తూ, తమ అధ్యక్షురాలు పురందేశ్వరిని అనుచితంగా విమర్శిస్తుంటే, పార్టీలో ఏ ఒక్కరూ ముందుకు వచ్చి వాటిని ఖండించడం లేదు. ఆమెకు సంఘీభావం తెలుపడం లేదు. ఏపీ బీజేపీలో నేతల తీరు ఈవిదంగా ఉంటే వారి అధిష్టానం కూడా మరింత అయోమయం సృష్టిస్తోంది.
మిత్రపక్షమైన జనసేనను పట్టించుకోకుండా దగ్గుబాటి పురందేశ్వరిని నిందిస్తూ, ఏపీ బీజేపీలో చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్న వైసీపికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. కానీ తెలంగాణలో జనసేనతో పొత్తులు పెట్టుకొంది. దీంతో ఏపీ బీజేపీకి ఏవిదంగా ముందుకు సాగాలో తెలీని అయోమయ పరిస్థితి కల్పించడమే కాక ఏపీ బీజేపీ విశ్వసనీయతను కూడా స్వయంగా దెబ్బతీసుకొంటోందని చెప్పక తప్పదు.
ఆనాడు కాంగ్రెస్ అధిష్టానం ఏపీ కాంగ్రెస్ను బలిచేసుకొంటే, బీజేపీ అధిష్టానం కూడా అదేవిదంగా వ్యవహరిస్తుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో బీజేపీ ఎదిగేందుకు తోడ్పడాల్సిన అధిష్టానం ఈవిదంగా ఎందుకు వ్యవహరిస్తోంది?అంటే బహుశః దానికి ఎంపీ సీట్లపై తప్ప రాష్ట్ర బీజేపీపై ఆసక్తి, శ్రద్ద లేకపోవడమే అని అనిపిస్తోంది.
Rajinikanth's Jailer 2 has taken a strong start at the global box office and is…
The TDP, Jana Sena and BJP have finalised their seat-sharing agreement for Andhra Pradesh’s urban…